School Holidays Due To Rains In AP And Telangana: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలతో జనజీవనం స్తంభించింది. వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో రహదారులపైకి నీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్నిచోట్ల వాగులు కట్టలు తెగి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. వరద బాధితులను సమీప స్కూళ్లల్లో తాత్కాలికంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరోవైపు, భారీ వర్షాలతో ఈ నెల 2న (సోమవారం) విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. కొన్ని చోట్ల ప్రైవేట్ విద్యా సంస్థలు సెలవులు ఇవ్వడం లేదని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 


అటు, తెలంగాణలోనూ (Telangana) భారీ వర్షాల క్రమంలో సోమవారం (సెప్టెంబర్ 2) అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సోమవారం సాయంత్రం వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పలుచోట్ల రహదారులపై భారీగా వరద ప్రవహిస్తోందని.. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించారు. వాగులు, వంకలు ఉద్ధృతంగా ఉన్నందున ఎవరూ చూసేందుకు వెళ్లొద్దని సూచించారు.


భారీ వర్షాలతో నిలిచిన రాకపోకలు


ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ - ఏపీ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇరు రాష్ట్రాల సరిహద్దు రామాపురం వద్ద చిమిర్యాల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా.. కోదాడ నుంచి వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. నల్లబండగూడెం వద్ద జాతీయ రహదారిపైకి నీరు చేరింది. ఈ క్రమంలో అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. 


Also Read: Khammam Rains: ఖమ్మంలో వరదల్లో చిక్కుకున్న ప్రకాష్ నగర్ వాసులు, ఏపీ నుంచి రంగంలోకి దిగిన 2 హెలికాప్టర్లు