Telangana Deputy CM Bhatti Vikramarka ఖమ్మం: భారీ వర్షాలతో మున్నేరు వాగుకు వరద ఉధృతి పెరిగింది. వరద ప్రవాహం పెరగడంతో ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్ జలదిగ్భందంలో చిక్కుకుంది. ఒకటో అంతస్తు వరకు వరద నీళ్లు రావడంతో ప్రభుత్వ సహాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ప్రకాష్ నగర్ లో వరదల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు హెలికాప్టర్ ను పంపించాలని సీఎస్ శాంతికుమారిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం సీఎస్ కు భట్టి ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. 


మరోవైపు బయ్యారం చెరువు కట్ట తెగడంతో మున్నేరు ప్రవాహం పెరిగింది. ఈ క్రమంలో మోతీ నగర్ దాబాల్ బజార్, వెంకటేశ్వర నగర్ ప్రాంతాల వారు సైతం వరద నీటిలో చిక్కుకుపోయారు. శనివారం రాత్రి నుండి ఆహారం లేదని బాధితులు చెబుతున్నారు. అధికారుల నుంచి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఖమ్మం 3 టౌన్ ప్రకాష్ నగర్ బ్రిడ్జి పై నుండి ప్రవహిస్తూ ప్రకాష్ నగర్ కు అనుకుని ఉన్న గోళ్ళ పాడు ఛానల్ కాలువ వరకు మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుంది.


భారీ వర్షాల కారణంగా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు గోదావరి నది తీరం వెంబడి అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై ఖమ్మం కలెక్టరేట్  నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర ఉన్నతాధికారులతో భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. 



విశాఖ నుంచి బయలు దేరిన రెండు హెలికాప్టర్ లు
ఖమ్మంలోని ప్రకాశ్ నగర్ వద్ద మున్నేరు బ్రిడ్జి పై వరద లో చిక్కిన వారిని రక్షించేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడారు.  హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ వచ్చే అవకాశం లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాయం తీసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కార్యాలయం సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ తో మంత్రి తుమ్మల మాట్లాడారు. దాంతో విశాఖ నావల్ బేస్ నుంచి రెండు డిఫెన్స్ హెలికాప్టర్ లను ఖమ్మం పంపించారు. మున్నేరు వరదలో చిక్కిన 9 మందిని ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా కాపాడాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా ఖమ్మం నగరంలో వరదల్లో చిక్కుకున్న వారిని ఆదుకోవాలని స్వచ్ఛంద సంస్థలకు మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. వరద బాధితులకు తాగునీళ్ళు ఆహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.


క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలిస్తున్న మంత్రి సీతక్క


ములుగు జిల్లాలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సీతక్క క్షేత్రస్థాయిలో పర్యటించారు. వరదలతో కొట్టుకుపోయిన రహదారులను పరిశీలించారు. భారీ వర్షాలతో నీటి ఉధృతి అధికంగా ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. నీటి ప్రవాహం అధికంగా ఉన్నచోట గస్తీ పెంచి రాకపోకలు నియంత్రించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. గ్రామాలు, నివాసిత ప్రాంతాల్లోకి వరద నీరు చేరకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా ముంపు ప్రాంతాల్లో జెసిబిలను అందుబాటులో ఉంచి వరద నీరును గ్రామాలలోకి రాకుండా దారి మళ్లించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Also Read: Telangana News: తెలంగాణలో రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, భారీ వర్షాల్లో రెస్క్యూ ఆపరేషన్స్