Bhoodan Lands Issue: తెలంగాణలో భూదాన్ భూముల అక్రమాలకు సంబంధించి కొంత మంది ఉన్నతాధికారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోది. ఈ వ్యవహారంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు భూములను అక్రమంగా కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం 2025 ఏప్రిల్‌లో తెలంగాణ హైకోర్టు సీబీఐ , ఈడీ దర్యాప్తు ఎందుకు చేయకూడదని ప్రశ్నించింది. తాజాగా ఈ అంశంలో ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు.
1950లలో వినోబా భావే ఆధ్వర్యంలో పేద రైతుల కోసం భూములను సేకరించి పంపిణీ చేసే ఉద్యమం జరిగింది. ఈ భూములు భూదాన్ యజ్ఞ బోర్డు ఆధీనంలో ఉంటాయి మ. వీటిని అన్యాక్రాంతం చేయడం, విక్రయించడం చట్టవిరుద్ధం. నాగారం గ్రామంలో సర్వే నంబర్లు 181, 182, 194, 195లోని భూదాన్ భూములు అక్రమంగా అమ్మకాలు, కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీనియర్ ఐఏఎస్ అధికారులు , ఐపీఎస్ అధికారులు సహా మొత్తం 26 మంది ఉన్నతాధికారులు ఈ స్థలాలను కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు. అధికారులు తమ పేర్లపై లేదా వారి కుటుంబ సభ్యుల పేర్లపై బినామీల ద్వారా భూములను రిజిస్టర్ చేసుకున్నారని కోర్టులో పిటిషన్ దాఖలయింది. భూదాన్ భూములు చట్టపరంగా అమ్మకాలు నిషిద్ధం అయినప్పటికీ తమకు ఉన్న అధికారాలతో అక్రమంగా కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్లు చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పిటిషన్ పై విచారణలో హైకోర్టు సర్వే నంబర్లు 181, 182, 194, 195లోని భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్, మహేశ్వరం , ఎల్బీనగర్ సబ్-రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ భూములపై ఎలాంటి క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు లేదా మార్పులు చేయరాదని షరతు విధించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, భూదాన్ యజ్ఞ బోర్డు, సీబీఐ, ఈడీ, అధికారులు మరియు వారి కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. ఈ అక్రమాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఉండటం వివాదాస్పదమయింది.
గతంలో ఈ భూములపై ఈడీ విచారణ చేసింది. ఐఎఎస్ అధికారి అమోయ్ కుమార్ ను పలుమార్లు విచారణకు పిలిచింది. డి. అమోయ్ కుమార్ రంగారెడ్డి , మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల కలెక్టర్‌గా ఉన్న సమయంలో భూదాన్ భూముల అక్రమాలు జరిగినట్లుగా ఈడీ గుర్తించింది. అమోయ్ కుమార్ ధరణి పోర్టల్‌లో భూమి యాజమాన్య రికార్డులను అక్రమంగా మార్చి, నిషేధిత జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్‌లను సులభతరం చేశారని ఆరోపణలు ఉన్నాయి. - ధరణి పోర్టల్‌ను BRS ప్రభుత్వం భూమి రికార్డుల డిజిటైజేషన్ కోసం ప్రవేశపెట్టింది. అయితే, అమోయ్ కుమార్ ఈ వ్యవస్థను దుర్వినియోగం చేసి, భూమి యాజమాన్య హక్కులను ప్రైవేటు వ్యక్తులకు బదిలీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వవ్యవహారంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉండటంతో కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందోనని ఆసక్తి ఏర్పడింది.