Muthayya Movie Trailer Released By Rajamouli: బలగం, బాపు వంటి చిత్రాలతో మంచి ఫేమ్ సంపాదించుకున్న సుధాకర్ రెడ్డి (Balagam Sudhakar Reddy) ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'ముత్తయ్య' (Muthayya). భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించిన ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తైనా ఇప్పటివరకూ విడుదలకు నోచుకోలేదు. అయితే, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమై పలు అవార్డులు అందుకుంది. తాజాగా.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుంది.
ట్రైలర్ రిలీజ్ చేసిన రాజమౌళి
ఈ మూవీ ట్రైలర్‌ను దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli), నిర్మాత శోభు యార్లగడ్డ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. 'ఈ సినిమా ట్రైలర్ హృదయాన్ని కదిలించేలా ఉంది. మూవీ టీంకు శుభాకాంక్షలు.' అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ట్రైలర్ ఎలా ఉందంటే?
చిన్నప్పటి నుంచి ఉన్న నాటకాల పిచ్చితో 70 ఏళ్ల వృద్ధుడు నటుడు కావాలని కలలు కంటాడు. ఈ క్రమంలోనే సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. తన ఊరిలోనే ఉండే మరో యువకుడితో కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేసేందుకు ట్రై చేస్తుంటాడు. అయితే, అందుకు కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించవు. స్నేహితులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఉండదు.
ఏదైనా మనం అనుకుంటే అది ముందే చేసెయ్యాలని.. లేదంటే చంపేసుకోవాలని, కానీ వెంట పెట్టుకుని తిరగకూడదని.. 'ముత్తయ్య' చెప్పే డైలాగ్ ఆలోచింపచేస్తుంది. ఈ క్రమంలో ఆ పెద్దాయన ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నాడు. చివరకు వృద్ధుడు అనుకున్నది సాధించాడా? అనేదే ఈ మూవీ స్టోరీ. పూర్తి పల్లె వాతావరణంలో ఎమోషనల్, హార్ట్ టచింగ్‌గా మూవీని తెరకెక్కించినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.
మే 1 నుంచి స్ట్రీమింగ్
దాదాపు రెండున్నరేళ్ల తర్వాత 'ముత్తయ్య' మూవీ ఇప్పుడు నేరుగా తెలుగు ఓటీటీ 'ఈటీవీ విన్'లోకి స్ట్రీమింగ్ కానుంది. మే 1 నుంచి ఈ సినిమా అందుబాటులోకి ఉండనుందని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. 'కలలు, ఆశ, అభిరుచి హృదయాన్ని కదిలించే కథ. చెన్నూరుకు చెందిన 70 ఏళ్ల కలలు కనే వారు స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని వీక్షించండి.' అంటూ పేర్కొంది.
Also Read: మనల్ని ఎవడ్రా ఆపేది? - పవర్ స్టార్ డైలాగ్‌తో నేచురల్ స్టార్.. రాజమౌళి 'SSMB29'తో 'హిట్ 3' లింక్ పెట్టేశారుగా..
బలగం, బాపు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కె.సుధాకర్ రెడ్డి ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు భాస్కర్ మౌర్య ఈ మూవీని రూపొందించగా.. హైలైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్ఎల్పి బ్యానర్లపై వంశీ కారుమంచి, వృందా ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. దివాకర్ మణి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్, సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు.
కామెడీ డ్రామాగా రూపొందిన 'ముత్తయ్య' సినిమా లండన్‌లోని యూకే ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వరల్డ్ ప్రీమియర్‌గా ప్రదర్శితమైంది. 28వ కోల్‌కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఇండియన్ లాంగ్వేజెస్ కేటగిరీలో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, దుబాయ్‌లోని మెటా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ తొలి దర్శకుడు, ఇండిక్ చిత్రోత్సవాల్లో ఉత్తమ చిత్రం అవార్డులు సొంతం చేసుకుంది. అలాగే.. సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మాంట్రియల్ (కెనడా), హ్యాబిటాట్ ఫిల్మ్ ఫెస్టివల్ (న్యూ ఢిల్లీ) ఇండియా, ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ అల్బెర్టా (కెనడా), థర్డ్ యాక్షన్ ఫిల్మ్ ఫెస్టివల్ (కెనడా), సినిమా కింగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (బంగ్లాదేశ్), ఇస్చియా గ్లోబల్ ఫెస్టివల్ (ఇటలీ) ల్లో కూడా ప్రదర్శించబడింది.