30 years of Chandrababu first oath as CM నారా చంద్రబాబు నాయుడు.. దేశ రాజకీయాల్లో పరిచయ అవసరం లేని పేరు. దేశంలో ఉన్న సీనియర్ రాజకీయ నాయకుల్లో ఆయన కూడా ఒకరు. దేశంలో నాలుగు సార్లు ముఖ్యమంత్రులుగా పనిచేసిన అతికొద్ది మంది నాయకుల్లో చంద్రబాబు కూడా ఉన్నారు. తెలుగు రాజకీయాల్లో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుల్లో చంద్రబాబే ప్రథముడు. ఒక సాధారణ దిగువ మధ్యతరగతికి చెందిన వ్యవసాయం కుటుంబంలో జన్మించి అంచలంచెలుగా ఎదిగారు. ఇప్పటికే కుప్పం నుంచి 7 సార్లు, చంద్రగిరి నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారాయన. ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. గెలుపోటములను రెండింటినీ స్వీకరించారు. ఎన్టీఆర్ కి అల్లుడిగా మారడమే ఆయన జీవితాన్ని మలుపుతిప్పింది. చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సెప్టెంబర్ 1 నాటికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గురించి క్లుప్తంగా తెలుసుకుందాం...


చంద్రబాబు బాల్యం, విద్యాభ్యాసం


తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం(SVU) లో విద్యార్థి నాయకుడిగా చంద్రబాబు రాజకీయ ప్రస్థానం మొదలైంది. 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా, 28 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అత్యధిక కాలం తెలుగుదేశం పార్టీకి అధ్యక్షులుగా కొనసాగి చరిత్ర సృష్టించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లె అనే చిన్న గ్రామంలో 1950 ఏప్రిల్ 20న సామాన్య రైతు కుటుంబంలో ఖర్జూర నాయుడు, అమ్మన్నమ్మ దంపతులకు చంద్రబాబు జన్మించారు. ఆయన చంద్రగిరి ప్రభుత ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి వరకు చదువుకున్నారు. తిరుపతిలోని ఎస్వీయూ ఆర్ట్స్ కాలేజీలో 1972లో బీఏ డిగ్రీ పూర్తి చేశారు. 19974లో ఆర్థిక శాస్త్రంలో పీజీ చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన కారణంగా తన పీహెచ్డీని మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. 


మలుపుతిప్పిన కాలేజీ రాజకీయం
చంద్రబాబు రాజకీయ ప్రస్థానం విద్యార్థి నాయకుడిగా మొదలైంది. యూనివర్సిటీలో యువజన కాంగ్రెస్ నుంచి విద్యార్థి నాయకుడిగా ఉన్నారు. 1978లో తొలిసారి చంద్రగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆనాటి సీఎం టంగుటూరి అంజయ్య మంత్రి వర్గంలో సాంకేతికి విద్య, సినిమాటోగ్రపీ మంత్రిగా పనిచేశారు. అతిచిన్న వయసులోనే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాయకుడిగా గుర్తింపు పొందారు. మంత్రిగా ఉన్న సమయంలోనే 1981 సెప్టెంబర్ 10న ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని వివాహమాడారు.  చంద్రబాబు ఎన్టీఆర్ కుమార్తెను వివాహమాడినా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 1982 లో ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అబ్యర్థిగా పోటీ చేసిన చంద్రబాబు చంద్రగిరిలో ఓటమిపాలయ్యారు. అనతరం టీడీపలో చేరి పార్టీ శిక్షణ శిబిరాలు, పార్టీ సభ్యత్వ నమోదు వంటి కార్యక్రమాలు చూసేవారు. 1984లో నాదెండ్ల భాస్కర్రావు తిరుగుబాటు సమయంలోనూ ఎన్టీఆర్ వెంట ఉండి కీలకంగా వ్యవహరించారు. 1986లో చంద్రబాబును ఎన్టీఆర్ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 1989 ఎన్నికల్లో తొలిసారి టీడీపీ అభ్యర్థిగా కుప్పం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అప్పట్నుంచి నేటి వరకు కుప్పం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. 


1995 సెప్టెంబర్ 1న తొలిసారి ముఖ్యమంత్రి 
సెప్టెంబర్ 1, 1995న చంద్రబాబు నాయుడు తొలిసారి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్టీఆర్ నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. 1995 నుంచి 2004 వరకు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1999 శాసనసభ ఎన్నికల్లో బీజేపీతో జతకట్టి విజయం సాధించారు. 294 సీట్లున్న ఏపీ అసెంబ్లీలో 180 సీట్లలో ఆ పార్టీ విజయం సాధించింది. 42 పార్లమెంట్ సీట్లకు గాను 29 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధంఇచారు. 


ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు రెండు పర్యాయాలు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. మళ్లీ 2014లో బీజేపీతో జతకట్టి 
అదికారం దక్కించుకున్నారు. 2019లో బీజేపీతో విభేదించి అధికారానికి దూరమైన చంద్రబాబు, మళ్లీ 2024లో బీజేపీతో కలిసి ఏపీలో భారీ మెజారిటీతో విజయం సాదించారు. 


విజన్ 2020 పేరుతో ప్రచారం 
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్కు అమెరికా అధ్యక్షుడు, యూకే ప్రధాని వచ్చారు. భవిష్యత్ అవసరాలు, సమస్యలపై చంద్రబాబు విజన్ 2020 పేరుతో ఒక డాక్యుమెంటరీని తయారు రూపొందించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో రూపొందించిన జన్మభూమి, ప్రజల వద్దకే పాలన, పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలు రూపొందించారు.  1998లో హైటెక్ సిటీ ప్రారంభమంది చంద్రబాబు హయాంలోనే.. అనంత‌పురంలోని కియా కార్ల ప‌రిశ్ర‌మ కూడా చంద్ర‌బాబు హ‌యాంలోనే మొద‌లైంది. 


జాతీయ రాజకీయాల్లో టీడీపీ కీలక పాత్ర 


కేంద్రంలో కాంగ్రెసేతర పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో (1996-2004) చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరించారు. 1996 పార్లమెంటరీ ఎన్నికల తరువాత చంద్రబాబు యునైటెడ్ ఫ్రంట్కు కన్వీనర్ గా వ్యవహరించారు. 13 రాజకీయ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వానికి (1996 -1998) హెచ్డి దేవెగౌడ, తరువాత ఐకె గుజ్రాల్ లు ప్రధాన మంత్రులు కావడంలో టీడీపీ కీలకంగా వ్యవహరించింది. ఆ రెండుసార్లు చంద్రబాబుని ప్రధానిగా చేయాలని అన్ని పార్టీలు ప్రతిపాదన చేసినప్పటికీ చంద్రబాబు తిరస్కరించారు. 


చంద్రబాబుపై అలిపిరి వద్ద దాడి 
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబుపై అలిపిరి వద్ద బాంబు దాడి జరిగింది. 2003 అక్టోబర్ 1న తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్తుండా అలిపిరి వద్ద  చంద్రబాబు కాన్వాయ్పై బాంబు దాడి జరిగింది. చంద్రబాబు గాయాలతో బయటపడ్డారు. ఆ నేపథ్యంలో జరిగిన 2004 మధ్యంతర ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది. వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ 185 స్థానాల్లో గెలుపొందగా, టీడీపీ 47 సీట్లకే పరిమితమైంది. పార్లమెంట్లోనూ 42 సీట్లలో కేవలం ఐదుగురే టీడీపీ నుంచి ఎంపీలుగా గెలుపొందారు.