Warangal News : గత కొంతకాలంగా వరంగల్, హన్మకొండ పట్టణాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెందిన అధికారులమంటూ హల్చల్ చేసిన యువకులను వరంగల్ పోలీసుల ప్రత్యేక బృందం అరెస్టు చేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు తరచూ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. అలాగే నిషేధిత సంస్థలకు చెందిన ప్రతినిధులను అరెస్టు చేస్తున్నారు. ఈ సందర్భంలో ఓ యువకుడికి వచ్చిన తప్పుడు ఆలోచన వీరిని నేరం చేయడానికి ఉసిగొలిపింది. 


అసలేం జరిగింది?


 దేశవ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు పలు కేసుల్లో తనిఖీలు చేస్తుంది. మొన్నటి వరకు NIA అంటే తెలియని వారికి సైతం ఈ వరుస దాడులతో ఒక అభిప్రాయం ఏర్పడింది. అంతేకాకుండా దీనికి సంబంధించిన అధికారులను ఏ రకంగా కూడా ప్రభావితం చేయలేమని నిర్ణయం ప్రజల్లో బలంగా నాటుకుంది. ఇదే అదునుగా భావించిన నల్గొండ, కరీంనగర్ కు చెందిన మరో ఇద్దరితో కలిసి ఒక ప్లాన్ కి స్కెచ్ వేశాడో యువకుడు. నాలుగు రోజుల క్రితం వరంగల్ కు చేరుకున్న ఈ ముగ్గురు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురిని ఎన్ఐఏ పేరుతో బెదిరించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న వారితో బాటు పలు భూమి వివాదాల్లో తల దూర్చిన వారిని పకడ్బందీగా ఎంపిక చేసుకుని బెదిరించడం మొదలుపెట్టారు. మీరంతా నిషేధించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నారని, మీ గురించి పూర్తిస్థాయిలో ఆధారాలు మాకు లభించాయని బెదిరించారు. ఎన్ఐఏ అధికారులు అని చెబుతూ పలువురి దగ్గర డబ్బు వసూలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.


ఎవరు వీరంతా?


అయితే ఈ ముగ్గురు యువకులను గురించి వరంగల్ పోలీసులకు ఓ స్థానిక వ్యక్తి ద్వారా సమాచారం అందినట్లు తెలుస్తోంది. అతన్ని సైతం పీఎఫ్ ఐతో సంబంధాలు ఉన్నాయని డబ్బులు డిమాండ్ చేయగా అలాంటిదేమీ లేనట్లు గట్టిగానే సదరు వ్యక్తి సమాధానం ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు అధికారులకు సంబంధించిన ఐడీ కార్డులు, ఇతర వివరాలను ప్రశ్నించగా సదరు యువకులు కంగారు పడడంతో వెంటనే ఆ వ్యక్తి తనకు తెలిసిన ఓ పోలీస్ అధికారిని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ యువకుల్లో ప్రధాన నిందితుడు ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ గతంలో నల్గొండలో దందా చేయగా అది బెడిసి కొట్టడంతో తన సొంత భూమిని అమ్మి తిరిగి బాధితులకు చెల్లించినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే భారీ ఎత్తున ఒకేసారి సంపాదించాలనే ఆశతో సదరు యువకుడు మరోసారి ఎన్ఐఏ పేరుతో టీంను తయారు చేసినట్లు సమాచారం. దీనికోసం కరీంనగర్ కి చెందిన మరో ఇద్దరిని తన గ్యాంగ్ లో మెంబర్లుగా చేర్చుకొని ఎవరు అనుమానించకుండా వరంగల్ కు మకాం మార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. అంతేకాకుండా ఒక డమ్మీ తుపాకీని సమకూర్చుకొని ఎన్ఐఏ అధికారుల లెవల్ లో బిల్డప్ ఇచ్చినప్పటికీ ప్లాన్ బెడిసి కొట్టి పోలీసులకు చిక్కారు. 


Also Read : బుల్లెట్ బైక్‌లే టార్గెట్‌గా చోరీలు, 2 నెలల్లో 100కు పైగా మాయం - మిస్టరీగా మారిన కేసు


 Also Read: Karnataka Road Accident: బాబు చికిత్స కోసం రూ.1 కోటి సమకూరినా, ట్రీట్‌మెంట్‌కు వెళ్తుంటే తీవ్ర విషాదం