Nizamabad Bikes Theft Cases: నిజామాబాద్ నగరం బైక్ దొంగలకు అడ్డాగా మారింది. అందులో ముఖ్యంగా పెద్ద బైకులను టార్గెట్ చేసుకుని చోరీలు చేస్తున్నారు నిందితులు. ప్రధానంగా కొత్త బుల్లెట్ బండ్లను టార్గెట్ చేస్తున్నారు. విలువైన టూ విల్లర్స్ ను చోరీ చేస్తున్నారు. 2 నెలల వ్యవధిలో ఏకంగా 109 కు పైగా టూ వీలర్స్‌ను చోరీ చేశారు. పక్కాగా ఉదయం రెక్కీ నిర్వహిస్తూ... ఓ ముఠాగా ఏర్పడి రాత్రిపూట కొందరు బైక్ లను దొంగిలిస్తున్నారు. ఇప్పుడు నిజామాబాద్ పోలీస్ లకు ఈ బైక్ దొంగల కేసు సవాల్ గా మారింది.
భారీగా పెరిగిపోతున్న బైక్ చోరీ కేసులు
నగరంలో ఉన్న 6 పోలీసు స్టేషన్ల పరిధిలో బైక్ చోరీల కేసులు నిత్యం నమోదు అవుతూనే ఉన్నాయి. ఇలా చోరీకి గురవుతున్న బైక్ లను రాత్రికి రాత్రే ఇతర రాష్ట్రాలకు తరలిoచేస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలా తరలించిన కొన్ని బైక్ ల కలర్స్ ను కూడా మార్చేసి అమ్మేస్తున్నారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో పగటి వేళ రెక్కీ నిర్వహించి రాత్రి సమయంలో నిమిషాల్లో చోరీ చేసేస్తున్నారు కేటుగాళ్లు. జిల్లాలో ఈ మధ్య కాలంలో పదుల సంఖ్యలో బుల్లెట్ బైక్స్, ఇతర కంపెనీల బైక్ లు వందకి పైగా చోరీకి గురయ్యాయి.
పీఎస్‌లో బైక్ యజమానులకు చుక్కెదురు
చోరీకి గురైన బైక్ ల యజమానులకు పోలీస్ స్టేషన్లలో చుక్కెదురవుతోంది. బైక్ పోయిందని ఫిర్యాదు చేయటానికి వెళ్లిన వారికి పోలీసులు ఇస్తున్న సమాధానం మొదట వారం పాటు బైక్ యజమానులు వెతికిన తర్వాత.. దొరక్క పోతే అప్పుడు పోలీస్ స్టేషన్ కు రావాలంటూ పోలీసులు సమాధానం ఇస్తున్నారని బాధితులు చెబుతున్నారు. దీంతో ఈ విషయమై సీపీ నాగరాజు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఎట్టకేలకు బైకు చోరీ దొంగలు కొందర్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
పోలీసుల అదుపులో నిందితులు ..
నిజామాబాద్ పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా కంగుతినే విషయాలు బయటపడ్డాయి. పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుల వద్ద 8 బుల్లెట్ వాహనాలతో పాటు పదుల సంఖ్యలో ఇతర టూ వీలర్ వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. చోరీ చేసిన విలువైన బైకులను ఇక్కడి నుంచి ముందుగా హైదరాబాద్ లోని ఓ వ్యాపారికి నిందితులు విక్రయిస్తున్నారట. అనంతరం ఆ వ్యాపారి వాటిని తనతో సంబంధాలు ఉన్న మరో చోరీ వాహనాల వ్యాపారికి.. ఇలా నలుగురు వ్యాపారుల చేతులు మారి, చివరికి వాహనాలను పొరుగు రాష్ట్రం కర్ణాటకకు తరలిస్తున్నారని సమాచారం. ఈ వాహనాల దొంగల గ్యాoగ్ ఏ ప్రాంతం, రాష్ట్రాలతో సంబంధాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు.
Also Read: Karnataka Road Accident: బాబు చికిత్స కోసం రూ.1 కోటి సమకూరినా, ట్రీట్‌మెంట్‌కు వెళ్తుంటే తీవ్ర విషాదం
Also Read: Crime News : రియల్ ఆవేశం స్టార్ - పోలీసులు ఆపారని బైక్ కాల్చేసుకున్నాడు.. కేసుల పాలయ్యాడు !