జుట్టు సంరక్షణ కొంచెం కష్టమే. జడ వేసుకుంటున్న ప్రతిసారీ దువ్వెనలో మన ఊడిపోయిన జుట్టు కనిపించినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. జుట్టు రాలే సమస్య నుంచి బయట పడాలని ఏవేవో ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. కానీ వాటి వల్ల కొన్ని సార్లు జుట్టు రాలడం ఎక్కువ అవుతుంది. అటువంటి సమయంలో మరింత కోల్పోవాల్సి వస్తుంది. కృత్రిమ పద్ధతులు కాకుండా ఇంట్లో దొరికే వాటితోనే జుట్టు రాలే సమస్యకి చెక్ పెట్టి ఒత్తుగా పెరిగేలా చేసుకోవచ్చు. అదెలాగా అనుకుంటున్నారా? జస్ట్ సింపుల్ కరివేపాకుని మీ డైట్లో భాగం చేసుకుంటే సరిపోతుంది.


కరివేపాకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. జుట్టుకి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నుంచి కరివేపాకు కాపాడుతుంది. జుట్టు రాలడం, చుండ్రు సమస్య, స్కాల్ఫ్ దురద నుంచి మిమ్మల్ని కరివేపాకు బయట పడేస్తుంది. అంతే కాదు ఇందులో ఉండే విటమిన్ బి వల్ల జుట్టు త్వరగా నెరిసిపోకుండా అడ్డుకుంటుంది. సిల్కి, పొడవాటి జుట్టు కావాలంటే తప్పకుండా కరివేపాకుతో ఇలా చేసి చూడండి. అద్భుత ఫలితాలు పొందుతారు.


జుట్టు పెరిగేందుకు


మీకు కూడా పొడవైన జడ కావాలని అనుకుంటున్నారా? అయితే ఈ రెమిడీ మీ కోసమే. కరివేపాకు, మెంతి ఆకులు, ఉసిరి కాయని మిక్సీలో వేసి బాగా మెత్తగా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని తల మాడుకి, జుట్టుకి బాగా అప్లై చేసుకోవాలి. దాన్ని తలకి 20 నుంచి 30 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకి కావాల్సిన పోషకాలు అందుతాయి.


కొబ్బరినూనెతో కరివేపాకు


చిన్న పాత్రలో కొద్దిగా కొబ్బరినూనె తీసుకుని తక్కువ మంట మీద వేడి చేసుకోవాలి. అందులో కరివేపాకు వేసి చిటపటలాడనిచ్చి స్టవ్ ఆపేయాలి. ఆ మిశ్రమం చల్లారిన తర్వాత ఒక బాటిల్ లోకి వడకట్టాలి. వారానికి ఒక సారి జుట్టుకి అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతం అవుతుంది. కొబ్బరి నూనె జుట్టుకి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో కొవ్వు ఆమ్లాలు, అనేక విటమిన్లు ఉంటాయి. ఇవి జుట్టుకు పోషకాలు అందిస్తాయి.


జుట్టు రాలే సమస్య నుంచి విముక్తి


ఈరోజుల్లో 10 లో ఏడుగురు మహిళలు జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఉల్లిపాయతో మీ జుట్టుని కాపాడుకోవచ్చు. ఉల్లిపాయ రసంలో అధిక మొత్తంలో సల్ఫర్ ఉంటుంది. కరివేపాకు జుట్టుకి బలాన్ని ఇస్తుంది. ఈ రెండు పదార్థాలని మిక్సీ చేసుకోవాలి. దాన్ని వడకట్టుకొని అందులో కాటన్ బాల్ తో మీ జుట్టు కుదుళ్ళకి అప్లై చేసుకోవాలి. జుట్టు మొత్తానికి రాసుకున్న తర్వాత 30 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత షాంపూ చేస్తే సరిపోతుంది. ఉల్లిపాయ వాసన పోవాలంటే తప్పనిసరిగా షాంపూ ఉపయోగించడం మర్చిపోవద్దు.


మెరిసే జుట్టు కోసం


మీ జుట్టు నిగనిగలాడాలంటే ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. పెరుగు, కరివేపాకు కలిపి జుట్టుకి పెట్టుకోవడం వల్ల పోషణ అందుతుంది. తల మాడు మీద ఉండే మృత కణాలు పోగొట్టేందుకు, చుండ్రుని సున్నితంగా తొలగించడంలో ఇది సహాయపడుతుంది. హైడ్రేటింగ్ స్కాల్ఫ్ క్లీన్స్ గా ఇది పని చేస్తుంది. కొంచెం కరివేపాకు, కొద్దిగా పెరుగు తీసుకుని మిక్సీ వేసుకోవాలి. కొద్దిగా జారుగా చేసిన ఆ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. 30-40 నిమిషాల పాటు ఆ మిశ్రమం తలకి పట్టేలాగా ఉంచుకోవాలి. తర్వాత తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోవాలి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also read: మలీద లడ్డూలు, సద్దుల బతుకమ్మ మెచ్చే ప్రసాదం



Also read: నువ్వుల సద్ది, సద్దుల బతుకమ్మ స్పెషల్ నైవేద్యం, ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది