రామా చాలా సంతోషంగా ఇంటికి వచ్చి అమ్మా అని పిలుస్తాడు. జానకి గారు పరీక్ష చాలా బాగా రాశారు.. ఎన్ని మార్కులకి పరీక్ష పెడితే అన్నీ మార్కులు వచ్చాయి. తర్వాత పరీక్ష కూడా ఇలాగే రాస్తే ఐపీఎస్ అవ్వడం గ్యారెంటీ అని ప్రిన్సిపాల్ చెప్పారని రామా చెప్పడంతో ఇంట్లో అందరూ సంతోషిస్తారు. నీ నుంచి నేను కోరుకున్నది ఇదే జానకి అని జ్ఞానంబ తనని దగ్గరకి తీసుకుని ప్రేమగా నుదుటి మీద ముద్దుపెడుతుంది. ఖచ్చితంగా మీ నాన్న గారి కల ఇటు మా ఆశయం నువ్వు సాధిస్తావని నమ్మకంగా ఉందని గోవిందరాజులు కూడా అంటాడు. అదంతా చూసి మల్లిక కుళ్లుకుంటుంది.


జానకిని చూసి అందరూ నేర్చుకోమని జ్ఞానంబ చెప్తుంది. అనేక సందర్భాల్లో ఎదురైన సమస్యలు పరిష్కరించి కోడలిగా తన బాధ్యత సమర్ధవంతంగా నిర్వహించింది, కొంతమంది ఉంటారు పరమాన్నం వండిపెట్టినా కూడా అందులో స్వయంగా విషం కలుపుకుంటారని అఖిల్ గురించి అంటుంది. ఎన్ని సమకూర్చినా ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తారు. జానకి తులసి మొక్క అయితే వాళ్ళు కలుపు మొక్క అనేసరికి అఖిల్ అక్కడ నుంచి బాధగా వెళ్ళిపోతాడు. ఇక నుంచి ఎలాంటి సమస్యలు తలకెత్తుకోకుండా నీ ఆశయాన్ని సాధించమని చెప్తుంది. ఇంట్లో ఏ మంచి విషయం జరిగినా నేను అసలు మనిషే కాదని అమ్మ నాకు ప్రతిసారీ క్లాస్ పీకుతుంది. ఇదంతా జెస్సి వల్లే అని అఖిల్ చిరాకు పడతాడు. జెస్సి అఖిల్ కోసం బయటకి వస్తుంది.


Also Read: ఊహించని ట్విస్ట్, తులసి మీద కావాలని నింద పడేలా చేసిన సామ్రాట్- హనీ పుట్టినరోజు వేడుకల్లో తులసికి అవమానం


తన పెంపకాన్ని కాదని లవ్ మ్యారేజ్ చేసుకున్నారనే బాధ ఆమెది. అత్తయ్యగారి గురించి నాకంటే నీకే బాగా తెలుసు. తొందర్లోనే అత్తయ్యగారు మనల్ని దగ్గరకి తీసుకుంటారు నువ్వేమి బాధపడకు అని జెస్సి అంటుంటే అఖిల్ మాత్రం తనని బాధపెడతాడు. నా మనసుకి తీరని గాయం చేసి ఇప్పుడు వెన్న పూస్తున్నావా. మా అమ్మ నన్ను మాటలు అనడానికి ఇంట్లో అందరూ నన్ను దోషిలా చూడటానికి కారణం నువ్వే కదా అని అఖిల్ అంటాడు. నేనేం చేశాను అఖిల్ అని జెస్సి అమాయకంగా అడుగుతుంది. నేను ఇంట్లో రాజులాగా చూసేవాళ్ళు నువ్వు అబార్షన్ చేయించుకోమంటే నా మాట వినకుండా వదిన్ని అడ్డు పెట్టుకుని నన్ను పెళ్లి చేసేసుకున్నావ్ నా బతుకు బస్టాండ్ చేశావ్.. అందరూ నా వంక అసహ్యంగా చూస్తున్నారని కోపంగా వెళ్ళిపోతాడు.


ఐపీఎస్ అయ్యేదాక ఇంటి పనులు చూసుకోకుండా నేను చెప్పినట్టే వినాలి అని రామా జానకికి చెప్తాడు. భర్త కురిపించే ప్రేమ చూసి జానకి మురిసిపోతుంది. బొమ్మల కొలువు కోసం పేరంటాలు పిలవాలంటే భయంగా ఉందని జ్ఞానంబ అంటుంది. ఒకసారి అలా జరిగిందని ప్రతిసారీ అలా జరుగుతుందని బొమ్మల కొలువు ఆపడం ఎందుకని గోవిందరాజులు అంటాడు. రామా, జానకి తప్ప విష్ణు, అఖిల్ కి ఇంటి గురించి బాధ్యత లేదు. ఎంతసేపు వాళ్ళ స్వార్థం తప్ప రామా పడే కష్టం జానకి బాధ్యత తీసుకోవడం లేదు. మన పద్ధతులు కాపాడాలనే ఆలోచన వాళ్ళకి లేదు. అందుకే అవేవి వద్దని జ్ఞానంబ బాధపడుతుంది. వాళ్ళ మాటలు జానకి, జెస్సి వింటారు.


Also Read: సత్యకి తెలియకుండా రుక్మిణి వెంట ఆదిత్య- మాధవ్ చేతికి చిక్కిన పవర్ ఫుల్ అస్త్రం


మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు మన ఇంట్లో ఇద్దరు కడుపుతో ఉన్నారు. ఒకరికి ఇద్దరు వారసులు రాబోతున్నారు. వాళ్ళ ఆయుషు కోసమైన మనం బొమ్మల కొలువు పెట్టాలి. మొన్నటిలాగా ఎలాంటి అవహేళన లేకుండా చూసుకునే బాధ్యత నాది దయచేసి కాదనకండి అని జానకి జ్ఞానంబని అడగటం మల్లిక కూడా వింటుంది. జానకి మాట ఇస్తే ఎలాంటి సమస్య రాదని గోవిందరాజులు కూడా చెప్తాడు. సరే జానకి నిన్ను నమ్మి ఒప్పుకుంటున్నా ఈసారి ఏదైనా తేడా వస్తే నేను తట్టుకోలేను అని జ్ఞానంబ చెప్తుంది. దాన్ని చెడగొట్టేందుకు మల్లిక ప్లాన్ వేస్తుంది.