సోషల్ మీడియాలో పరిచయాలపై చాలా జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే జీవితాలు తారుమారు అవుతాయని తరచుగా పోలీసులు, ప్రభుత్వాలు హెచ్చరిస్తూనే ఉంటాయి. ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ను నమ్మి అతడితో వెళ్లిన ఓ 21 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దారుణమైన స్థితిలో ఆమెను వదిలివెళ్లిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. పోలీసులు ఓ అనుమానితుడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. 


పోలీసుల కథనం ప్రకారం.. యువతి స్వస్థలం యూపీలోని మథుర. కాగా, ఆమెకు హరియాణాలోని పాల్వాల్‌కు చెందిన తేజ్‌వీర్ అనే యువకుడు ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యాడు. వీరి పరిచయం కొంతకాలానికి స్నేహంగా మారింది. యూపీలో ఎస్‌ఐ పోలీసు ఉద్యోగాలకు ఇటీవల నోటిఫికేషన్ వచ్చింది. తాను ఎస్ఐ కావాలన్న లక్ష్యం కోసం యువతి ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో పరీక్ష రాసేందుకు ఆగ్రాకు వచ్చింది. అయితే తాను వస్తున్న విషయాన్ని ఫేస్ బుక్ ఫ్రెండ్ తేజ్ వీర్‌కు చెప్పింది. ఆమెను కలుసుకుంటానని చెప్పిన అతడు తన నీచ బుద్ధిని చూపించాడు.


ఎగ్జామ్ సెంటర్ వద్దకు వచ్చిన తేజ్‌వీర్‌.. ఆగ్రాలో పరీక్ష రాసిన అనంతరం యువతిని కలిశాడు. తాను కారులో వచ్చానని ఆమెతో కొంత సమయం గడిపిన అనంతరం చెప్పిన చోట డ్రాప్ చేస్తానని యువతిని నమ్మించాడు. ముందుగానే దురుద్దేశంతో వచ్చిన తేజ్‌వీర్‌ వెంట డ్రైవర్‌ను తీసుకొచ్చాడు. యువతి కారులో ఎక్కిన తరువాత ఆమెకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. కొంతసమయానికి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కదులుతున్న కారులోనే ఫేస్‌బుక్ ఫ్రెండ్ అయిన యువతిపై తేజ్‌వీర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. 


కొన్ని గంటలపాటు కారులో అత్యాచారం చేసిన తరువాత అపస్మారక స్థితిలో ఉన్న యువతిని ఢిల్లీ ఆగ్రా నేషనల్ హైవే 2 పక్కన దారుణమైన స్థితిలో పడేసి వెళ్లిపోయాడు నిందితుడు తేజ్‌వీర్. అతికష్టమ్మీద తేరుకున్న బాధితురాలు తన ఇంటికి చేరుకుంది. జరిగిన దారుణాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది. బాధితురాలి కుటుంబసభ్యులు నిందితుడు తేజ్‌వీర్‌పై కోసికాలా  పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం) కింద కేసు నమోదైంది. బుధవారం నాడు బాధితురాలని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపించామని రూరల్ ఎస్పీ శిరీష్ చంద్ర తెలిపారు. 



నిందితుడి అడ్రస్ తెలియదు..
ఫేస్‌బుక్‌ ఫ్రెండ్ తేజ్‌వీర్ అడ్రస్ తనకు సరిగ్గా తెలియదని బాధితురాలు చెబుతోంది. నిందితుడి వివరాలు తెలుసుకుని అతడ్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. గురువారం నాడు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. సోషల్ మీడియా పరిచయాలపై జాగ్రత్తగా ఉండాలని లేనిపక్షంలో జరిగే పరిణామాలు ఊహించడం కష్టమని యువతకు ఎస్పీ శిరీష్ చంద్ర సూచించారు.
Also Read: వాళ్లు ఎక్కడ కావాలంటే అక్కడ ఉద్యోగం ఇచ్చేస్తారు ! కానీ వాళ్లను పోలీసులు అరెస్ట్ చేసేశారు..ఎందుకో తెలుసా ?


Also Read: Tomato Farmers : ఆ రైతు పంట పండించిన టమాటా .. ఒక్క సీజన్‌లో రూ. 80 లక్షలు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి