డబ్బులు ఈజీగా సంపాదించేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు మాజీ నక్సలైట్లు. మావోయిస్టుల పేరిట బెదిరింపులకు దిగారు. తుపాకులతో బెదిరించి దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాలోని నలుగురిని యాదాద్రి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలో అశోక్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ వెల్లడించారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో మావోయిస్టుల పేరుతో బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ లో నలుగురు మాజీ నక్సలైట్లు పట్టుబడ్డారు. నలుగురు పిట్టల శ్రీనివాస్, వి.నాగమల్లయ్య, వై. శ్రీనివాస్ రెడ్డి, గంగపురం స్వామి అని పోలీసులు గుర్తించారు. 


Also Read: ప్రయాణికుల లగేజీలతో ప్రైవేట్ బస్సు డ్రైవర్ పరారీ... దిక్కు తోచని స్థితిలో వలస కూలీలు


మావోయిస్టుల గ్రూపుల్లో పనిచేసిన అనుభవం


అరెస్ట్ అయిన నలుగురు అంతకు ముందు నిషేధిత సీపీఐ జనశక్తి, మావోయిస్టు పార్టీలో పనిచేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. వీరిలో పిట్ల శ్రీనివాస్ సొంతంగా ఆయుధాలు తయారు చేసి అక్రమాలకు పాల్పడుతున్నాడన్నారు. ఈజీ మనీకి ఆశపడి అక్రమ మార్గం ఎంచుకున్నారన్నారు. మావోయిస్టుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ ఈ ముఠా డబ్బులు వసూలు చేస్తోందని పోలీసులు తెలిపారు. సామాన్యులకు తుపాకులు చూపించి బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతోందని గుర్తించారు. ఈ ముఠాలో ఇంకో నిందితుడు అశోక్ పరారీలో ఉన్నాడని తెలిపారు.


Also Read: షోరూంలో షాకింగ్ ఘటన... డ్రెస్సింగ్ రూంలో దుస్తులు మార్చుకుంటున్న యువతి... వీడియో తీసిన యువకులు


మారణాయుధాల చట్టం కింద కేసులు


వీరంతా భారత కమ్యూనిస్టు మావోయిస్టు పార్టీ జోనల్ కమిటీ తెలంగాణ రాష్టం అనే పేరుతో ముఠాగా ఏర్పడి కాంట్రాక్టర్లను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారం వీరిని పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులపై మారణాయుధాల చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ప్రకటించారు. వీరంతా యాదాద్రి భువనగిరి జిల్లాలో దారి దోపిడీలు, షాపుల్లో బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఈ క్రమంలోనే వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుల వద్ద నుంచి మూడు తుపాకులు, ఒక నాటు తుపాకీ, 6 డిటోనేటర్లు, 15 గ్యాస్ సిలిండర్లు, బులెట్లలో వాడే గన్ పౌడర్ 40 గ్రాములు, మావోయిస్టు లెటర్ హెడ్స్, డ్రిల్లింగ్ మెషీన్‌తో పాటు ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 


Also Read:  చెన్నైలో చోరీలు ఆంధ్రాలో అమ్మకాలు... సగం ధరకే బ్రాండెడ్ సెల్ ఫోన్లు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి