Police Identified Tipper in Mla Lasya Nanditha Car Accident Case: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasha Nanditha) కారు ప్రమాదం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గత నెల 23న తెల్లవారుజామున పటాన్ చెరు ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన రెయిలింగ్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆమె ప్రయాణిస్తున్న కారు ముందుగా టిప్పర్ ను ఢీకొని ఆ తర్వాత రెయిలింగ్ ను ఢీకొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. తాజాగా, శుక్రవారం పోలీసులు ఆ టిప్పర్ ను గుర్తించారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కారు టిప్పర్ ను ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందా..? లేదా.? అనే దానిపై లోతుగా విచారిస్తున్నారు. ఈ ఘటనలో కారు నడిపిన ఎమ్మెల్యే డ్రైవర్, పీఏ ఆకాశ్ తీవ్రంగా గాయపడ్డారు.


బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు ఫిబ్రవరి 23 తెల్లవారుజామున ఓఆర్ఆర్ పై రెయిలింగ్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం అందరిలోనూ తీవ్ర విషాదం నింపింది. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ సుల్తాన్ పూర్ ఓఆర్ఆర్ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్, పీఏ ఆకాశ్ తీవ్రంగా గాయపడగా పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదం సమయంలో డ్రైవర్ ఆకాశ్ మద్యం సేవించి ఉన్నాడా? అనే దానిపై నిర్ధారణ కోసం.. అతని రక్త నమూనాలను పరీక్షల కోసం పంపారు. అలాగే, ఆకాశ్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని పరిశీలించారు. అతన్ని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి ఆకాశ్ వాంగ్మూలం తీసుకున్నారు. ప్రమాదం సమయంలో తనకు ఏం అర్ధం కాలేదని, మైండ్ బ్లాక్ అయిందని పోలీసులకు ఆకాశ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ప్రమాదం ఎలా జరిగిందో అర్థం అవ్వట్లేదని చెప్పాడు. సదాశివపేట దర్గా నుంచి హైదరాబాద్ వచ్చామని, లాస్య నందిత ఫుడ్ తినాలంటే హోటల్స్ వెతుక్కుంటూ వెళ్లామని వాంగ్మూలంలో పేర్కొన్నాడు. అయితే, ఆకాశ్ నిర్లక్ష్యంగా కారు నడిపి లాస్య నందిత మరణానికి కారణమయ్యాడంటూ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అతనిపై సెక్షన్ 304ఏ కింద కేసు నమోదు చేశారు.


ఆ కోణంలో దర్యాప్తు


ఎమ్మెల్యే కారు రెయిలింగ్ తో పాటు ముందున్న మరో వాహనాన్ని ఢీకొని ఉండొచ్చనే అనుమానంతో ఆ కోణంలో పోలీసుల దర్యాప్తు సాగింది. అతి వేగంతో వచ్చిన కారు ముందున్న వాహనాన్ని ఢీకొట్టిన ఆనవాళ్లను గుర్తించారు. కారు బానెట్ పై భాగం పూర్తిగా ధ్వంసం కాగా.. ఎడమ వైపున ఉన్న ముందు చక్రం ధ్వంసమైంది. మీటర్ బోర్డు 100 కి.మీ స్పీడ్ వద్ద స్ట్రైక్ అయినట్లు గుర్తించారు. నందిత కారు బానెట్ పై భాగంలో అంటుకుని ఉన్న ఇసుకను క్లూస్ టీం సేకరించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై రెయిలింగ్ ను మాత్రమే ఢీకొంటే ఈ స్థాయిలో ప్రమాదం జరగకపోవచ్చని నిపుణులు పేర్కొన్నారు. ఈ క్రమంలో తాజాగా, ఎమ్మెల్యే కారు ఢీకొన్ని టిప్పర్ ను ట్రేస్ చేసి.. డ్రైవర్ నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.


Also Read: Zero Current Bill: తెలంగాణలో అమల్లోకి 'గృహ జ్యోతి' పథకం - లబ్ధిదారులకు జీరో కరెంట్ బిల్