Chegondi Hari Ram Jogaiah : తెలుగుదేశం (Telugu Desam Party) అధినేత చంద్రబాబు (Chandra Babu)నుంచి పవన్ కల్యాణ్‌ను రక్షించడానికి ఎన్ని లేఖలైనా రాస్తాను సలహాలు ఇస్తానని స్పష్టం చేశారు చేగొండి హరి రామ జోగయ్య. మొన్నటి బహిరంగ సభలో తనకు సలహాలు ఇవ్వొద్దని పోరాడే వాళ్లే కావాలని పవన్ కల్యామ్ గట్టిగానే చెప్పినప్పటికీ  హరిరామ జోగయ్య, ముద్రగడ లాంటి వాళ్లు వెనక్కి తగ్గడం లేదు. 


సభ పూర్తి అయిన మరుక్షణమే తన అసంతృప్తిని వెల్లడిస్తూ హరిరామ జోగయ్య లేఖ రాశారు. అక్కడకు 24 గంటలు గడవక ముందే పవన్‌ను విమర్శిస్తూ ముద్రగడ పద్మనాభం లేఖాస్త్రం సంధించారు. ఇప్పుడు మూడో రోజు హరిరామ జోగయ్య మరో లేఖను వదిలారు. చంద్రబాబు ఎత్తుల నుంచి పవన్ కాపాడటమే తన పని దానికోసం ఎన్ని సలహాలు అయినా ఇస్తానంటూ చెప్పుకొచ్చారు. 


హరిరామ జోగయ్య రాసిన లేఖలో ఇంకా ఏముంది అంటే..." మొన్న బహిరంగ సభలో నాకు సలహాలు ఇవ్వనవసరం లేదు అంటూ పరోక్షంగా నన్ను ఉద్దేశించి పవన్ చెప్పినట్టు అర్థమైంది. నేను వైసీపీకి కోవర్టుగా పని చేస్తున్నాననే ఎల్లో మీడియా ప్రచారం వాస్తవం కాదు. జగన్మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy)పై సీబీఐ చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టులో కేసు కూడా వేశాను. వైసిపి దుష్ట పరిపాలన అంతం చేయాలని రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలని నేను మీ కూటమికి సలహాలు ఇస్తున్నాను. అంతేగాని నాకు వ్యక్తిగత ప్రయోజనాలు ఏమి లేవు.


ప్రజారాజ్యం(Praja Rajyam) పెట్టినప్పుడు నేను ఉన్న పదవిని కూడా వదిలేసుకుని మీ అన్న చిరంజీవి వెంట నడిచాను. బిజెపి కూడా మీతో ఉంటే బలంగా ఉంటుందని నమ్మాను కాబట్టే జనసేన తెలుగుదేశం పార్టీతోపాటు పొత్తులో బిజెపి ఉండాలని బలంగా కోరుకున్నాను. చంద్రబాబు జిత్తుల మారి తెలివితేటల నుంచి మిమ్మల్ని రక్షించేందుకు జనసైనికులు తరఫున లేఖలు రాస్తున్నాను. టిడిపితో పొత్తులో భాగంగా జనసేనకు సముచిత స్థానం కల్పించాలని కనీసం 40 సీట్లు అన్న వస్తే మీ గౌరవం నిలబడుతుందని లేఖలు రాశాను. మీ హోదాకు తగ్గట్టుగా మీకు సముచిత స్థానం కల్పించాలనేది నా కోరిక. ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు మీకు నాకు మధ్య దూరం పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.


రాష్ట్రంలో కాపులతోపాటు బీసీలు ఎస్సీలు అన్ని వర్గాల ప్రజలు మీరు సీఎం అయితే బాగుంటుందని భావిస్తున్నారు. కనీసం రెండున్నర సంవత్సరాలైనా మీరు సీఎం గా ఉంటే నీతివంతమైన పరిపాలన అందిస్తారని ప్రజలు కోరుకుంటున్నారు. మీ తరఫున జన సైనికులు అభిప్రాయాలను లేఖల రూపంలో తెలియజేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోయినా మీ మంచి కోరేవాడిగా సలహాలు రూపంలో లేఖలు రాస్తూనే ఉంటాను.


జనసేన లేకుండా తెలుగుదేశం నెగ్గటం అనేది ఇంపాజుబుల్. అది చంద్రబాబుకి తెలియంది కాదు. అందుకే మీతో జతకట్టాడు. వెన్నుపోటు రాజకీయాలకు అలవాటు పడిన చంద్రబాబు ఎన్నికలకు తర్వాతనైనా మీకు అధికారంలో, సముచితమైన స్థానం ఇస్తాడని ముఖ్యమంత్రి పదవి చేపట్టటంలో భాగస్వామిని చేస్తాడని ఎవరు నమ్ముతారు. 


ఎన్నికలైన తర్వాత జనసేనను క్రమేపీ నిర్వీర్యం చేసి తన కొడుకు లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేస్తాడు అనే భయం జనసైనికులు అందరిలో ఉన్నమాట నిజం. ఎన్నికలు ముందే మీకు అధికారంలో రావటంతోపాటు, మీ స్థానం ఏమిటో తేల్చాలని జనసైనికుల తరపున నేను డిమాండు చేయటంలో తప్పేమిటి? సముచితమైన నా సలహాలను వక్రీకరిస్తూ వై.ఎస్.ఆర్. కోవర్టుగా నాకు ముద్ర వేయటానికి ప్రయత్నం చేస్తున్న ఈ ఎల్లో మీడియాను కాని, జనసేన పార్టీలోని కొంతమంది మీ సలహాదారులను కాని ఏమనాలి. వారు తెలుగుదేశం కోవర్టులుగా చెప్పవచ్చా.


జరుగుతున్న ఈ పరిణామాలపై మిశ్రులెవరో, శత్రువులెవరో తెలుసుకుని మీరు ప్రవర్తించటం, జనసేన మంచికోసం ఎంతైనా మంచిది. మీకు ఇష్టమైనా లేకపోయినా మీ వెంటనే ఉండి మిమ్మల్ని కావాడుకోవటం నా విధిగా భావిస్తున్నాను. నేను చచ్చేవరకు నా ప్రవర్తన ఇలాగే ఉంటుందని మీకు తెలియపరుస్తున్నాను. జనసేన తెలుగుదేశం బిజెపి కూటమి ఎన్నికలో కలిసే పోటీ చేయాలనేది నా ఆకాంక్ష. తద్వారా వై.ఎస్.ఆర్. పార్టీ విముక్తి కలుగచేయాలనే యజ్ఞంలో జనసైనికులు మీతోనే ఉంటారు. అందులో మీరు సందేహపడాల్సిన పని లేదు. 


నీతివంతమైన మీలాంటి వారు మాత్రమే ముఖ్యమంత్రి అవ్వాలని నాబోటి వారు కోరుకుంటున్నారు. దోచుకో దాచుకో పరిపాలన అందిస్తున్న వై.ఎస్.ఆర్. పార్టీ పరిపాలనకు ముగింపు పలకాలనే మీ లక్ష్యసాధనకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. అయితే అధికారంలో మీకు సముచితమైన స్థానం లభించేవరకు మా పోరాటం ఇలాగనే కొనసాగుతుందని తెలియపరచాల్సి వస్తుంది.


నేను వైసీపీ(YSRCP) కోవర్ట్‌అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద ఎందుకు కేసులు వేస్తాను. మీ మీద ప్యాకేజీ స్టార్ అని ముద్ర వేస్తుంటే చంద్రబాబు, లోకేష్(Lokesh) ఎందుకు ఖండించడం లేదు. మీకు తక్కువ సీట్లు ఇచ్చి లోకేష్‌ని సీఎంగా చేసి నిధానంగా మిమ్మల్ని దూరం చేస్తారనే అనుమానం జనసైనికుల్లో ఉంది. మీరు పట్టించుకున్న పట్టించుకోకపోయినా మీ మీద అభిమానంతో మీకు సలహాలు ఇస్తూనే ఉంటాను" అని  లేఖలో హరి రామ జోగయ్య పేర్కొన్నారు.