Dasthagiri Contest Against Jagan : వివేకా కేసులో కీలక నిందితుడు ఉంటూ అఫ్రూవర్ గా మారిన దస్తగిరి(Dasthagiri) రాజకీయ రంగప్రవేశం చేశారు. రానున్న ఎన్నికల్లో పులివెందుల (Pulivendula) నుంచి సీఎం జగన్ పై పోటీ చేయనున్నారు. జైభీమ్(Jai Bheem) పార్టీలో చేరిన ఆయనకు పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్(Jada Sravan) పులివెందుల సీటు ఖరారు చేశారు.


జగన్ పై దస్తగిరి పోటీ 
మాజీమంత్రి వివేకా(Viveka) హత్యకేసులో కీలక నిందితుడిగా ఉన్న దస్తగిరి రాజకీయాల్లో చేరారు. రానున్న ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి సీఎం జగన్(Jagan) పై పోటీకి సై అన్నారు. ఈ మేరకు జైభీమ్ పార్టీలో చేరిన ఆయనకు పార్టీ అధ్యక్షుడు కండువా కప్పి సాధరంగా స్వాగతం పలికారు. దస్తగిరికి జైభీమ్ పార్టీ తరఫున పులివెందుల సీటు కన్ఫార్మ్ చేశారు. వివేకా హత్య కేసుతో రాష్ట్రవ్యాప్తంగా ఫేమస్ అయిన దస్తగిరి(Dasthagiri) ఆ తర్వాత తాను చేసిన తప్పును సీబీఐ అధికారుల ముందు ఒప్పుకుని అఫ్రూవర్ గా మారారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, వారి అనుచరులే వివేకాను హత్య చేశారని సాక్ష్యం చెప్పారు. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చిన దస్తగిరికి అవినాష్(Avinash Reddy)అనుచరుల నుంచి పెద్దఎత్తున బెదిరింపులు వచ్చాయి. 


అక్రమ కేసులతో మళ్లీ అరెస్ట్
ప్రత్యర్థుల నుంచి ప్రాణహానీ ఉండటంతో సీబీఐ(CBI) సూచన మేరకు దస్తగిరికి ప్రత్యేకంగా గన్ మెన్లతో రక్షణ కల్పించారు. అయినా సరే ఆయనపై తప్పుడు కేసులు పెట్టి మళ్లీ జైలుకు పంపారు. ప్రభుత్వం నియమించిన గన్ మెన్లు నా చుట్టూ ఉన్నప్పుడు తాను బెదిరింపులు, కిడ్నాప్ లకు ఎలా పాల్పడతానన్న వినిపించుకోలేదు. దాదాపు వందరోజుల పాటు కడప జిల్లా జైలులో ఉన్న దస్తగిరి ఇటీవలే విడుదలయ్యారు.


జగన్ పై షాకింగ్ కామెంట్స్
జైలు నుంచి బయటకు వచ్చిన దస్తగిరి ముఖ్యమంత్రి జగన్(Jagan) పై షాకింగ్ కామెంట్స్ చేశారు. జైలులో తనతో మరోసారి బేరమాడారని రూ.20 కోట్లు అడ్వాన్స్ ఇవ్వచూపారన్నారు. అబద్ధపు సాక్ష్యం చెప్పకుంటే చంపేస్తామని బెదిరించారన్నారు. తాను చావుకు తెగించానన్ని...పులివెందులలో అవినాష్ ఇంటిపక్కనే ఉంటానంటూ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి జగన్ పైనా తీవ్ర విమర్శలు చేశాడు. గత ఎన్నికల్లో వివేకా హత్యను అడ్డం పెట్టుకుని జగన్ ఎన్నికల్లో గెలిచాడని... ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ ఇప్పుడు వివేకాను ఎవరు చంపారో చెప్పిన తర్వాతే పులివెందులలో ఓట్లు అడగాలని నిలదీశారు.


రాజకీయం అండ చూసుకుని తన జీవితంతో ఆడుకుంటున్నారని...అందుకే అదే రాజకీయాల్లోకి వస్తానని అప్పుడే శపథం చేశారు. అన్నట్లుగానే  దస్తగిరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. జైభీమ్ పార్టీలో చేరిన ఆయన...ఏకంగా ముఖ్యమంత్రి జగన్ పైనే పోటీకి దిగారు. వివేకాను ఎవరు చంపారో చెప్పే ధైర్యం తనకు ఉందని....ఆ ధైర్యం జగన్ కు ఉందా అని ప్రశ్నించారు. ఖచ్చితంగా సీఎం జగన్ కు పోటీ ఇస్తానని తెలిపారు. ఏళ్ల తరబడి ఆ కుటుంబమే ఇక్కడ పాలిస్తోందని..తనలాగా వారి చేతిలో మోసపోయిన వారందరూ తనకు మద్దతుగా నిలవాలని దస్తగిరి పిలుపునిచ్చాడు. ఐక్యంగా అందరం కలిసి పోరాడదామన్నారు.