Zero Current Bill Issued Under Gruha Jyothi Sceheme: రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీల అమల్లో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంట్ 'గృహజ్యోతి' (Gruhajyothi) అమలుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం నుంచి గృహజ్యోతి పథకం అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. తెల్లరేషన్ కార్డు ఉండి.. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారిని ఈ పథకాలకు ప్రభుత్వం అర్హులుగా పేర్కొంది. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడకం ఉన్న అందరికీ ఈ నెల జీరో కరెంట్ బిల్లు వస్తుంది. హైదరాబాద్ (Hyderabad) పరిధిలోని లబ్ధిదారులకు జీరో కరెంట్ బిల్లు (Zero Current Bill) జారీ చేశారు. ఈ మేరకు బిల్లింగ్ సాఫ్ట్ వేర్ లో ఇప్పటికే మార్పులు చేశారు. కొత్త బిల్లింగ్ యంత్రాలను సైతం కొనుగోలు చేశారు. ఈ జీరో బిల్లులో లబ్ధిదారుడు వాడిన యూనిట్లు, బిల్లు ప్రింట్ చేసి.. గృహజ్యోతి సబ్సిడీ కింద మొత్తం బిల్లును మాఫీ చేసి జీరోగా చూపిస్తారు. టెస్టింగ్ కోసం జీరో బిల్లులు జారీ చేశామని.. తొలుత నగరంలో చేసి త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా జీరో బిల్లులు జారీ చేస్తామని విద్యుత్ అధికారులు తెలిపారు. ఫిబ్రవరి నెల ఖాతాలను ముగించి.. మార్చి వివరాలను బిల్లింగ్ యంత్రాల్లో లోడ్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఒకవేళ, లబ్ధిదారులు 200 యూనిట్ల కంటే ఒక్క యూనిట్ అధికంగా వాడినా తప్పనిసరిగా బిల్లు చెల్లించాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు.


అర్హత ఉన్నా పథకం రాకుంటే..


గృహజ్యోతికి అర్హులైన వారు.. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడి, తెల్ల రేషన్ కార్డు ఉండి కూడా జీరో కరెంట్ బిల్లు రాకపోతే ఆందోళన చెందాల్సిన పని లేదని ప్రభుత్వం సూచించింది. మున్సిపల్, మండల కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. రేషన్ కార్డు, దానికి లింక్ చేసిన ఆధార్, గృహ విద్యుత్ కనెక్షన్ నెంబరును సంబంధిత దరఖాస్తుతో సమర్పించాలని పేర్కొంది. విద్యుత్ సిబ్బంది వీటిని పరిశీలించిన అనంతరం అర్హుల జాబితాలో పేరు చేరుస్తారని వెల్లడించింది. ఆ తర్వాత నెల నుంచి జీరో కరెంట్ బిల్లు వస్తుందని స్పష్టం చేసింది. ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.


అలాగే, పట్టణాలు, నగరాల్లో ఇళ్లు అద్దెకు ఇచ్చిన యజమానులకు ఆందోళన అనవసరమని అధికారులు తెలిపారు. యజమానుల పేరున ఉన్న గృహ కనెక్షన్ అద్దెకు ఉండే వారి పేరు మీద మార్పు చెందదని.. అద్దెకున్న వారిని దరఖాస్తు చేసుకోవద్దని ఒత్తిడి చెయ్యాల్సిన అవసరం లేదని అన్నారు. వారికి రేషన్ కార్డు ఉండి.. 200 యూనిట్ల వరకూ విద్యుత్ వినియోగిస్తే దరఖాస్తు చేసుకోనివ్వాలని సూచించారు.


రూ.900 వరకూ లబ్ధి


ప్రజాపాలనలో ఉచిత విద్యుత్ కోసం 81.54 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 49.50 లక్షల ఇళ్లకు కరెంట్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 19.85 లక్షల మంది మాత్రమే పథకం కోసం అప్లై చేశారు. కాగా, ఈ నెలలో జారీ అయిన జీరో కరెంట్ బిల్లుల ఆధారంగానే అర్హుల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే, ప్రస్తుతం విద్యుత్ ఛార్జీల ప్రకారం లెక్కిస్తే నెలలో కచ్చితంగా 200 యూనిట్లు వాడుకునే ఇంటికి దాదాపు రూ.900 ఆదా కానున్నట్లు తెలుస్తోంది.


Also Read: KTR: 'కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోవాలని ప్రభుత్వం కుట్ర' - సర్కారుకు రాజకీయాలే ముఖ్యమయ్యాయని కేటీఆర్ విమర్శలు