KTR Slams Telangana Government in Medigadda Issue: కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత మరిచి కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. శుక్రవారం బీఆర్ఎస్ 'చలో మేడిగడ్డ' పర్యటన సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి రైతుల కంటే రాజకీయమే ముఖ్యమైందని విమర్శించారు. తప్పు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని.. అంతే తప్ప కాళేశ్వరం ప్రాజెక్టే పూర్తిగా కొట్టుకుపోవాలని కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. వర్షాకాలం వచ్చే లోపు ప్రాజెక్టు మరమ్మతులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలకు కాళేశ్వరం గొప్పదనాన్ని వివరించడానికి, పంటలు ఎండిపోకుండా చూడడానికే తాము చలో మేడిగడ్డ పర్యటనకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ మీద కోపాన్ని రైతుల మీద చూపించొద్దని అన్నారు. 



'కాళేశ్వరంపై దుష్ప్రచారం'






కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే ప్రతిష్టాత్మకమైందని.. లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా దీన్ని కేసీఆర్ నిర్మించారని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 'కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం లేనిది ఉన్నట్లు, ఏదో జరిగినట్లు చూపిస్తోంది. ప్రాజెక్టును జీర్ణించుకోలేకే దుష్ప్రచారం చేస్తున్నారు. రైతుల పట్ల ప్రేమ ఉంటే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలి. మేడిగడ్డ బ్యారేజీలోని 84 పిల్లర్లలో  3 మాత్రమే కుంగాయి. లోపాలను సవరించాలి కానీ దీనిపై రాజకీయం చెయ్యొద్దు. రాజకీయాలు చేసేందుకే మేడిగడ్డను వాడుకుంటున్నారు.' అని మండిపడ్డారు.


మేడిగడ్డ సందర్శనకు బీఆర్ఎస్ నేతలు


బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్ నుంచి మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు బయలుదేరారు. పార్టీ అధినేత కేసీఆర్ మినహా కేటీఆర్, పోచారం సహా ఇతర ముఖ్య నేతలంతా ప్రత్యేక బస్సులో తరలివెళ్లారు. తొలుత మేడిగడ్డ సందర్శన అనంతరం అన్నారం బ్యారేజీని పరిశీలించనున్నారు.  ఆ తర్వాత అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రజలకు నిజా నిజాలు తెలియజేసేందుకే ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్నామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. 






Also Read: Tatikonda Rajaiah: తాటికొండ రాజయ్య సతమతం! ఇటీవలే బీఆర్ఎస్‌కు రాజీనామా - కాంగ్రెస్‌లోకి దారులు క్లోజ్!