Telangana: హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గత పది రోజుల నుంచి పూజలు అందుకుంటున్న గణేషుడిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. నిమజ్జనానికి టైం దగ్గర పడటంతోపాటు సెలవులు రావడంతో విగ్రహాల మండపాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుడి వద్ద జనం బారులు తీరారు. మెట్రో స్టేషన్ దగ్గర నుంచి ఏ దారి చూసిన జనంతో కిక్కిరిసిపోయి ఉంది. 70 అడుగులు గణేషుడిని చూడాలన్న ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం ఇక్కడకు వస్తున్నారు. 


భారీగా తరలి వచ్చిన జనం


శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం ఇలా నాలుగు రోజులు రావడంతో ఖైరతాబాద్‌లో ఇసకేస్తే రాలనంతగా జనం వచ్చారు. నాలుగు దిక్కులు ఎటు చూసినా జనమే కనిపిస్తున్నారు. ఖైరతాబాద్‌ మీదుగా వెళ్లే వాహనాలేవీ ఖాళీగా ఉండటం లేదు. ఖైరతాబాద్‌ నుంచి ట్యాంకుబండ్ వరకు మొత్తం నిండిపోయి ఉంది. ఖైరతాబాద్ వినాయకుడిని చూసిన భక్తులు అటుగా ట్యాంకుబండ్‌కు వెళ్లి వినాయక నిమజ్జనం చూసి వస్తున్నారు. 


భక్తులు వినాయకుడిని చూసిన ఆనందంలో ఉంటున్న వేళ కొందరు పోకిరీలు చెత్త పనులతో శునకానందం పొందుతున్నారు. అమ్మాయిలపై చేయి వేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారి ఆగడాలను హైదరాబాద్ పోలీసులు చెక్ పెట్టారు. వారం రోజులుగా కాపు కాసిన పోలీసులకు భారీగా పోకీరులూ చిక్కారు. వారం రోజుల్లో సుమారు మూడు వందల మంది వరకు అసభ్యంగా ప్రవర్తిస్తూ దొరికారు. 


షీటీమ్స్‌ ఫోకస్


ఖైరతాబాద్‌తోపాటు ఫేమస్‌ గణేష్ విగ్రహాలు ఉండే అన్ని ప్రాంతాల్లో షీ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. గణేష్ మండపాలతోపాటు బస్‌లు, పబ్లిక్‌ప్లేసెస్‌, మెట్రో స్టేషన్‌లలో టీమ్స్ తిరుగుతున్నాయి. ఎవరిపైన అయినా అనుమానం ఉన్నా... ఎవరైనా తప్పుడు పనులు చేస్తున్నా ఈ టీమ్స్ పట్టుకుంటున్నాయి.  వీడియో ఎవిడెన్స్‌తో పట్టుకుంటున్నాయి. 


Also Read: గణేష్ నిమజ్జనం - నగరవాసులకు మెట్రో గుడ్ న్యూస్, ఆ రోజున అర్ధరాత్రి వరకూ సర్వీసులు


తప్పుడు పనులు చేస్తూ దొరికిన వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నారు. షీటీమ్స్ పట్టుకోవడమే కాకుండా ప్రజలు కూడా ఫిర్యాదు చేసిన వారిపై కూడా చర్యలు తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఉత్సవాల టైంలోనే కాకుండా ర్యాండమ్‌గా చాలా ప్రాంతాల్లో షీటీమ్స్‌ పని చేస్తుంటాయని అంటున్నారు. ఇలాంటి పోకిరీగాళ్లను రెడ్‌హ్యాడెండ్‌గా పట్టుకొని కోర్టు ముందు ఉంచుతున్నామని చెబుతున్నారు. 


ఇంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఇంకా చాలా మంది ఇలాంటి వాటిపై ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారని అంటున్నారు పోలీసులు. ఎక్కడైనా ఇలాంటి వ్యక్తులు ఉంటే కచ్చితంగా తమ దృష్టికి తీసుకురావాలని సూచిస్తున్నారు. అలాంటి ఫిర్యాదులు వచ్చిన వెంటనే యాక్షన్ తీసుకుంటున్నామని ఫిర్యాదు చేసిన వారి వివరాలు కూడా బయటకు చెప్పడం లేదని అంటున్నారు. 


ఇప్పుడిప్పుడే కొందరు భయం వీడి ఫిర్యాదుల చేస్తున్నారని అలాంటి ప్రాంతాల్లో నిత్యం పెట్రోలింగ్ జరుగుతున్నట్టు వివరించారు. అక్కడ ప్రజలకు రక్షణ కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు. మఫ్టీలో పోలీసులు ఆ ప్రాంతాల్లో గస్తీ కాస్తూ పోకిరీల ఆట కట్టిస్తున్నారని అన్నారు. 


Also Read: అర్ధరాత్రి వరకే ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి అనుమతి, హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్