Metro Special Services For Ganesh Immersion: గణేష్ నిమజ్జన ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమవుతోన్న వేళ హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 17న (మంగళవారం) అర్ధరాత్రి 2 గంటల వరకూ మెట్రో రైళ్లు నడుస్తాయని హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ వెల్లడించింది. చివరి స్టేషన్‌ నుంచి రాత్రి ఒంటిగంటకు చివరి రైలు బయలుదేరుతుందని పేర్కొంది. నిమజ్జనం ముగిసే వరకూ ప్రయాణికుల రద్దీ, అవసరం మేరకు అదనపు రైళ్లు నడుపుతామని తెలిపింది. అటు, వీకెండ్ కావడంతో ఆదివారం ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో మెట్రో స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. శనివారం ఒక్కరోజే 94 వేల మంది ప్రయాణికులు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ఉపయోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.


ఖైరతాబాద్ గణేశుని దర్శనానికి పోటెత్తిన భక్తులు


అటు, ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కమిటీ నిర్వాహకులు, పోలీసులు చర్యలు చేపట్టారు. త్వరగా వినాయకుని దర్శనం అయ్యేలా పోలీసులు పర్యవేక్షిస్తూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మహిళలకు ఆకతాయిల వల్ల ఇబ్బందులు లేకుండా షీటీమ్స్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. సోమవారం భక్తుల దర్శనాలకు అనుమతి ఉండదని.. నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు. 


ఎంఎంటీఎస్ రైళ్లు సైతం..


అటు, గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎంఎంటీఎస్ రైళ్లను సైతం అదనపు ట్రిప్పులను తిప్పనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. నిమజ్జనం రోజు నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము వరకూ.. ఈ నెల 17, 18 తేదీల్లో సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున 4 గంటల వరకూ సర్వీసులు నడుపుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్ - లింగంపల్లి, సికింద్రాబాద్ - హైదరాబాద్, లింగంపల్లి - ఫలక్‌నుమా, లింగంపల్లి - హైదరాబాద్, ఫలక్‌నుమా - సికింద్రాబాద్, హైదరాబాద్ - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - హైదరాబాద్ రూట్లలో ఎంఎంటీఎస్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని.. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


Also Read: Asifabad News: బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే అరెస్ట్ - పోలీసులపై నేతల ఆగ్రహం