Telangana News | ఆసిఫాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండల కేంద్రానికి వెళ్తున్న బీజేపీ ఎంపీ, బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ సహా పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు వారాల కిందట జైనూర్ లో చెలరేగిన అల్లర్లు, ఆస్తుల ధ్వంసం కేసులో గిరిజన బాధితులను పరామర్శించేందుకు బీజేపీ ప్రజాప్రతినిధులు వెళ్తున్నారు. మార్గం మధ్యలో మధ్యాహ్నం ఉట్నూర్ ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


ప్రజల సాధకబాధకాలు వినేందుకు ప్రజా ప్రతినిధులుగా వెళ్తున్నామని తమకు అనుమతి ఇవ్వాలని ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పట్టు పట్టారు. నిషేధాజ్ఞల కారణంగా వెళ్లడానికి అనుమతించేది లేదని ఎంపీ, ఎమ్మెల్యేలకు అక్కడి పోలీసులు స్పష్టం చేశారు. ఆపైన జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు అయినప్పటికీని పోలీసులు అనుమతించలేదు. దీంతో వారిని ఉట్నూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్ తో పాటు బిజెపి జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్, సీనియర్ నేతలు రవీందర్, మున్సిపల్ కౌన్సిలర్ ఆకుల ప్రవీణ్ కుమార్, అశోక్ రెడ్డి గణేష్,లను పోలీసులు ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు.


ఈ సందర్భంగా ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ.. జైనూర్ ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వారం రోజుల తర్వాత కూడా తమని అనుమతించకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం కేవలం ఒక వర్గం వారికి కొమ్ము కాస్తూ, ఆదివాసి గిరిజనుల పట్ల వివక్ష చూపుతోందని ఎంపీ, ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేతలు చెప్పిన మాటల్ని పాటిస్తూ.. అమాయకులను అరెస్టు చేస్తూ ఏజెన్సీలో శాంతిభద్రతలకు పోలీసులే విఘాతం కల్పిస్తున్నారని వారు విమర్శించారు. 


Also Read: Ganesh Laddu Auction: వేలంలో రికార్డ్ ధర పలికిన మై హోమ్ భుజా గణేషుడి లడ్డూ, ధర ఎంతంటే