Donald Trump Faced Second Assassination Attempt: అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి కాల్పులు జరగడం కలకలం రేపుతోంది. ఆయన ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లోని తన గోల్ఫ్ కోర్స్‌లో గోల్ఫ్ ఆడుతుండగా గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనపై ఎఫ్‌బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. తను క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఓ ప్రకటన విడుదల చేశారు. అదే సమయంలో, సీక్రెట్ సర్వీస్ కూడా ఈ కాల్పుల విషయంలో దర్యాప్తు ప్రారంభించింది.
"అధ్యక్షుడు ట్రంప్ తన పరిసరాల్లో తుపాకీ కాల్పులను ఎదుర్కొని సురక్షితంగా ఉన్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. " అని ట్రంప్ ప్రచార కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చియుంగ్ ఒక ప్రకటనలో వివరించారు.
తాను క్షేమంగా ఉన్నానని ట్రంప్ తన మద్దతుదారులకు పంపిన సందేశంలో తెలిపారు. “నా పరిసరాల్లో తుపాకీ కాల్పులు జరిగాయి, కానీ పుకార్లు రాకముందే పరిస్థితి అదుపులో ఉండాలని ఈ ప్రకటన చేస్తున్నాను. నాపై వచ్చే ఫేక్ ప్రచారాన్ని నమ్మేముందు నేను చెప్పేది వినండి. నేను సురక్షితంగా ఉన్నాను, బాగానే ఉన్నాను! ఏదీ నన్ను ఆపలేదు. నేను ఇలాంటి వాటికి తలొగ్గే పరిస్థితి లేదు. " అని మాజీ అధ్యక్షుడు అన్నారు.
ట్రంప్ గోల్ఫ్ క్లబ్‌లోకి రైఫిల్‌ను గురిపెట్టి, అరెస్టు అయిన వ్యక్తి పేరు ర్యాన్ వెస్లీ రౌత్ అని అధికారులు చెబుతున్నారు. ప్రెసిడెంట్ జో బిడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఇద్దరికీ ఘటనపై సమాచారాన్ని చేరవేసినట్టు వైట్ హౌస్ తెలిపింది.
"మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ గోల్ఫ్ ఆడుతున్న ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ కోర్స్‌లో జరిగిన భద్రతా ఘటన గురించి అధ్యక్షుడు, ఉపాధ్యక్షులకు వివరించాం. ఆయన సురక్షితంగా ఉన్నారని తెలుసుకున్నట్టు తెలిపారు. దర్యాప్తు అంశాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తున్నాం." అని వైట్ హౌస్ ప్రకటించింది.
ట్రంప్ గోల్ఫ్ ఆడుతున్న ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లోని ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో తుపాకీ కాల్పుల శబ్దం వినిపించిన వెంటనే FBI ఓప్రకటన విడుదల చేసి... "మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై హత్యాయత్నానికి పాల్పడినట్లుగా కనిపిస్తోందని దర్యాప్తు చేస్తోంది"అని తెలిపింది.
స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో గోల్ఫ్ కోర్స్ సమీపంలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు AK-47తో ఉన్న వ్యక్తిని గుర్తించారు. వెంటనే ఏజెంట్లు అతనిపై కాల్పులు జరిపారు.
అదే క్యాంపస్‌లో ఉన్న ట్రంప్ ప్రచార ప్రధాన కార్యాలయం మూసివేసి ఉంది. "ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్‌పై వద్ద జరిపిన కాల్పులు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను గురి పెట్టినవేనని అధికారులు భావిస్తున్నారు, అని CNN రిపోర్ట్ చేసింది.
"ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ కోర్స్ వెస్ట్ పామ్ బీచ్‌లో సీక్రెట్ సర్వీస్ అనుమానాస్పద వ్యక్తిని గుర్తించిందని, ఏజెంట్లు తుపాకీ బారెల్‌గా కనిపించడంతో కాల్పులు జరిపారని సోర్సెస్ తెలిపింది" అని న్యూయార్క్ పోస్ట్ రోపోర్టు చేసింది.
"అధ్యక్షుడు ట్రంప్‌తో ఇప్పుడే మాట్లాడాను. నాకు తెలిసిన ఆయన అత్యంత బలమైన వ్యక్తులలో ఒకరు. ఇప్పుడు మరింత ఉత్సాహంతో ఉన్నారు. మన దేశాన్ని రక్షించడానికి గతంలో కంటే ఎక్కువ సంకల్పంతో ఉన్నారు" అని ట్రంప్‌తో మాట్లాడిన తర్వాత సెనేటర్ లిండ్సే గ్రాహం అభిప్రాయపడ్డారు.