గణేష్ నవరాత్రులు ముగుస్తున్న సందర్భంలో హైదరాబాద్ కోలాహలంగా మారింది. గణేష్ మండపాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఖైరతాబాద్ వినాయకుడి వద్ద ఈ సందడి మరింత ఎక్కువైంది. వరుస సెలవలు రావడంతో భక్తులు ఖైరతాబాద్ కి పోటెత్తారు. ఖైరతాబాద్ గణేష్ మండపం భక్త జన సంద్రంగా మారింది. వివిధ ప్రాంతాలనుంచి భక్తులు ఖైరతాబాద్ వినాయకుడిని చూసేందుకు పోటెత్తారు. దీంతో నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
అర్థరాత్రి వరకే అనుమతి..
హైదరాబాద్ లో మంగళవారం నిమజ్జనోత్సవం జరుగుతుంది. నిమజ్జనోత్సవానికి ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి. హుస్సేన్ సాగర్ వద్ద భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు. ఇక ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం కోసం ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో రేపు(సోమవారం) అంతా అక్కడ శోభాయాత్ర కోలాహలం ఉంటుంది. అందుకే రేపు దర్శనాలకు అవకాశం లేదు. ఈరోజు అర్థరాత్రి వరకే దర్శనాలకు అనుమతి ఉందని నిర్వాహకులు స్పష్టం చేశారు. దీంతో భక్తులు ఖైరతాబాద్ కి పోటెత్తారు.
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రకోసం ఇప్పటికే ట్రాలీలు తీసుకొచ్చి వెల్డింగ్ పనులు మొదలు పెట్టారు. అందుకే దర్శనాలను ఈరోజు అర్థరాత్రి వరకే పరిమితం చేశారు. ఈరోజు అర్థరాత్రి తర్వాత ఖైరతాబాద్ గణేష్ దర్శనం ఉండదని, శోభాయాత్రకు ఏర్పాట్లు జరుగుతుంటాయని, భక్తులెవరూ ఆ సమయంలో రావొద్దని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. దీంతో ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి మరికొన్ని గంటలే సమయం ఉండటంతో భక్తులు పోటెత్తారు. గంట గంటకూ అక్కడ భక్తుల సంఖ్య పెరుగుతోంది.
అసలే వారాంతం, అందులోనూ ఆదివారం సాయంత్రం. హైదరాబాద్ నగరంలో మామూలుగానే ట్రాఫిక్ జామ్ ఉంటుంది. పైగా గణేష్ నవరాత్రులు చివరికి చేరడంతో ఆ ట్రాఫిక్ మరింత పెరిగింది. ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి ఈరోజు అర్థరాత్రి వరకు అవకాశం అని నిర్వాహకులు ప్రకటించడంతో ఆ ప్రాంతం మరింత రద్దీగా మారింది. పైగా వర్షం కూడా ఈ ట్రాఫిక్ ని మరింత పెంచింది. ఖైరతాబాద్ రోడ్ పై విపరీతమైన ట్రాఫిక్ ఉంది. మెట్రో స్టేషన్ కూడా రద్దీగా మారింది. వ్యక్తిగత వాహనాల్లో వచ్చేవారికి పార్కింగ్ సమస్య ఉంటుంది. అందుకే చాలామంది బస్ లు, మెట్రోలో ఇక్కడికి వస్తున్నారు.
Also Read: గణేష్ నిమజ్జనం - నగరవాసులకు మెట్రో గుడ్ న్యూస్, ఆ రోజున అర్ధరాత్రి వరకూ సర్వీసులు
అటు ఐమ్యాక్స్ థియేటర్ వైపు నుంచి కూడా భారీగా జనం తరలి వస్తున్నారు. ఇటు లక్డీకపూల్ - పంజాగుట్ట రోడ్ వైపునుంచి జనం భారీగా తరలి వస్తున్నారు. అటు ఐమ్యాక్స్ థియేటర్ వైపు నుంచి కూడా జనం దర్శనాల కోసం క్యూ కట్టారు. బ్యారికేడ్లు కూడా తొలగించుకుని భక్తులు దర్శనాలకోసం వస్తున్నారు. వారిని అదుపు చేయడం పోలీసులకు కూడా సాధ్యం కావడంలేదు. నిర్వాహకులు వాలంటీర్లు భక్తుల్ని కంట్రోల్ చేస్తున్నారు క్యూలైన్లలో ఉన్నవారిలో వృద్ధులు, చిన్నారులతో వచ్చిన మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షంలో తడుస్తూనే ఖైరతాబాద్ గణపతి దర్శనం చేసుకుని బయలుదేరుతున్నారు.