Couple Hijack Truck:


2.5 టన్నులున్న ట్రక్ చోరీ..


తమిళనాడుకి చెందిన ఓ జంట టమాటాల కోసం పెద్ద నాటకమే ఆడింది. 2.5 టన్నులున్న ఓ ట్రక్‌ని హైజాక్ చేసింది. బెంగళూరు నుంచి ట్రక్‌ని చోరీ చేసి తీసుకెళ్లిపోయింది. యాక్సిడెంట్ డ్రామా ఆడి సింపుల్‌గా ట్రక్‌ని ఎత్తుకెళ్లిపోయారు. వెల్లూరు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...హైవేపై కొందరు ముఠాలు ఇలా ట్రక్‌లను దొంగిలిస్తున్నారు. అయితే తమిళనాడుకి చెందిన ఓ జంట తమ కార్‌తో ఓ ట్రక్‌ని కావాలనే ఢీకొట్టింది. ఆ తరవాత ఆ ట్రక్ డ్రైవర్‌తో గొడవపడింది. రిపేర్‌ చేయించుకోడానికి డబ్బులివ్వాలని డిమాండ్ చేసింది. ఆ ట్రక్ డ్రైవర్ ఓ రైతు. డబ్బులివ్వను అని తేల్చి చెప్పాడు. మాట్లాడుతుండగానే ఈ జంట రైతుపై దాడి చేసింది. ట్రక్‌ నుంచి రైతుని బయటకు లాగేసింది. 2.5 టన్నులున్న ఆ ట్రక్‌ని ఎత్తుకెళ్లింది. వాటి విలువ రూ.2.5 లక్షలు. జులై 8న ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. రైతు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే ఆ ట్రక్‌ని గుర్తించారు. నిందితులు భాస్కర్, సింధూజను అరెస్ట్ చేశారు. వీళ్ల గ్యాంగ్‌లో మిగతా వాళ్ల కోసం గాలిస్తున్నారు. త్వరలోనే వాళ్లనూ పట్టుకుంటామని స్పష్టం చేశారు పోలీసులు. 




కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఓ మహిళా రైతు టమాటా పండించింది. ధరలు పెరగడం వల్ల మంచి ఆదాయం వస్తుందని సంబర పడింది. పంటకోసి మార్కెట్‌కి తీసుకెళ్దామని చూసే లోపు ఒక్క కాయ కూడా కనిపించలేదు. అంతా దొంగల పాలైంది. దాదాపు రూ.2.5 లక్షల విలువైన టమాటాలను ఎత్తుకెళ్లారు దుండగులు. టమాటా సాగు చేసేందుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నానని, వాటిని ఎలా కట్టాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది బాధితురాలు. జులై 6న ఈ ఘటన జరిగింది. 


"పంట సాగు కోసం చాలా ఖర్చు చేశాం. లోన్‌లు తీసుకొచ్చాం. పంట దిగుబడి బాగుంది. ధరలూ పెరిగాయి. కానీ పొలంలో దొంగలు పడ్డారు. 50-60 బ్యాగుల టమాటాలు తీసుకెళ్లడమే కాకుండా పక్కనున్న పంటనూ నాశనం చేశారు"


- మహిళా రైతు, బాధితురాలు 


2 ఎకరాల్లో పంట సాగు చేసింది మహిళా రైతు. సరిగ్గా పంట కోతకు వచ్చే సమయానికే ఒక్క కాయ కూడా లేకుండా దొంగలు అంతా ఊడ్చేశారు. బెంగళూరులో టమాటా కిలో ధర రూ.120గా ఉంది. ప్రస్తుతానికి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు, ఆ దొంగల్ని పట్టుకోవాలని రిక్వెస్ట్ చేస్తోంది. కర్ణాటకలోనే కాదు. తెలంగాణలోనూ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లోని మార్కెట్‌లో టమాటాతో పాటు పచ్చిమిర్చి బాక్సులు చోరీకి గురయ్యాయి. అక్కడే ఉన్న సీసీటీవీని పరిశీలించిన పోలీసులు దొంగతనం జరిగిందని వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో టమాటాల దొంగతనం జరిగింది. ఓ కూరగాయల మార్కెట్ లో ఉన్న టమాటా ట్రేలను ఎత్తుకెళ్లేందుకు ఓ గుర్తు తెలియని వ్యక్తి పకడ్బందీగా ప్లాన్ వేశాడు. హెల్మెట్టుతో పాటు జాకెట్ కూడా వేసుకొని వచ్చి రూ.6,500 విలువ చేసే మూడు టమాటాల ట్రేలను ఎత్తుకెళ్లిపోయాడు. అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.


Also Read: కొండెక్కి కూర్చున్న కూరగాయల ధరలు, భారీ వర్షాల ఎఫెక్ట్‌తో సామాన్యుల బడ్జెట్ తలకిందులు