Vegetables Price:


దడ పుట్టిస్తున్న ధరలు..


వర్షాలతో సతమతం అవుతున్న జనాలకు కూరగాయల ధరలు మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా చోట్ల వరదలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యండా దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లోనూ వరదలు చుట్టుముట్టాయి. ఫలితంగా పంట నష్టం వాటిల్లింది. ఇప్పటికే ఈ ప్రభావం టమాటా ధరల రూపంలో చూస్తూనే ఉన్నాయి. రోజువారీ వంటల్లో వినియోగించే టమాటాల ధరలు పెరగడం వల్ల చాలా మంది వాటిని కొనడమే తగ్గించారు. ప్రస్తుత వరదల కారణంగా ఒక్క టమాటానే కాకుండా అన్ని కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొత్తిమీర కట్ట నుంచి అల్లం, సొరకాయ, క్యాప్సికమ్ ప్రియమైపోయాయి. గత నెల రోజుల్లోనే కూరగాయల ధరలు 20-40% వరకూ పెరిగాయి. ఫలితంగా...సామాన్యుడి బడ్జెట్ తలకిందులవుతోంది. ఢిల్లీ, NCRలలో వరదల కారణంగా పలు రాష్ట్రాలకు కూరగాయ సరఫరా ఆగిపోయింది. యమునా నదీ తీర ప్రాంతాల్లోని పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. పండ్ల సాగుపైనా ప్రభావం పడింది. గ్రాసరీ స్టోర్‌లలో కొన్ని కూరగాయలు అసలు అందుబాటులో ఉండడం లేదు.


అరటి కాయలు ఒక్కొక్కటి 20 రూపాయలు చెబుతున్నారు. మునక్కాయలు అయితే ఒకటి పది రూపాయలు చెబుతున్నారు. ఆకు కూరల సంగతి సరే సరి. ఒకప్పుడు 20 రూపాయలు ఇస్తే ఇంటిళ్లపాది ఏదైనా ఆకుకూర తినేటోళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రెండు చిన్న చిన్న కట్టలు కట్టి 20 రూపాయలు చెబుతున్నారు. గట్టిగా తింటే ఒకరి కూడా సరిపోని పరిస్థితి ఉంది. పాలకూర, తోటకూర, గోంగూర, బచ్చల కూర ఇలా ఏ ఆకు కూర తీసుకున్నా ఇదే పరిస్థితి. కొత్తిమీర, పుదీనా అయితే వాసన చూడటానికి కూడా వీల్లేనంతగా పెరిగిపోయింది. 


పండ్లు కూడా ప్రియమే..


ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినా అవి మార్కెట్‌కి మించి డబ్బులు వసూలు చేస్తున్నాయి. నిజానికి బయటి మార్కెట్‌తో పోల్చుకుంటే కొన్ని వెజిటెబుల్స్ ధరలు ఆన్‌లైన్‌లో తక్కువగా ఉంటాయి. కానీ..ఇప్పుడు అవి కూడా ప్రియమైపోయాయి. గ్రేటర్ నోయిడాలో కిలో టమాటా ధర రూ.250కి చేరుకుంది. అల్లం ధరలూ దడ పుట్టిస్తున్నాయి. కిలో రూ.300కి తగ్గడం లేదు. సొరకాయ, బెండకాయ, కాలీఫ్లవర్ కూడా టమాటాతో పోటీ పడుతున్నాయి. ఈ ధరల పెరుగుదల కారణంగా గతంలో కిలో కొనేవాళ్లు ఇప్పుడు అరకిలోతో సరిపెట్టుకుంటున్నారు. అత్యవసరమైతే తప్ప ఎక్కువ కూరగాయలు కొనడం లేదు. ఉన్నవాటితోనే ఎలాగోలా వండుకుంటున్నారు. కిలో బెండకాయ రూ.60-100 వరకూ పలుకుతోంది. సొరకాయ కిలో రూ.50 వరకూ ఉంటోంది. ఇక సుగంధ ద్రవ్యాల ధరలూ ఇలాగే మండి పోతున్నాయి. ఉప్పు, నూనె, పప్పులు, చక్కెర ధరలూ పెరిగాయి. కిలో ఉప్పు ప్యాకెట్ రూ.24 ఉండగా..ఇప్పుడది చాలా చోట్ల రూ.30-35 వరకూ పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో రెండు మూడు నెలలుగా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఊహించిన దాని కంటే ఎక్కువ వర్షపాతం నమోదవడం వల్ల భారీ నష్టం వాటిల్లింది. యాపిల్స్‌ ఓ బాక్స్ ధర గతంలో రూ.1,200 ఉండగా..ఇప్పడది రూ.1,500 వరకూ పెరిగిపోయింది. 


Also Read: AI టెక్నాలజీ మన జీవితాల్ని సింప్లిఫై చేస్తుండొచ్చు, కానీ తస్మాత్ జాగ్రత్త - సీజేఐ చంద్రచూడ్