Asian Games Trials: మరో రెండు నెలలలో  చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగబోయే ఆసియా క్రీడలలో  భాగంగా రెజ్లింగ్ విభాగంలో ఎలాంటి ట్రయల్స్ లేకుండానే  నేరుగా ఆడేందుకు అనుమతి పొందిన   కుస్తీ యోధులపై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఒఎ) అడ్‌హక్ ప్యానెల్ తీసుకున్న నిర్ణయంపై తాము జోక్యం చేసుకోబోమని  ఢిల్లీ  హైకోర్టు తేల్చి చెప్పింది. జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ ఈ పిటిషన్‌ను కొట్టిపారశారు. ‘రిట్ పిటిషన్ ఈజ్ డిస్మిస్డ్’ అంటూ  ప్రసాద్ తెలిపారు.


మహిళల 53 కిలోల విభాగంలో  వినేశ్ ఫొగాట్‌ను పురుషుల   65 కిలోల విభాగంలో భజరంగ్‌ను  నేరుగా పంపడాన్ని సవాల్ చేస్తూ అండర్ - 20 ఛాంపియన్ అంతిమ్ పంగల్, అండర్ - 23 ఛాంపియన్  సుజీత్  కల్కల్‌లు  ఢిల్లీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై  రెండ్రోజుల క్రితమే కోర్టు.. వివరణ ఇవ్వాలని ఐవోఏను ఆదేశించింది. కాగా శనివారం  న్యాయస్థానం.. ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు  పేర్కొంది. అయితే ఇందుకు గల కారణాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.  


సుప్రీంకోర్టుకు వెళ్తాం.. 


ఢిల్లీ హైకోర్టు తమ పిటిషన్‌ను కొట్టేసినా అంతిమ్ పంగల్,   సుజీత్‌లు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. తాము న్యాయపోరాటం చేస్తున్నామని, తప్పక గెలుస్తామని ఈ ఇద్దరూ ఆశాభావం వ్యక్తం చేశారు.  ఇదిలాఉండగా..  ఢిల్లీ వేదికగా జరుగుతున్న  ఆసియన్ గేమ్స్ రెజ్లింగ్ ట్రయల్స్‌లో  అంతిమ్ సత్తా చాటింది.  శనివారం మహిళల 53 కిలోల విభాగంలో ఆమె.. విజేతగా నిలిచింది. ఈ విభాగంలో ఆమెనే విజేతగా నిలిచినా ఆసియా క్రీడల్లో ఆమె పాల్గొనేది అనుమానమే. ఇదే కేటగిరీలో వినేశ్ ఫొగాట్ నేరుగా  అర్హత సాధించిన విషయం తెలిసిందే.  అంతిమ్  ఆసియా క్రీడలకు వెళ్లినా వినేశ్‌కు స్టాండ్ బై గానే ఉంటుంది.   దీనిపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.


 






నేనెందుకు స్టాండ్ బై గా ఉంటా..? 


‘నేను ట్రయల్స్ గెలిచా. నేనెందుకు స్టాండ్ బై గాఉండాలి..   ట్రయల్స్ ఆడనివాళ్లు  స్టాండ్ బై గా ఉండాలి. ఢిల్లీ కోర్టులో నా పిటిషన్‌ను తిరస్కరించారు. కానీ నేను న్యాయ పోరాటం ఆపను. మేం సుప్రీంకోర్టుకు వెళ్తాం.   ఆమె (వినేశ్‌ను ఉద్దేశిస్తూ) ఇలా ట్రయల్స్ లేకుండా నేరుగా ఆడితే  ఇతరులతో పోల్చితే ఆమె సామర్జ్యమేంటో ఎలా తెలుస్తుంది..? ఈ విషయంలో మేం చివరిదాకా పోరాడతాం..’ అని అంతిమ్ తెలిపింది. 


రవి దహియాకు షాక్.. 


భారత కుస్తీ యోధుడు, టోక్కో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడలిస్ట్ రవి దహియాకు  భారీ షాక్ తాకింది. ఆసియా క్రీడల్లో భాగంగా నిర్వహిస్తున్న ట్రయల్స్‌లో  దహియా..  మహారాష్ట్రకు చెందిన  అతిష్ తోడ్కర్ చేతిలో ఓడిపోయాడు. 57 కేజీల విభాగంలో పోటీ పడుతున్న  దహియా.. అతియా చేతిలో ఓడటంతో ఈ క్రీడల నుంచి  తప్పుకోనున్నాడు. 


 

























ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial