Srikalahasti News : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వన్ టౌన్ సీఐ అంజూ యాదవ్ రెచ్చిపోయారు. ఓ మహిళపై తన ప్రతాపం చూపారు. సీఐ అంజూ యాదవ్ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సీఐగా శ్రీకాళహస్తిలో బాధ్యత చేపట్టిన తొలిరోజుల్లో అన్యాయాలను అరికట్టడం, ఆలయాల్లో దళారీ వ్యవస్థపై ఉక్కుపాదం మోపి భక్తులను కాపాడి శెభాష్ అనిపించుకున్నారు. అంతే కాకుండా పిన్ కార్ప్ బ్యాంక్ దోపీడి కేసును ఛేదించి పోలీస్ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. ప్రజల మెప్పుపొందిన అనతికాలంలోనే తన రూట్ మార్చి వివాదాల్లో చిక్కుకున్నారు. నెల మామూళ్లు కోసం ఆశపడి సీఐ రచ్చకెక్కారు. ఓ అధికార పార్టీ ప్రతినిధి దృష్టికి ఈ వ్యవహారం చేరడం, సీఐపై ఆ ప్రతినిధి సున్నితంగా మందలించారని సమాచారం. ఈ విషయంపై ఆగ్రహించిన సీఐ అంజూ యాదవ్ తనపై ఆ ప్రతినిధికి చెప్పిన వ్యక్తిపై కక్షగట్టి అతను దొరకకపోవడంతో అతని భార్యపై ప్రతాపం చూపారు. ఆ మహిళ పై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహిళపై సీఐ దాడి
శ్రీకాళహస్తి వన్ టౌన్ సీఐ అంజూ యాదవ్ తీరుపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించి, రాత్రి సమయంలో ఆమెను కొట్టి బలవంతంగా పోలీసు జీప్ ఎక్కించి స్టేషన్ కు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. బాధిత మహిళ ఓ హోటల్ నిర్వహిస్తోంది. మహిళ దగ్గరకు వెళ్లిన సీఐ అంజూ యాదవ్ ఆమె భర్త ఆచూకీ అడిగారు. అయితే మహిళ తెలియదని చెప్పడంతో ఆమెపై సీఐ అంజూ యాదవ్ రెచ్చిపోయారు. నడిరోడ్డుపై మహిళపై అమానుషంగా దాడి చేశారు. ఆమె చీర ఊడిపోతున్న సీఐ స్పందించలేదు. మహిళను బలవంతంగా జీప్ ఎక్కించి రాత్రి సమయంలో పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అకారణంగా సీఐ తనపై దాడి చేశారని బాధిత మహిళ అంటున్నారు. తన కుమారుడు వేడుకున్నా సీఐ పట్టించుకోకుండా దాడి చేశారని బాధితురాలు ఆవేదన చెందారు. సీఐ కొంతకాలంగా తమ కుటుంబాన్ని వేధిస్తోందని బాధిత మహిళ ఆరోపిస్తుంది.
మహిళ కమిషన్ సీరియస్
శ్రీకాళహస్తిలో చిరు వ్యాపారం చేసుకుంటున్న మహిళపై సీఐ అంజూ యాదవ్ వ్యవహరించిన తీరుపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. సీఐ అంజూ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ సభ్యురాలు లక్ష్మి ఎస్పీని కోరారు. గతంలోనూ సీఐ అంజూ యాదవ్ పై పలు ఫిర్యాదులు ఉన్నాయి. ధర్నా చేస్తున్న టీడీపీ నేతలపై సీఐ చేయి చేసుకున్న వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా సీఐ తీరు ఉందని మహిళ కమిషన్ సభ్యురాలు అన్నారు. సాటి మహిళ పట్ల సభ్యసమాజం తలదించుకునేలా సీఐ వ్యవహరించారని తెలిపారు.
Also Read : VIjay CID : చింతకాయల విజయ్ ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !
Also Read : ఏడుగురిని పెళ్లాడిన మహిళ, చివరకు ఏమైందంటే?