West Godavari News: డబ్బున్న వారినే లక్ష్యంగా చేసుకొని మాయ మాటలు చెప్పి పెళ్లి ప్రేమ అంటూ నిలువునా ముంచేసే అబ్బాయిలనే ఇప్పటి వరకు చూశాం. ఇప్పుడు ఈ కిలాడీ బిజినెస్‌లోకి అమ్మాయిలు కూడా మెంబర్‌షిప్‌ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఓ మహిళ ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా ఏడుగురుని పెళ్లి చేసుకుంది. డబ్బున్న వారినే లక్ష్యంగా చేసుకొని వారి చెంత చేరడం, మాయ మాటలు చెప్పడం, పెళ్లి చేసుకోవడం ఆమెకు అలవాటు. అలా పెళ్లయ్యాక కొంత కాలం వాళ్లతో కాపురం చేసి.. అదును చూసుకొని వాళ్ల దగ్గర ఉన్న డబ్బు, నగలతో ఉడాయిస్తుంది. అలాంటి ఓ కిలేడీ లేడీ ఓ పురుషుడి ఫిర్యాదుతో పోలీసులకు చిక్కింది. 


అసలేం జరిగిందంటే..?


పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం పేకేరు గ్రామానికి చెందిన రోకళ్ల వెంకట లక్ష్మి (అలియాస్ గుంటూరు కందుకూరి నాగలక్ష్మి) అతని వద్ద పనికి చేరింది. అతనికి ప్రేమ పేరుతో దగ్గరైంది. 2021 మార్చి 13వ తేదీన గుంటూరులో వివాహం చేసుకుంది. ఇద్దరూ విశాఖపట్నం చేరుకొని.. జగదాంబ జంక్షన్ సమీపంలో ఓ ఇంట్లో అద్దెకు ఉన్నారు. అతను ఓ కంపెనీలో ఆడిటర్ గా పని చేసే వాడు. వెంకట లక్ష్మి మాయ మాటలు చెప్పి ప్రతీ నెలా జీతాన్ని తన అకౌంట్ నుంచి ఆమె అకౌంట్ కు బదిలీ చేసుకునేది. పిత్రార్జితంగా వచ్చిన గుంటూరు జిల్లాలోని గోరింట్ల వద్ద డాబా ఇల్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలోని 12 సెంట్ల ఖాళీ స్థలం ఆమె పేరిట మార్పించుకుంది. 


ఆరు నెలల గర్భంతో ఉన్న సమయంలో 3 తులాల బంగారం, బ్యాంకు అకౌంట్ లో ఉన్న సొమ్ము తీసుకొని అతనిని వదిలి వెళ్లిపోయింది. ఈ విషయమై గుంటూరు, భీమవరం పోలీసు స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి విచారించగా ఆమె బాగోతం బయట పడింది. భీమవరంలో ఇద్దరు, పాత గుంటూరులో ఒకరు, గుంటూరు శారదా నగర్ లో ఒకరు, విజయవాడ రాజరాజేశ్వరి పేటలో ఒకరు గుంటూరు డొంకరోడ్డులో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిని మోసగించినట్లు తేలింది.  


బంగాల్ లో 28 ఏళ్లకు 24 మంది పెళ్లాడిన యువకుడు


బంగాల్ లోని సాగర్ దిగీ ప్రాంతానికి చెందిన ఓ మహిళను అసబుల్ మొల్లా అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు పెళ్లి జరిగిన కొంత కాలం వీరి కాపురం బాగానే సాగింది. ఆ తర్వాత ఒతడు ఒక్కసారిగా మాయమైపోయాడు. అలాగే ఇంట్లోనే ఉన్న ఆమె నగలు కూడా కనిపించకుండా పోయాయి. దీంతో అనుమానం వచ్చిన ఆమె.. భర్త మోసం చేశాడని సాగర్ దిగీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇలాఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 


నకిలీ గుర్తింపు కార్డులను అవలీలగా సృష్టించి బిహార్, పశ్చిమ బంగాల్ లోని పలు ప్రాంతాల్లో అసబుల్ తిరిగేవాడు. ఒక చోట అనాథ అని, మరో చోట జేసీబీ డ్రైవర్ అని, ఇంకో చోట కూలీ ఇలా పేర్లు మార్చుకుంటూ తిరిగేవాడు. అలా 24 పెళ్లిళ్లు చేసుకున్నాడు. పెళ్లయిన కొన్నాళ్లకు ఇంట్లోని నగలు, డబ్బులు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యే వాడు. ఇలా 23 మందిని మోసం చేసి సాగర్ దిగీలోని  ఓ మహిళను 24వ పెళ్లి చేసుకున్నాడు. ఎప్పటిలాగే తన చేతి వాటం చూపించి అక్కడి నుంచి పారిపోయాడు. కానీ ఈసారి మనువాడిని అమ్మాయి అతనిపై ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు అసబుల్ ను పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. అతడి బాగోతం బయట పడింది. ఇంకా పూర్తిగా విచారణ జరిపుతామని చెబుతున్నారు.