ఎటువంటి హంగామా లేకుండా తన పని తాను చేసుకుంటూ ఉండే వ్యక్తి హీరో నాని. అందుకే ఆయన్ని అభిమానులు నేచురల్ స్టార్ అని పిలుస్తారు. నాని కథానాయకుడిగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్ ని చిత్ర బృందం ఇచ్చింది. దసరా పండగకి ముందే నాని ప్రేక్షకులకి 'దసరా' కానుక రానుంది. అక్టోబర్ 3 వ తేదీన ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ని విడుదల చేస్తున్నట్టు మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు.


మాసిన గడ్డంతో మాస్ లుక్ లో నాని కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఫ్యామిలీ ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా ఎప్పుడు నాని సినిమాలు ఉంటాయి. కానీ ఈసారి మాత్రం మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఏడాది 2023, మార్చి 30న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. నాని సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ కలిసి నేను లోకల్ సినిమాలో నటించారు. దర్శకుడు కొత్త వాడైనా ఈ సినిమాపై నాని ప్రేక్షకులు భారీ అంచలనాలు పెట్టుకున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


తెలంగాణలోని గోదావ‌రిఖ‌ని సమీపంలో ఉన్న సింగ‌రేణి ప్రాంతానికి చెందిన ఫిక్ష‌న‌ల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తీస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్ కంప్లీట్ కాగా.. రెండో షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలయినట్లు సినిమా యూనిట్ వెల్లడించింది. ఇక ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ లాంటి తారలు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. నాని నటించిన తొలి పాన్ ఇండియా చిత్రంగా రాబోతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించనున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్‌, నవీన్ నూలి ఎడిటర్‌.


విడుదలకి ముందే రూ.80 కోట్ల బిజినెస్


ఈ సినిమాకి సంబంధించి నాన్ థియేట్రికల్ బిజినెస్ పూర్తి చేశారు.  నాన్ థియేట్రికల్ రైట్స్ మొత్తం కలుపుకొని రూ.50 కోట్ల మేరకు బిజినెస్ జరిగింది. ఇప్పుడు థియేట్రికల్ బిజినెస్ కూడా సింగిల్ పాయింట్ కింద అమ్మేశారు. ఓవర్సీస్ మినహా మిగిలిన థియేటర్ హక్కులను రూ.27 కోట్లకు అమ్మేశారు. చదలవాడ శ్రీనివాసరావు ఈ సినిమాను కొనుక్కున్నట్లు తెలుస్తోంది. అంటే ఇప్పటివరకు ఎనభై కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగిందన్నమాట. నిజానికి నాని సినిమాలకు ముప్పై నుంచి నలభై కోట్ల రేంజ్ లో ఖర్చవుతుంది. కానీ ఈ సినిమాకి రూ.70 కోట్ల వరకు అవుతుందట. 


 రాజుగారి కోట లాంటి ఇంట్లో ఉండే హీరోయిన్.. స్లమ్ లో ఉండే హీరోని ప్రేమిస్తుంది. ఈ ఎపిసోడ్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసినట్లు సమాచారం. సినిమాకి ఇదొక ప్లస్ పాయింట్ అవుతుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.