Infosys Buyback: ఐటీ మేజర్‌ ఇన్ఫోసిస్‌, ఈ ఆర్థిక సంవత్సరం (FY23) రెండో త్రైమాసికం (జులై-సెప్టెంబర్‌) ఫలితాలు వెల్లడించే సమయంలోనే షేర్ల బైబ్యాక్‌ను కూడా ప్రకటించవచ్చని గ్లోబల్‌ బ్రోకరేజ్‌ జెఫరీస్ (Jefferies) అంచనా వేసింది. ఐటీ సెక్టార్‌ రిజల్ట్ ప్రివ్యూ నోట్‌లో ఈ విషయాన్ని బ్రోకింగ్‌ హౌస్‌ వెల్లడించింది. అయితే, బైబ్యాక్ పరిమాణం ఎంత ఉండచ్చన్న విషయాన్ని పేర్కొనలేదు. 


Q2FY23 నంబర్లను ఈ నెల 12న ఇన్ఫోసిస్ ప్రకటించనుంది.


రెసిషన్‌ భయాల నేపథ్యంలో... డిమాండ్‌ వాతావరణం మీద మేనేజ్‌మెంట్‌ కామెంటరీ ఎలా ఉంటుందన్న విషయం మీదే మార్కెట్‌ ప్రధాన ఫోకస్‌ ఉంటుంది. డీల్ పైప్‌లైన్, సేల్స్‌ సైకిల్‌, డీల్స్‌ స్వభావం, డీల్స్‌ కాల పరిమితి, ప్రైస్‌ వంటివాటి మీద మేనేజ్‌మెట్‌ ఏం చెబుతుందన్న విషయాన్ని కూడా ఇన్వెస్టర్లు ఆసక్తిగా చూస్తారు. 


క్లయింట్ల బడ్జెట్‌ లేదా ఖర్చుల విషయంలో క్లయింట్లు చేసిన మార్పులనూ మార్కెట్‌ నిశితంగా గమనిస్తుంది. ఇన్ఫోసిస్‌తోపాటు హెచ్‌సీఎల్ టెక్, కోఫోర్జ్ FY23 మార్గదర్శకాల మీద ఆయా మేనేజ్‌మెంట్‌లు చేసే సవరణల మీద కూడా ఫోకస్‌ ఉంటుంది. 


బైబ్యాక్‌ అంటే..
మార్కెట్‌ ఫ్లోటింగ్‌లో ఉన్న షేర్లను సొంత కంపెనీయే కొనుగోలు చేయడాన్ని షేర్ల బైబ్యాక్ అంటారు. బైబ్యాక్‌ ప్రాథమిక లక్ష్యం మార్కెట్‌లో షేర్ల సరఫరాను తగ్గించడం, డిమాండ్‌ పెంచడం. దీనివల్ల PE మల్టిపుల్‌ పెరిగి షేర్‌ ధర పెరుగుతుంది. వాటాదారులకు భారీ డివిడెండ్ చెల్లించడం కంటే బైబ్యాక్ ద్వారా షేరు ధర పెరిగేలా చేయడం మంచి మార్గం అని ఎక్స్‌పర్ట్‌లు చెబుతారు. ఎందుకంటే రెండో పద్ధతికి పన్ను తక్కువగా ఉంటుంది. వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబం (HUF) లేదా భాగస్వామ్య సంస్థలు, ప్రైవేట్ ట్రస్ట్‌లు రూ.10 లక్షలకు పైబడి డివిడెండ్ తీసుకుంటే, దాని మీద 10 శాతం పన్ను చెల్లించాలి.


2022 క్యాలెండర్ ఇయర్‌లో ఇప్పటివరకు (YTD) నిఫ్టీ50 1.5 శాతం పతనమైతే, ఇన్ఫోసిస్ షేరు ధర 25 శాతం నష్టపోయింది. ఇదే కాలంలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 30 శాతానికి పైగా పడిపోయింది. 


ఆదాయ అంచనాలు
స్థిర కరెన్సీ ప్రాతిపదికన (CC)... Q2FY23లో ఆదాయ వృద్ధి 4 శాతంతో (QoQ) బలంగా ఉంటుందని జెఫరీస్ అంచనా వేసింది. ఎబిట్‌ (Ebit) మార్జిన్‌ కూడా 30 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉందని చెబుతోంది. 


గతేడాదితో పోలిస్తే (YoY), ఈసారి 14-16 శాతం ఆదాయ వృద్ధి, 21-23 శాతం మార్జిన్ గైడెన్స్‌ను నిలుపుకుంటుందని బ్రోకరేజ్‌ ఆశిస్తోంది. ఆదాయం 14.2 శాతం పెరిగి $3,998 మిలియన్లకు చేరుతుందని, నికర లాభం 7.2 శాతం పెరిగి $54,210 మిలియన్లు మిగులుతుందని లెక్కగట్టింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.