Stocks to watch today, 30 September 2022: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 38 పాయింట్లు లేదా 0.23 శాతం రెడ్‌ కలర్‌లో 16,774 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


హీరో మోటోకార్ప్: ఎలక్ట్రిక్ బైకులను అభివృద్ధి చేసేందుకు అమెరికాలోని జీరో మోటార్‌ సైకిల్స్‌లో ‍‌(Zero Motorcycles) 60 మిలియన్ డాలర్లు (రూ.490 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు హీరో మోటోకార్ప్‌ తెలిపింది. కాలిఫోర్నియాకు చెందిన జీరో మోటార్‌ సైకిల్స్‌, ప్రీమియం విద్యుత్ మోటార్‌ సైకిళ్లు, పవర్‌ట్రెయిన్‌లను తయారు చేస్తుంది.


అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్ ‍‌(APSEZ): విమాన ఇంధనాల సేకరణ, రవాణా, సరఫరా, విక్రయ వ్యాపారం కోసం పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అదానీ ఏవియేషన్ ఫ్యూయెల్స్‌ను (AAFL) ఏర్పాటు చేసినట్లు అదానీ గ్రూప్ తెలిపింది. సరైన సమయంలో AAFL కార్యకలాపాలు ప్రారంభమవుతాయని వెల్లడించింది.


అదానీ ఎంటర్‌ప్రైజెస్: ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్య పద్దతిలో ఉత్తరప్రదేశ్‌లో నిర్మించిన ఆరు వరుసల గ్రీన్‌ ఫీల్డ్ గంగ ఎక్స్‌ప్రెస్‌ వే ప్రాజెక్టుకు తన మూడు అనుబంధ సంస్థలు ఫైనాన్షియల్‌ క్లోజర్‌ను దక్కించుకున్నాయని అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ తెలిపింది. రుణదాతల నుంచి రూ.10,238 కోట్ల ఫైనాన్స్‌ను పొందినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది.


అదానీ గ్రీన్ ఎనర్జీ: రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో 600 మెగావాట్ల సామర్థ్యంతో, ప్రపంచంలోనే అతి పెద్ద పవన-సౌర విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభించినట్లు అదానీ గ్రూప్‌నకు చెందిన ఈ పునరుత్పాదక ఇంధన సంస్థ తెలిపింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో (SECI) 25 ఏళ్లపాటు విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని ఈ ప్లాంట్ చేసుకుంది.


అదానీ పవర్: డిలిజెంట్ పవర్ (Diliigent Power), డీబీ పవర్‌లో ‍‌(DB Power)లో 100 శాతం ఈక్విటీని అదానీ పవర్ కొనుగోలు చేయడాన్ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆమోదించింది. 


ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL): ఫండ్ పూలింగ్, ట్రెజరీ కార్యకలాపాల వంటి ఫైనాన్స్ యాక్టివిటీలను నిర్వహించడానికి తన పూర్తి యాజమాన్యంలో ఒక అనుబంధ సంస్థను ప్రారంభించింది. గాంధీనగర్‌లోని గిఫ్ట్ సిటీలో ఉన్న అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రంలో (IFSC) కార్యాలయాన్ని తెరవడానికి బోర్డు ఆమోదం తెలిపింది.


లుపిన్: Mirabegron టాబ్లెట్‌లను అమెరికన్‌ మార్కెట్‌లో విడుదల చేయడానికి యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) నుంచి ఈ ఫార్మా కంపెనీ ఆమోదం పొందింది. ఆస్టెల్లాస్ ఫార్మా గ్లోబల్ డెవలప్‌మెంట్‌కు చెందిన  Myrbetriq మాత్రలకు జెనెరిక్‌ వెర్షన్‌గా Mirabegron మాత్రలను తయారు చేశారు.


వరోక్ ఇంజినీరింగ్: గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా కె.మహేంద్ర కుమార్‌ను నియమించినట్లు ఈ ఆటో కాంపోనెంట్ కంపెనీల గ్రూప్ వెల్లడించింది. ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి వరోక్ గ్రూప్‌లోకి ఆయన వచ్చారు. అక్కడ ఐదేళ్ల పాటు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా ఉన్నారు.


పంజాబ్ నేషనల్ బ్యాంక్: అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీలో (ARCIL) తనకున్న మొత్తం వాటాను విక్రయించాలని ఈ ప్రభుత్వ రంగ రుణదాత నిర్ణయించింది. ప్రస్తుతం ARCILలో దాని వాటా 10.01 శాతం.


దీపక్ నైట్రేట్: ఈ స్పెషాలిటీ కెమికల్స్ మేకర్‌లో మరింత వాటాను కొనుగోలు చేసినట్లు LIC ప్రకటించింది. తద్వారా ఈ కంపెనీలో మొత్తం వాటా 5 శాతానికి పైకి చేరింది. దీపక్ నైట్రేట్‌లో LICకి ఉన్న ఈక్విటీ షేర్ల సంఖ్య 67,88,327 నుంచి 68,58,414 షేర్లకు పెరిగింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.