Aarti Industries Share: స్పెషాలిటీ కెమికల్స్‌ స్పేస్‌లో వ్యాపారం చేస్తున్న ఆర్తి ఇండస్ట్రీస్ (Aarti Industries), షేర్‌హోల్డర్లను ఏడాది నుంచి ఏడిపిస్తూనే ఉంది. గత ఏడాది అక్టోబర్‌లో గరిష్ట స్థాయికి చేరిన ఈ కౌంటర్‌, అక్కడి నుంచి ఒత్తిడిలో ఉంది. ఈ అమ్మకాల ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని సాంకేతిక సూచనలు చెబుతున్నాయి.


2021 అక్టోబర్ 19న, రూ.1,168 వద్ద, ఆర్తి ఇండస్ట్రీస్‌ షేర్‌ గరిష్ట స్థాయిని చేరుకుంది. అక్కడి నుంచి ఇప్పటివరకు చూస్తే, ఈ స్టాక్ 30 శాతం పైగా పడిపోయింది. గత వారం రోజుల్లోనే ఇది 10 శాతానికి పైగా స్టాక్‌ పడిపోయింది. ఇటీవలి ప్రైస్‌ యాక్షన్‌ను గమనిస్తే, ఈ స్క్రిప్‌ ఎలుగుబంట్ల నియంత్రణలో ఉన్నట్లు టెక్నికల్‌ అనాలిసిస్‌ సూచిస్తోంది. 


ఈ స్టాక్‌ రూ.28,000 కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో ట్రేడవుతోంది. 


అక్టోబర్‌ నుంచి స్లైడింగ్‌
గతేడాది అక్టోబర్‌లో మొదలైన ఫాల్‌తో, ఈ ఏడాది మార్చిలో రూ.800 స్థాయికి దిగివచ్చింది. ఆ స్థాయిలో కొన్నాళ్లు మద్దతు దొరకబుచ్చుకుంది. కానీ, దానిని నిలబెట్టుకోవడంలో విఫలం కావడం వల్ల, జూన్‌లో ఆ మద్దతు నుంచి కిందకు జారిపోయింది.


జూన్ 20న రూ.669ని (ఇది 52 వారాల కనిష్ట స్థాయి) తాకిన తర్వాత తిరిగి పుంజుకుంది, అయినా, ఈ నెలలో రూ.900 స్థాయిని దాటినా, భారీగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది.


బేరిష్ సిగ్నల్‌
డైలీ ఛార్ట్‌లో... కీలకమైన స్వల్ప & దీర్ఘకాలిక సగటులు 200, 50-DMA (డేస్‌ మూవింగ్‌ యావరేజ్‌) కంటే కింద ప్రస్తుతం ఈ స్క్రిప్‌ ట్రేడవుతోంది. 5, 10, 30-DMA కన్నా కిందే ఉంది. ఇది బేరిష్ సిగ్నల్‌. సూపర్ ట్రెండ్ ఇండికేటర్లు కూడా సెల్‌ సిగ్నల్స్‌ ఇచ్చాయి. అయితే, 100-DMA కంటే పైన ఉంది. 


రిలేటివ్‌ స్ట్రెంత్‌ ఇండెక్స్ (RSI) 38.8 వద్ద ఉంది. 30 కంటే తక్కువగా ఉంటే ఓవర్‌సోల్డ్‌గా - 70 కంటే ఎక్కువ ఉంటే ఓవర్‌బాట్‌గా పరిగణిస్తారు. MACD విషయానికి వస్తే.. ఇది దాని సెంటర్‌ లైన్‌కు పైన ఉన్నా, సిగ్నల్ లైన్‌కు మాత్రం కింద ఉంది.


జులై, ఆగస్టు నెలల్లో పుల్‌బ్యాక్‌ను ఆర్తి ఇండస్ట్రీస్‌ చూసినా, బ్రాడర్‌ మార్కెట్లలో వచ్చిన కదలిక వల్లే అది జరిగింది తప్ప, చెప్పుకోదగ్గ భారీ వాల్యూమ్స్‌ ఏవీ లేవు.


రూ.772-768 టార్గెట్‌
ప్రస్తుత కరెక్షన్‌లో 50 శాతం రీట్రేస్‌మెంట్ జరిగి దాదాపు రూ.915 వరకు వెళ్లాక ఈ షేరుకు రెసిస్టెన్స్‌ ఎదురైందని, డౌన్‌ట్రెండ్‌ను తిరిగి ప్రారంభించినట్లు కనిపిస్తోందని 5paisa.com లీడ్ రీసెర్చ్ రుచిత్ జైన్ వెల్లడించారు.


ఈ స్టాక్‌ను షార్ట్‌ టర్మ్‌ కోసం ట్రేడ్‌ చేయాలనుకుంటే రూ.772-768 టార్గెట్‌తో, రూ.820-830 రేంజ్‌లో "సెల్‌" చేయవచ్చని జైన్‌ చెబుతున్నారు. షార్ట్ పొజిషన్ల స్టాప్ లాస్‌ను రూ.850 పైన ఉంచాలని సూచించారు. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.