Stocks to watch today, 28 September 2022: ఇవాళ (బుధవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 107 పాయింట్లు లేదా 0.63 శాతం రెడ్ కలర్‌లో 16,948 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
యాక్సిస్ బ్యాంక్: ఫెయిర్‌ఫాక్స్ పెట్టుబడులున్న గో డిజిట్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో (Go Digit Life Insurance) దాదాపు 10 శాతం వాటాను కొనుగోలు చేయడానికి యాక్సిస్ బ్యాంక్ రూ.50-70 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి (Max Life Insurance Company) ఈ బ్యాంక్ ఇప్పటికే ప్రమోటర్‌గా ఉంది.
మదర్సన్ సుమీ వైరింగ్ ఇండియా: ఈక్విటీ షేర్ హోల్డర్‌లకు బోనస్ షేర్ల జారీ ప్రతిపాదనను పరిశీలించేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఈ నెల 30న సమావేశమవుతుంది.
టోరెంట్ ఫార్మాస్యూటికల్స్: డెర్మటాలజీ విభాగంలో తన ఉనికిని బలోపేతం చేసేందుకు, క్యూరేషియో హెల్త్‌కేర్‌ను (Curatio Healthcare) రూ.2,000 కోట్లకు కొనుగోలు చేయనున్నట్టు ఈ ఔషధ తయారీ సంస్థ తెలిపింది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్‌లో (ONDC) 5.5 శాతానికి పైగా వాటాను 10 కోట్ల రూపాయలకు ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్ కొనుగోలు చేసింది. ఈ నెల 27న, ప్రైవేట్ ప్లేస్‌మెంట్ రూట్‌లో ఈ పెట్టుబడి పెట్టింది.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL): ఈ ప్రభుత్వ రంగ రిఫైనర్‌లో, ఇన్సూరెన్స్ బెహెమోత్ LIC గత ఏడాది డిసెంబరు నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.1,598 కోట్ల విలువైన 2 శాతం వాటాను కొనుగోలు చేసింది. దీంతో, BPCLలో LIC వాటా 15.25 కోట్ల నుంచి 19.61 కోట్ల ఈక్విటీ షేర్లకు పెరిగింది. స్టేక్ 7.03 శాతం నుంచి 9.04 శాతానికి పెరిగింది.
పవర్ గ్రిడ్ కార్పొరేషన్: డైరెక్టర్ (ఫైనాన్స్) రవిశంకర్‌ను చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా (CFO) నియమించినట్లు, సోమవారం నుంచి ఈ నియామకం అమల్లోకి వచ్చినట్లు ఈ ట్రాన్స్‌మిషన్ మేజర్ తెలిపింది.
NHPC: నిర్మాణంలో ఉన్న సుబంసిరి లోయర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్‌లోని పవర్ హౌస్ పాక్షికంగా వరదల ప్రభావానికి గురైందని NHPC తెలిపింది. నీళ్లు తోడేయడం, క్లీనింగ్ పనులకు కొంత సమయం పట్టడం మినహా ప్రాజెక్ట్ మొదలు పెట్టే సమయం మీద పెద్దగా ప్రభావం ఉండదని వెల్లడించింది.
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (BHEL): 2x660 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడానికి NTPC నుంచి ఆర్డర్ పొందింది. ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ (EPC) ప్రాతిపదికన ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు.
FSN ఈ-కామర్స్ వెంచర్స్ (Nykaa): ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అహ్మదాబాద్ (IIMA), “నైకా ఛైర్ ఇన్ కన్స్యూమర్ టెక్నాలజీ”ని ఏర్పాటు చేయడానికి నైకాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ చైర్‌ను ప్రస్తుతం మూడు సంవత్సరాల కాలం కోసం ఏర్పాటు చేశారు. IIMA ఎండోమెంట్ ఫండ్ ద్వారా దీనిని ఏర్పాటు చేశారు.
HG ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్: ఈ కంపెనీ అనుబంధ సంస్థ అయిన "HG ఖమ్మం దేవరపల్లె Pkg-1", తెలంగాణలోని గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్ట్ కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నుంచి ఫైనాన్షియల్ క్లోజర్‌ను అందుకుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.