Amara Raja Batteries: దేశవిదేశాల్లో బ్యాటరీల వ్యాపారం చేస్తున్న అమరరాజా గ్రూప్‌లోని అమర రాజా బ్యాటరీస్ (Amara Raja Batteries Limited -ARBL), తన వ్యాపార వృద్ధి కోసం ఒక బలమైన ముందడుగు వేసింది. అమరరాజా గ్రూప్‌నకే చెందిన మంగళ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో (Mangal Industries Ltd - MIL) ఉన్న ప్లాస్టిక్ విడిభాగాల వ్యాపారాన్ని విడదీసి, ARBLలో విలీనం చేసేందుకు ప్రతిపాదించింది. బ్యాటరీలను తయారు చేయడానికి అవసరమైన ఈ విడిభాగాల వల్ల అమర రాజా బ్యాటరీస్ బలం పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది.
రూ.6 కోట్ల వరకు అదనపు లాభం
బ్యాటరీల కోసం MIL తయారు చేస్తున్న ప్లాస్టిక్ విడిభాగాలను ప్రత్యేకంగా ARBLకి మాత్రమే అందిస్తోంది. ఈ విడిభాగాల్లో - బ్యాటరీల కోసం ఉపయోగించే ప్లాస్టిక్ కంటైనర్లు, కవర్లు, చిన్న భాగాలు, హ్యాండిల్స్, జార్స్ ఉన్నాయి. ప్రస్తుతం మూడు తయారీ కేంద్రాల్లోని 150 ఇంజెక్షన్ మోల్డింగ్ మెషీన్ల ద్వారా 37,000 MTPA పైగా సామర్థ్యంతో పని చేస్తోంది. ఇది మొత్తం అమర రాజా బ్యాటరీస్‌లో విలీనం కావడం వల్ల ఏటా రూ.6 కోట్ల వరకు అదనపు లాభాన్ని ఆర్జించే అవకాశం ఉందని కంపెనీ లెక్కగట్టింది.
ఎనర్జీ & మొబిలిటీ స్పేస్‌లో ARBLని నాయకత్వ స్థానానికి చేర్చే ప్లాన్‌లో భాగమే ప్రస్తుత ప్రతిపాదన అని కంపెనీ అభివర్ణించింది. దీనివల్ల వ్యాల్యూ అన్‌లాక్ అవుతుందని భావిస్తోంది. వాటాదారుల లబ్ధి కూడా పెరుగుతుందని ARBL చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జయదేవ్ గల్లా ప్రకటించారు.
ప్లాస్టిక్ విడిభాగాల వ్యాపారాన్ని విలీనం చేయడం వల్ల సరఫరా గొలుసుపై ARBL నియంత్రణ బలోపేతం అవుతుందని, బ్యాటరీ రీసైక్లింగ్ కార్యక్రమాలు పెరుగుతాయని ఈ కంపెనీ వెల్లడించింది. మానవశక్తిని మెరుగ్గా వినియోగించుకోవడం, లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడం ద్వారా మార్జిన్లు కూడా మెరుగవుతాయని తెలిపింది.
అమరరాజా బ్యాటరీస్‌లో 65 షేర్లు
ఈ స్కీమ్ ప్రారంభమైతే, రికార్డు తేదీ నాటికి, వాటాదారులకు MILలో ఉన్న ప్రతి 74 షేర్లకు అమర రాజా బ్యాటరీస్‌కు చెందిన 65 ఈక్విటీ షేర్లను కేటాయిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ముగిశాక, అమర రాజా బ్యాటరీస్‌లో ప్రమోటర్ల వాటా ప్రస్తుతమున్న 28.06 శాతం నుంచి 4.8 శాతం పెరిగి, 32.86 శాతానికి చేరుతుంది.
ఈ ప్రతిపాదన విజయవంతంగా పూర్తి కావాలంటే NCLT, స్టాక్ ఎక్స్ఛేంజీలు, సెబీ, ప్రతి కంపెనీలోని సంబంధిత వాటాదారుల ఆమోదాలు అవసరం.
సోమవారం, అమర రాజా బ్యాటరీస్ షేరు ధర రూ.18.65 లేదా 3.71 శాతం తగ్గి, రూ.484.65 దగ్గర సెటిలైంది. ఈ స్టాక్ గత నెల రోజుల్లో 4 శాతం విలువను కోల్పోగా, గత ఆరు నెలల్లో 10 పైగా పడిపోయింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు (YTD) చూస్తే, రూ.153.40 లేదా 24 శాతం నష్టపోయింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.