Electronics Mart IPO: కన్స్యూమర్ డ్యూరబుల్స్‌ను అమ్మే రిటైల్ చైన్ 'ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా లిమిటెడ్' (Electronics Mart India Ltd - EMIL) ఇనీషియల్‌ పబ్లిక్ ఆఫర్‌తో (IPO) వస్తోంది. 


‘బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌’ పేరిట ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, NCRలో (నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌) ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఇండియా బిజినెస్‌ నడుస్తోంది. మొత్తం 36 నగరాలు, పట్టణాల్లో 112 స్టోర్లను ఈ రిటైల్‌ చైన్‌ నిర్వహిస్తోంది. 1.12 మిలియన్ చదరపు అడుగుల వైశాల్యంలో వ్యాపారం సాగుతోంది.


ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా IPO సబ్‌స్క్రిప్షన్ అక్టోబర్ 4న ప్రారంభమవుతుంది, మరియు అక్టోబర్ 7న ముగుస్తుంది.


IPOకు ఒకరోజు ముందు, అంటే అక్టోబర్‌ 3న యాంకర్ ఇన్వెస్టర్లు బిడ్లు వేస్తారు. ప్రైస్‌ బ్యాండ్‌లో అప్పర్‌ లిమిట్‌ రేటు దగ్గర వీళ్లకు షేర్ల కేటాయింపు ఉంటుంది. 


అక్టోబరు 14న షేర్లు
రిటైల్‌ ఇన్వెస్టర్లు సహా మిగిలిన వర్గాలకు షేర్ల కేటాయింపు అక్టోబరు 12న ఖరారు అవుతుంది. షేర్లను దక్కించుకున్నవాళ్ల డీమ్యాట్‌ ఖాతాల్లోకి అక్టోబరు 14న షేర్లను జమ చేస్తారు. 


ఎలక్ట్రానిక్స్ మార్ట్ షేర్లు అక్టోబర్ 17న స్టాక్ మార్కెట్‌లో లిస్టవుతాయి. ఆ రోజు నుంచి కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతాయి.


ఫ్రెష్‌ ఇష్యూ ద్వారా సుమారు రూ.500 కోట్లను సమీకరించడానికి 2021లో సెప్టెంబరులో ఈ కంపెనీ సెబీకి ముసాయిదా పత్రాలను (DHRP) దాఖలు చేసింది.


ఈ 500 కోట్ల రూపాయల్లో... రూ.111.44 కోట్ల IPO ఆదాయాన్ని మూలధన అవసరాల కోసం, మరో రూ.220 కోట్లను వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం వినియోగించాలని కంపెనీ యోచిస్తోంది. రూ.55 కోట్లతో అప్పులు తీర్చాలని అనుకుంటోంది.


ఈ ఏడాది ఆగస్టు నాటికి కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ ఫెలిలిటీస్‌ రూ.919.58 కోట్లు కాగా, జూన్ నాటికి నికర రుణం రూ.446.54 కోట్లుగా ఉంది.


ఆనంద్ రాఠీ అడ్వైజర్స్, IIFL సెక్యూరిటీస్, JM ఫైనాన్షియల్ ఈ ఇష్యూకి లీడ్ మేనేజర్లుగా వర్క్ చేస్తున్నాయి.


Electronics Mart India Ltd ని పవన్ కుమార్ బజాజ్ & కరణ్ బజాజ్ కలిసి 'బజాజ్ ఎలక్ట్రానిక్స్' పేరుతో స్థాపించారు. కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌, ఎలక్ట్రానిక్స్ ఈ స్టోర్లలో అమ్ముతారు.


లాభం రెట్టింపు
FY22లో, కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం (ఆపరేటింగ్‌ రెవెన్యూ) రూ.4349.32 కోట్లు. FY21లో ఇది రూ.3201.88 కోట్లు. FY21లో నికర లాభం రూ.40.65 కోట్లు కాగా, FY22లో రూ.103.89 కోట్లకు చేరింది. అంటే, లాభం రెట్టింపు పైగా పెరిగింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.