Rajanna Sircilla District Collector : కరీంనగర్ జిల్లా అధికారులు సైబర్ మోసాల బారిన పడుతున్నారు. ఈ మధ్యే ఏసీబీ డిఎస్పీనంటూ ఎమ్మార్వోలని టార్గెట్ చేసి ఓ ఆగంతకుడు చుక్కలు చూపించిన సంఘటన మరవకముందే మరో కలెక్టర్ పేరుతో నకిలీ ఖాతా తెరిచి డబ్బులు అడిగాడు మరో సైబర్ నేరస్తుడు.


కరీంనగర్ / రాజన్న సిరిసిల్ల: గతంలో సామాన్యుల పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతాలు తెరిచి మరీ వారి సంబంధీకులు, కింది స్థాయి ఉద్యోగులను డబ్బులు డిమాండ్ చేసిన సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ప్రముఖ అధికారులను సైతం వదలడం లేదు. ఈ మధ్య ఒక కీలక ఐఏఎస్ అధికారి పేరుతో నకిలీ ఖాతా తెరిచి వారికి సంబంధించిన మిత్రులు, ఇతర బంధువులను డబ్బులు డిమాండ్ చేసిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. మామూలు జనాలు అడిగితే డబ్బులు ఇస్తారో లేదో అనే అనుమానంతో ఏకంగా కలెక్టర్ స్థాయి వ్యక్తులను టార్గెట్ చేసుకున్నారు కేటుగాళ్లు. ఇలాంటి సంఘటనే మరొకటి ఇప్పుడు రాజన్న సిరిసిల్లలో సైతం జరిగింది


సైబర్‌ నేరగాళ్లు బరితెగిస్తున్నారు. రోజుకో పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని పలువురు జిల్లా కలెక్టర్ లను సైతం టార్గెట్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ పేరిట నకిలీ ఖాతాను తెరిచారు. కలెక్టర్‌ ఫొటోతో నకిలీ వాట్సాప్‌ ఖాతాను సృష్టించిన సైబర్‌ కేటుగాళ్లు పలువురు అధికారులను డబ్బులు డిమాండ్‌ చేశారు.
ఓ జిల్లా అధికారికి  వాట్సాప్‌ నం.7466905844 ద్వారా డబ్బులు కావాలని మెసేజ్‌ చేశారు. తక్షణమే అప్రమత్తమైన ఆ అధికారి జిల్లా కలెక్టర్‌ అనురాగ్ జయంతితో మాట్లాడారు. తన వాట్సాప్‌‌నకు వచ్చిన మెసేజ్‌లకు సంబంధించి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన కలెక్టర్‌ అనురాగ్ జయంతి.. ఇది సైబర్‌ నేరగాళ్ల పనేనని గుర్తించి ఎవరూ స్పందించవద్దని జిల్లా అధికారులందరికీ సమాచారమందించారు. 


Rajanna Sircilla Collector Anuraag Jayanti, I.A.S


డబ్బులు అడిగితే స్పందించవద్దు : జిల్లా కలెక్టర్
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. తన ఫొటోతో కూడిన నకిలీ వాట్సాప్‌ ఖాతాతో ఎవరైనా జిల్లా అధికారులను గానీ, ప్రజా ప్రతినిధులు గానీ, ప్రజలను గానీ డబ్బులడిగితే స్పందించవద్దని, సమాచారమివ్వాలని జిల్లా కలెక్టర్ ట్విట్టర్ ద్వారా సూచించారు.


గతంలోనూ... ఇతర జిల్లా అధికారుల పేరుతో టోకరా
రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు పోలీసు ఉన్నతాధికారుల ఫేస్‍బుక్‍ అకౌంట్స్ ను హ్యాక్ చేసి గతంలోనూ డబ్బులు డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ పేరుతో నకిలీ ఫేస్‍బుక్‍ ఖాతాను క్రియేట్ చేసి డబ్బులు చేయడంతో అప్పట్లో విషయం బయటకు వచ్చింది. ఇక నిజామాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ నారాయ‌ణ‌రెడ్డి పేరుతో సైబ‌ర్ నేర‌గాళ్లు ఫేస్‌బుక్‌లో న‌కిలీ ఖాతా సృష్టించారు. ఈ ఖాతాను ఉప‌యోగించుకుని ప‌లువురి నుంచి డ‌బ్బు వ‌సూలు చేసేందుకు సైబ‌ర్ నేర‌గాళ్లు య‌త్నించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సైబర్ నేరగాళ్ల మోసానికి పాల్పడ్డారు. ఇక జిల్లా కలెక్టర్ పేరుతో కింది స్థాయి అధికారుల నుంచి గతంలోనూ డబ్బులు లాగేశారు. 


జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా ఫొటో డీపీతో కేటుగాళ్లు ఫేక్ వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేశారు. మొదట ఉద్యాన శాఖ అధికారి అక్బర్ నుంచి రూ.50 వేలతో అమెజాన్ లో ఈ- పే కార్డులను కొనుగోలు చేశారు. రూ.50 వేలు మాయం అయిన తరువాత అధికారి తేరుకున్నాడు. తమ బాసు నుంచి వచ్చిన మెసేజ్ కాదా అనే భావనతో.. మిగతా అధికారులు సైతం తలా కొంత నగదు సైబర్ చోరుడికి సమర్పించుకున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా అత్యున్నత అధికారులనే సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తుంటే.. ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేయకపోతే సామాన్యుల డబ్బులకు ఇక ఎవరు రక్షణ అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


Also Read: Weather Updates: చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు - ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు


Also Read: Minister Harish Rao : పెట్రోల్, డీజిల్ సుంకాల తగ్గింపుపై స్పందించిన మంత్రి హరీశ్ రావు, ఏమన్నారంటే?