Rains In AP: నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. గత ఏడాదితో పోల్చితే వారం నుంచి పది రోజుల ముందే ఏపీ, తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయి. దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు వెళ్లినట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి 5 డిగ్రీల ఉత్తర అక్షాంశం / 67 డిగ్రీల తూర్పు రేఖాంశం, 6 డిగ్రీల ఉత్తర అక్షాంశం లేదా 72 డిగ్రీల తూర్పు రేఖాంశం, 18 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 94.5 డిగ్రీల తూర్పు రేఖాంశం గుండా కొనసాగుతోంది. వీటి ఫలితంగా ఏపీ, యానాంలో, ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల నేటి నుంచి మరో రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు కురయనున్నాయని వెల్లడించారు.


ఏపీలో చల్లచల్లగా.. 
దక్షిణ అంతర్గత కర్ణాటక పరిసరాల మీద ఉన్న ఉపరితల ఆవర్తనం రాయలసీమ దాని పరిసర సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉంది. ఇంత ఎత్తులో నైరుతి దిశకు వంగి ఉన్న ఆవర్తనం ప్రస్తుతం బలహీనపడింది. ఏపీలో ప్రస్తుతం పడమర, వాయువ్య గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేడు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎల్లుండి సైతం వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. తీరం వెంట 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లడం అంత క్షేమం కాదని సూచించారు.






దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు..
అసని తుపాను తరువాత మరోసారి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తున్నాయి. నేటి నుంచి రెండు రోజులపాటు ఈ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురవనున్నాయి. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలోనూ కొన్ని జిల్లాలకు వర్ష సూచన ఉంది. రాష్ట్రంలో 2 నుంచి 3 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలలో మార్పు ఉంటుందని అధికారులు తెలిపారు. 


తెలంగాణలో తేలికపాటి జల్లులు..
తెలంగాణ రాష్ట్రంలో నేడు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. హైదరాబాద్, పరిసర ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ, వాయువ్య దిశ నుంచి గంటకు 8 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.