ఎన్నో చట్టాలను తీసుకొస్తున్నా.. కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నా, మహిళలపై దారుణాలు తగ్గడంలేదు. అత్యాచారం చేసి చివరికి వారి ప్రాణాలను తీసేందుకు కూడా మృగాలు వెనుకాడడంలేదు. కడప జిల్లాలో ఓ మృగాడు కన్న కూతురుపైనే దారుణానికి ఒడిగట్టాడు. కడప జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాల తల్లి ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని ప్రకాశం జిల్లా మార్కాపురం డీఎస్పీ కిషోర్ కుమార్ తెలిపారు. గత నెల 25న ప్రకాశం జిల్లా మార్కాపురం పోలీసులకు అందిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మార్కాపురం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కడప జిల్లా కలసపాడు గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆ గ్రామంలోని ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. వీరు వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు.
పోక్సో చట్టం కింద కేసు నమోదు
గత నెలలో ఆ మహిళతో కలిసి మార్కాపురం వెళ్లిన కార్యదర్శి భార్యకు తెలియకుండా తన కుమార్తెను కడపకు తీసుకెళ్లాడు. కార్యదర్శి, అతని వెంట వచ్చిన మహిళ మద్యం తాగుతూ కుమార్తెకు కూడా బలవంతంగా మద్యం పట్టించారు. అనంతరం ఆ మహిళ సాయంతో కూతురిపై అత్యాచారాన్ని పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు గత నెలలో మార్కాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం నిందితున్ని అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు మార్కాపురం డీఎస్పీ కిషోర్ కుమార్ ప్రకటించారు.
వృద్ధురాలిపై అఘాయిత్యం
80 ఏళ్ల వృద్ధురాలిపై కన్నెసాడో ఓ కామాంధుడు. ఎవరూ లేని సమయం చూసి నడవలేని ఆ వృద్ధురాలిపై అత్యాచారం చేశాడు. ఆపేందుకు ప్రయత్నించిన ఆరేళ్ల బాలికపై కూడా దారుణానికి ఒడిగట్టాడు. చిత్తూరు జిల్లా పలమనేరులో నివాసం ఉంటున్న 80 ఏళ్ల వృద్ధురాలిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఆరేళ్ల బాలికపై కూడా ఆత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన ఇప్పుడు చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది.
Also Read: వరంగల్ రేప్ కేసులో టీఆర్ఎస్ లీడర్ భర్త.. అరెస్టు చేసిన పోలీసులు
బాలికపై కూడా అఘాయిత్యం
చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటి పరిధిలోని ఆరేళ్ల బాలిక, 80 సంవత్సరాల వృద్ధురాలిపై ఈశ్వర్(17) అనే యువకుడు అత్యాచారానికి యత్నించాడు. వైఎస్ఆర్ నగర్ లో నివాసం ఉంటున్న ఓ కుటుంబం బండరాళ్లు కొట్టి జీవిస్తుంటారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె ఆర్యోగం బాగోలేకపోవడంతో రెండు రోజుల క్రితం వారు తమ చిన్న కూతురిని తమ ఇంట్లో ఉన్న వృద్ధురాలికి అప్పగించి వైద్యం కోసం చిత్తూరుకు వెళ్లారు. ఇది గమనించిన యువకుడు ఆ వృద్ధురాలి ఇంట్లో ఎవరూ లేని సమయంలో వృద్ధురాలిపై అత్యాచారం చేశాడు. అదే సమయంలో ఆమెకు భోజనం తీసుకుని ఇంటికి వచ్చిన ఆరేళ్ల బాలికను భయపెట్టాడు. ఆ విషయాన్ని ఎవరికి చెప్పద్దని బాలికను బెదిరించాడు. ఈశ్వర్ అనంతరం ఆ బాలికపై కూడా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు ఇంటికి రావడంతో నిందితుడు పరారయ్యాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించి బాలిక తల్లిదండ్రులు సమాచారం అందించారు.
Also Read: భార్యపై అనుమానం - రెండేళ్ల బిడ్డకు మరణ శాసనం ! అనంతపురం ఓ తండ్రి ఘాతుకం !
తోడబుట్టిన చెల్లిపై కూడా
బాలిక తల్లిదండ్రులు నిందుతుడు ఈశ్వర్ పై పలమనేరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి ఇంటిలో నిద్రిస్తున్న ఈశ్వర్ ను స్థానికులు పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. నిందుతుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికను చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. ఆరు నెలల క్రితం తల్లిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని, మతిస్థిమితం లేని తోడబుట్టిన చెల్లిపై దారుణానికి పాల్పడ్డాడని స్థానికులు అంటున్నారు. నిందుతుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: ఆడపిల్ల పుడితే ఇంటికి రావొద్దన్న ఫ్యామిలీ.. ఉరేసుకున్న గర్భిణీ