కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా పిల్లలు చాలా నెలల పాటూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆటలకు, స్కూళ్లకు దూరమై ఆన్ లైన్ క్లాసుల పేరుతో ఇంటి నుంచి అడుగు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఇలా చిన్న వయసులోని పిల్లలు శారీరకపరమైన ఆటలకు దూరమైతే ఆ ప్రభావం వారు యుక్తవయసుకు వచ్చాక పడుతుందని ఓ కొత్త అధ్యయనం తేల్చింది. ఎవరైతే చిన్న వయసులో రోజూ పరుగెత్తడం, గెంతడం, ఫుట్ బాల్ ఆడడం, క్రికెట్ ఇలా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండే ఆటలు ఆడుతారో వారు పెద్దయ్యాక డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యల బారిన తక్కువ పడతారు. ముఖ్యంగా అబ్బాయిల మీదే ఈ పరిశోధనే సాగింది. కెనడాకు చెందిన మాంట్రెయర్ యూనివర్సిటీలో ఈ అధ్యయనాలు జరిగాయి.
ఈ అధ్యయనం ద్వారా మరో విషయం కూడా బయటపడింది. ఏ పిల్లలైతే పాఠశాల వయసులో తక్కువ మానసిక క్షోభకు గురవుతారో, వారు యుక్త వయసులో చాలా చురుకుగా ఉండడంతో పాటూ, మానసికంగా దృఢంగా ఉంటారు. ఏ పిల్లలైతే ఇంటా బయటా మానసిక హింసకు గురవుతారో, వారు పెద్దయ్యాక డిప్రెషన్ బారిన పడే అవకాశాలు ఎక్కువ. అంతేకాదు శారీరకంగా కూడా నీరసంగా ఉంటారని ఈ పరిశోధనా సారాంశం. అందుకే పిల్లల్ని ఎల్లప్పుడు చురుకుగా ఉంచేలా శారీరకపరమైన ఆటలు ఆడించాలి. రోజులో కనీసం గంట పాటూ ఆడినా చాలు, వారికి భవిష్యత్తులో మేలు జరుగుతుంది.
నిజానికి గత ఏడాదిన్నరగా పిల్లలపై కనిపించకుండానే తీవ్రమైన మానసిక ఒత్తిడి కలుగుతున్నట్టు గుర్తించారు పరిశోధకులు. కరోనా కారణంగా వారి జీవన విధానంలో చాలా మార్పులు సంభవించాయి. పాఠశాలకు వెళ్లకపోవడం, ఆటలు లేకపోవడం, స్నేహితులను కలవకపోవడం... ఇంట్లోనే బందీలుగా మారడం ఇవన్నీ వారి చిన్ని మెదడుపై ప్రభావాన్ని చూపించాయని అంటున్నారు అధ్యయనకర్తలు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: రొమ్ము క్యాన్సర్ వారసత్వంగా వస్తుందా? లక్షణాలేంటి? ఎలా చెక్ చేసుకోవాలి?
Also read: రాత్రి పడుకోబోయే ముందు ఈ టీ తాగితే... ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు
Also read: గర్భిణుల్లో హఠాత్తుగా వచ్చే డయాబెటిస్... జాగ్రత్త పడక తప్పదు