Nizamabad News: నిజామాబాద్ జిల్లా భీంగల్ లోని కస్తూర్భా పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ అయింది. దీంతో 90 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రోజు రాత్రి భోజనం చేసిన తర్వాత నుంచి విద్యార్థినులకు కడుపు నొప్పి, వాంతులు అయ్యాయి. దీంతో పాఠశాల సిబ్బంది  విద్యార్థినులను ఆస్పత్రికి తరలించారు. ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి మరీ నిజామాబాద్ కు పంపించారు. ప్రస్తుతం వీరందరి పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్పత్రులకు పరుగులు పెట్టారు. దీంతో ఆస్పత్రి ప్రాంగణం అంతా కిటకిటలాడింది. పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టారంటూ పాఠశాల సిబ్బందిపై ఫైర్ అవుతున్నారు. మీ వల్లే మా పిల్లలకు ఈ పరిస్థితి వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదృష్టం బాగాలేకపోతే ఇంత మంది పిల్లల పరిస్థితి ఏమయ్యుండేదో అంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక నుంచి అయినా పిల్లల ఆహారం నాణ్యత విషయంలో దృష్టి పెట్టాలంటూ సూచిస్తున్నారు. 


Read Also: Food Poisoning: ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ - 26 మంది విద్యార్థులకు అస్వస్థత


మహబూబాబాద్ జిల్లా కస్తూర్భ పాఠశాలలో పుడ్ పాయిజన్ అయింది. విషాహారం తిన్న విద్యార్థుల్లో 16 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిందర్నీ మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కస్తూర్భ పాఠశాలలో గత రాత్రి భోజనం చేసినప్పటి నుంచి విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అస్వస్థతతు గురయ్యారు. అయినా నిర్వాహకులు పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆరోగ్యం బాగాలేదని చెప్పినా రియాక్ట్ కాలేదని అంటున్నారు. చివరకు పరిస్థితి చేయిదాటిపోతుందన్న టైంలో ఫుడ్‌ పాయిజన్ అయిన విద్యార్థులకు అక్కడే వైద్య చికిత్సలు అందించారని చెలుస్తోంది. విషయం బయటకు పొక్కకుండా డాక్టర్లను కస్తూర్భా పాఠశాలలోకి పిలిపించుకొని సీక్రెట్‌గా వైద్యం అందించారని తెలుస్తోంది. 


దీనిపై వివిధ మీడియాల్లో కథనాలు రావడంతో అలర్ట్‌ అయిన నిర్వాహకులు అప్పుడు ఆసుపత్రికి తరలించినట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. రెండు కార్లలో మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంతమంది విద్యార్థినీలు కడుపు నొప్పి భరించలేక అవస్థలు పడుతున్నారు. కొందరికి సాధారణ చికిత్స అందిస్తున్నారు. మరి కొంతమంది విద్యార్ధినీలకు వెంటిలేటర్ మీద శ్వాస అందిస్తున్న పరిస్థితి ఉంది. ఇంత జరిగినా ఇంతవరకు విద్యార్ధినీల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదన్న విమర్శలు ఉన్నాయి. విద్యార్థులకు ప్రమాదం లేదని అసలు ఎందుకిలా జరిగిందో తెలుసుకుంటున్నామని చెబుతున్నారు వైద్యులు. కలుషిత నీరు కారణంగా ఇలా జరిగిందా.. లేకుంటే ఆహారం వల్లే ఇది జరిగిందా అనేది పిల్లలు కోలుకున్న తర్వాతే తెలుస్తుందని అంటున్నారు. 



ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇంత  జరిగినా తల్లిదండ్రులకు ఉన్నతాధికారులు సమాచారం ఇవ్వకపోవడంపై వారంతా మండిపడుతున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ పరామర్శించారు. భయపడాల్సిన పని లేదని వైద్యులు చికిత్స అందిస్తున్నారని త్వరగా కోలుకుంటారని భరోసా ఇచ్చారు. 


Read Also: Suryapet: ఎస్సీ గురుకుల పాఠశాలలో 11 మంది విద్యార్థులకు అస్వస్థత - ఖర్జూరాలే కారణం