Suryapet news: నల్గొండ జిల్లా హుజూర్ నగర్ ఎస్సీ గురుకుల పాఠశాలలో పదకొండ మంది విద్యార్థులు ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం గుర్తించిన పాఠశాల సిబ్బంది వెంటనే వారిని ఆస్పత్రికి తీసుకెళ్లింది. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారు. 


అసలేం జరిగిందంటే..?


నల్గొండ జిల్లా హుజూర్ నగర్ ఎస్సీ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఓ బాలికను చూసేందుకు తల్లిదండ్రులు వచ్చారు. ఈ క్రమంలోనే కూతురు కోసం ఖర్జూర పండ్లు తీసుకొచ్చారు. వారు వెళ్లిపోగానే బాలిక ఎంతో ఆత్రుతగా వాటిని తెరిచి తన స్నేహితులకు పంచింది. ఆపై వారితో కలిసి ఆమె కూడా తినేసింది. అయితే తిన్న కాసేపటి నుంచే పదకొండ మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో తెగ ఇబ్బంది పడ్డారు. విషయం గుర్తించిన పాఠశాల సిబ్బంది వారిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారు. అయితే కాలపరిమితి దాటిన ఖర్జూర పండ్లు తినడంతోనే ఫుడ్ పాయిజన్ జరిగి ఉండవచ్చని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 


అయితే హుజూర్ నగర్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే సైదిరెడ్డి పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. పిల్లలతో కాసేపు ముచ్చటించారు. వైద్య సేవలు ఎలా అందుతున్నాయని వారి తల్లిదండ్రులను కనుక్కున్నారు. అలాగే పిల్లలకు ఏమైనా కొనుక్కొచ్చే ముందు వాటి కాల పరిమితి ఎప్పటి వరకు ఉందో చెక్ చేయాలని సూచించారు. 


కాగజ్ నగర్ మైనార్టీ గురుకులంలో ఫుడ్ పాయిజన్


కాగజ్‌నగర్‌ మైనారిటీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఫుడ్ పాయిజన్ కావడంతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సిబ్బందికి విషయం చెప్పిన ఎవరూ పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు ఆందోళనకు సైతం దిగారు. విద్యార్థుల ఆందోళన విషయం తెలుసుకున్న స్థానిక మీడియా ప్రతినిధులు గురుకులానికి వెళ్లగా.. సిబ్బంది వారిని లోనికి అనుమతించలేదు. తరువాత పోలీసులు రావడంతో అస్వస్థతకు గురైన విద్యార్థులను గమనించి పోలీసులు స్వయంగా వారి వాహనంలో పలువురు విద్యార్థులను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.


45 మంది విద్యార్థులకు అస్వస్థతకు 


మూడు నెలల క్రితం కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ లోని మైనారిటీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. దీంతో సుమారుగా 45 మంది విద్యార్థుల వరకు అస్వస్థతకు గురయ్యారు. గురుకుల పాఠశాల సిబ్బందికి విషయం చెప్పినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తొలుత గురుకులానికి మీడియా చేరుకోగా, వారికి విషయం తెలియకుండా ఉండాలని గురుకులం సిబ్బంది వారిని లోనికి అనుమతించలేదు. విద్యార్థుల ఆందోళన విషయం తెలుసుకున్న కాగజ్‌నగర్‌ సీఐ నాగరాజు గురుకులం వద్దకు చేరుకోని సిబ్బందితో మాట్లాడి లోనికి వెళ్లి పరిశీలించారు. 


అప్పటికే పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయారు. ఇది గమనించిన సీఐ నాగరాజు అస్వస్థతకు గురైన పలువురు విద్యార్థులను హుటాహుటిన తన వాహనంలో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.  గురుకులంలో అస్వస్థతకు గురైన మరికొంతమంది విద్యార్థులను నాలుగుసార్లు పోలీసు వాహనంలోనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. సోమవారం రాత్రి భోజనం చేసిన సమయంలో అన్నంలో పురుగులు వచ్చాయని విద్యార్థులు వాపోతున్నారు. ఇలా పలుమార్లు భోజనంలో పురుగులు వస్తున్నాయని చెప్పినా అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు.