Healthy Tastey Kudumulu: కొన్ని రకాల స్నాక్స్, ఫుడ్ ఐటెమ్స్ కేవలం టేస్ట్ కి మాత్రమే పరిమితమవుతాయి... ఆరోగ్యానికి మాత్రం చేటు చేస్తాయి. మరికొన్ని మాత్రం టేస్ట్ తోపాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. అలాంటి ఓ ప్రత్యేకమైన స్నాక్ తెలంగాణలో చాలా ఫేమస్. కేవలం వింటర్‌లో మాత్రమే చేసుకునే ఈ స్పెషల్ వంటకం పేరు కుడుములు. ఈ సీజన్లో లభించే అనుముల గింజలను..బియ్యపు పిండితో మరికొన్ని ముఖ్యమైన పదార్థాలతో కలిపి చేసుకునే ఈ వంటకం పల్లెటూర్లలో చాలా ఫేమస్... అది ఎలా తయారు చేయాలో దాని స్పెషాలిటీ ఏంటో మీరు కూడా తెలుసుకోండి.
కావలసిన పదార్థాలు...
పచ్చి అనుములు 1 కప్పు
బియ్యప్పిండి 2 కప్పులు
పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్
కొత్తిమీర తరుగు 1 కప్పు
కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ 1 కప్పు
ఉప్పు తగినంత
నూనె కొద్దిగా
నీళ్లు తగినన్ని
తయారుచేయు విధానం...
ముందుగా పచ్చి అనుములు ఉప్పు వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో బియ్యప్పిండి, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర తరుగు, స్ప్రింగ్ ఆనియన్స్, ఉప్పు, ఉడికించి పెట్టుకున్న పచ్చి అనుములు వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసాక తగినన్ని నీళ్లు పోస్తూ సాఫ్ట్ గా ఒక ముద్ద లాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం బియ్యపు పిండి తీసుకొని ఇడ్లీలాగాచేసుకోవాలి. తర్వాత ఇడ్లీ మాదిరిగానే ఆవిరిపై ఉడికించాాలి. ఒక 20 నిమిషాల పాటు ఉడికించి బయటికి తీసుకోవాలి. అంతే వేడి వేడి కుడుములు రెడీ అవుతాయి.
సూచనలు:
కుడుములను సాధారణంగా మరీ చిన్నవిగా గానీ మరీ పెద్దవిగా గానీ కాకుండా మీడియం సైజ్ లో తయారు చేసుకోవాలి. ఇక మందంగా పిండి కలిపినట్లయితే అది ఉడకడం కాస్త ఆలస్యం అవుతుంది. అంతేకాకుండా లోపలి భాగం ఎక్కువగా మెత్తగా ఉండదు. దీంతో రుచి కూడా మారుతుంది. సరైన మోతాదులోని పిండిని కూడా వాడాలి. ఇక మరీ తక్కువ పిండిని వాడినట్లయితే అవి ఉడికే సమయంలోనే మధ్యకి విరిగిపోతాయి. కాస్త ఓపికగా తగినంత పిండిని వాడుతూ తగిన సైజులో తయారు చేసుకోవాలి. కుడుములకు వచ్చే టేస్ట్ అంతా కూడా అందులో వాడే కొత్తిమీర, ఉల్లి ఆకుల వల్లే వస్తుంది. అందుకే సాధారణ వంటకాలకు విభిన్నంగా కాస్త ఎక్కువగానే ఈ రెండింటిని పిండి కలిపేటప్పుడు వాడాలి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే ఈ ఆరోగ్యకరమైన వంటకాన్ని వేడివేడిగా స్పైసి చట్నీతో సర్వ్ చేస్తే లొట్టలేస్తూ తినేస్తారు... కేవలం శీతాకాలంలో మాత్రమే లభించే పదార్థాలతో చేసే ఈ వంటకాన్ని మీరు కూడా టేస్ట్ చేయండి. మీ ఇంటికి వచ్చే అతిధులకు స్వయంగా తయారు చేసి మరీ వడ్డించండి. ఒకసారి తిన్నవాళ్లు వీటి టేస్ట్ కి ఫిదా అవడం గ్యారెంటీ. మళ్లీ తినాలనుకోవడం గ్యారెంటీ.
Also Read: వారానికోసారి నువ్వులన్నం ఇలా చేసుకుని తినండి చాలు - ఎంతో బలం
Also Read: క్రిస్పీగా గోబి పకోడి, చల్లని సాయంత్రం వేళ పర్‌ఫెక్ట్ స్నాక్స్