చలి కాలం వచ్చిందంటే సాయంత్రం వాతావరణం కూల్‌గా మారిపోతుంది. అప్పుడు పకోడీలు, బజ్జీలు తినేవారి సంఖ్య చాలా ఎక్కువ. ఎప్పుడూ ఒకేలాంటి స్నాక్స్ తింటే బోరు కొట్టేస్తుంది. అందుకే ఇలా గోబి పకోడి చేసుకుని తినండి. క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయివి.  కాలి ఫ్లవర్ తినని పిల్లల చేత ఇలా పకోడి చేసి పెడితే తింటారు. 


కావాల్సిన పదార్థాలు
శెనగ పిండి - ఒక కప్పు
కాలిఫ్లవర్ ముక్కలు- ఒక కప్పు
కారం - ఒక టీస్పూను
ఉప్పు - సరిపడినంత
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూను
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
నూనె - వేయించడానికి సరిపడా
పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూను


 తయారీ ఇలా
1. కాలిఫ్లవర్ ను చిన్న ముక్కలుగా విడదీసుకోవాలి. వేడి నీళ్లలో ఓ అయిదు నిమిషాలు ఉడికించుకోవాలి. నీళ్లు వడకట్టుకోవాలి. 
2. ఇప్పుడు ఒక గిన్నెలో శెనగపిండి, ఉప్పు, కారం, తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర తరుగు కలిపి బాగా కలపాలి. 
3. ఆ మిశ్రమంలో నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. 
4. ఇప్పుడు అందులో కాలిఫ్లవర్ ముక్కలు కూడా వేయాలి. 
5. ఇప్పడు స్టవ్ పై కళాయి పెట్టి నూనె వేయలి. 
6. నూనె వేడెక్కాక కాలిఫ్లవర్ ముక్కలు పకోడీల్లా వేయించుకోవాలి. 
7. బంగారం రంగులోకి మారాక  తీసి ప్లేటులో వేసుకోవాలి. 


తింటే బలమే కాదు...
కాలిఫ్లవర్‌నే గోబి పువ్వు అంటారు. చాలా మంది దీన్ని తినడానికి ఇష్టపడరు కానీ ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఎక్కువగా పురుగు పడుతుంది అని ఎంతో మంది దీన్ని పక్కకి పెడతారు. కానీ పురుగులే కాలిఫ్లవర్ ఎంచుకుని వండుకుంటే మంచిది. కాలిఫ్లవర్ తినే వాళ్లలో దంత సమస్యలు తక్కువగా వస్తాయి. ఎసిడిటీకి కారణమయ్యే పరిస్థితులకు కాలీఫ్లవర్ తగ్గిస్తుంది. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎంత తిన్నా బరువు పెరగరు. విటమిన్లు శరీరానికి సరిపడా అందుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచేందుకు ఇది ఉపయోగపడుతుంది. అందుకే డయాబెటిక్ రోగులు కచ్చితంగా వారానికి ఒకసారైనా దీన్ని తినాలి. దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జీర్ణక్రియ సక్రమంగా సాగుతుంది. 






Also read: అర్థరాత్రి దాటాక మెలకువ వస్తుంటే జాగ్రత్త పడాలి - ఈ వ్యాధులు ఉన్నాయేమో చెక్ చేసుకోండి