Medak Crime News: చిన్నప్పటి నుంచి పోలీసు కావాలనుకుంది. లక్ష్యానికి తగ్గట్లుగానే కష్ట పడి చదివింది. రన్నింగ్, హై జంప్ వంటివి కూడా బాగా ప్రాక్టీసు చేసి ఇటీవలే ఉద్యోగం సాధించింది. ఇంకొన్ని రోజుల్లో పోలీస్ డ్రెస్సులో తనని తాను చూసుకొని మురిసిపోవాలనుకుంది. కానీ ఆమె ఆశలన్నీ అడియాశలు అయ్యాయి. పోలీసు ఉద్యోగం వద్దంటూ భర్త, అత్త, మామలు వేధించడం మొదలు పెట్టారు. చిన్నప్పటి నుంచి లక్ష్యంగా పెట్టుకున్న పోలీసు ఉద్యోగాన్ని అత్తింటి వాళ్లు వద్దనడంతో ఆమెకు ఏం చేయాలో తెలియలేదు. తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన సదరు మహిళ ఆత్మహత్య చేసుకుంది. 


అసలేం జరిగిందంటే..?


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజక వర్గం వీణవండ మండలం మల్లారెడ్డి పల్లి గ్రామానికి చెందిన మార్త రాజయ్య దంపతులకు కుమార్తె కల్యాణి ఉంది. అయితే ఈమెకు నాలుగు నెలల క్రితం మెదక్ జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాలకు చెందిన కారు హరీశ్ తో వివాహం జరిగింది. అయితే కల్యాణికి చిన్నప్పటి నుంచి పోలీసు కావాలనే కల ఉంది. అందుకోసం రాత్రింబవళ్లు కష్టపడింది. ఎంబీఏ చదివిన ఆమె పోలీసు ఉద్యోగం కోసం పరీక్షలు రాసి ఫలితాల కోసం నిరీక్షించింది. ఇటీవలే ఫలితాలు రావడంతో కానిస్టేబుల్ ఉద్యోగానికి కల్యాణి అర్హత సాధించింది. అనుకున్న లక్ష్యం చేరుకోబోతున్నందుకు కల్యాణి చాలా సంతోషించింది. కానీ అత్తింటి వాళ్లు మాత్రం అలాగే ఉన్నారు. కోడలు పోలీసు అవ్వబోతుందంటే .. మనకెందుకు ఇవన్నీ అంటూ కామెంట్లు చేశారు. భర్త హరీష్ తో పాటు అత్త రమణ, మరిది శ్రీహరి మానసికంగా వేధించారు. 


కలత చెందిన కల్యాణి శుక్రవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్ కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం గుర్తించిన అత్తా, భర్తలు వెంటనే విషయాన్ని కల్యాణి తల్లిదండ్రులకు తెలిపారు. హుటాహుటిన మెదక్ కు చేరుకున్న కల్యాణి తండ్రి.. అత్తింటి వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కూతురు పోలీసు అయితే చూసి మురిసిపోవాలనుకున్న తల్లిదండ్రులకు.. అచేతనంగా పడి ఉన్న కూతురు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 


Read Also: Warangal News: అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు, భరించలేని యువ డాక్టర్ ఆత్మహత్య!


అత్తింటి వేధింపులు తాళలేక యువతి బలవన్మరణం


వరంగల్ జిల్లా దుర్గొండి మండలం కేశవాపూర్ కు చెందిన గంగాధర్ రెడ్డి నగరంలోని చార్టెడ్ అకౌంటెంట్ కార్యాలయంలో పని చేస్తున్నాడు. అయితే ఇతడికి వర్ధన్నపేట మండలం కడారిగూడేనికి చెందిన నిహారిక రెడ్డితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కట్నం కింద నగరంలోని 300 గజాల ప్లాట్, ఇతర కానుకలు ఇచ్చారు. అయితే ఎక్సైజ్ కాలనీలో నివాసం ఉంటున్న వీరికి నాలుగు నెలల క్రితమే పాప పుట్టింది. ఇటీవల కారు కావాలని గంగాధర్ రెడ్డి అడగ్గా.. అందుకు నిహారిక తల్లిదండ్రులు అంగీకరించారు. అయినప్పటికీ పెళ్లి అప్పుడు ఇస్తామన్నా కానుకల విషయంలో ఇప్పటికీ గొడవలు జరుగుతున్నాయి. పాప పుట్టిందన్న సంతోషాన్ని కూడా ఆస్వాదించకుండా.. పుట్టింటి వాళ్లతో గొడవలు పడడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఎన్ని రోజులు బతికినా ఇంతే అనుకుంది. ఈ క్రమంలోనే చనిపోవాలని నిశ్చయికుంది. 


ఈ క్రమంలోనే బుధవారం రాత్రి భార్యాభర్తలు వేర్వేరు గదుల్లో నిద్రించారు. పాపను పడుకోబటెట్టుకొని పడుకున్న నిహారిక అర్ధరాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే నిద్రలో ఉన్న పాపు గురువారం వేకువ జాము నుంచి ఏడవడం ప్రారంభించింది. చాలా సేపటి నుంచి పాప ఏడుపు వినిపించడంతో.. భర్త తలుపులు తీసే ప్రయత్నం చేశాడు. కానీ గడియ పెట్టి ఉండడంతో దాన్ని పగుల గొట్టి మరీ లోపలికి వెళ్లాడు. అప్పటికే నిహారిక ఫ్యాన్ కు ఉరివేసుకొని కనిపించింది. ఏం చేయాలో తెలియని అతను పాపను తీసుకొని బయటకు వచ్చాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఇన్ స్పెక్టర్ షూకుర్ మృతదేహాన్ని కిందికి దింపించాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న నిహారిక తల్లిదండ్రులు అత్త, భర్త, ఆడబిడ్డల వేధింపులు తాళలేక తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు.