Warangal News: రెండేళ్ల క్రితం పెళ్లవగా.. ఇటీవలే వారికి పాప పుట్టింది. అయితే బిడ్డ పుట్టిన ఆనందం కంటే ఆమె పుట్టింటి నుంచి తెచ్చే కట్నకానులపైనే ఆశ ఎక్కువైంది. వాటి కోసం తరచుగా ఆ మహిళను వేధించడం మొదలు పెట్టాడు. వైద్యురాలుగా పని చేసే ఆమె బాలితంగా ఉండగానే టార్చర్ చేశారు. అది తట్టుకోలేని ఆమె ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో నాలుగు నెలల వయసున్న పాప తల్లిలేని బిడ్డగా మారిపోయింది. 


అసలేం జరిగిందంటే..?


వరంగల్ జిల్లా దుర్గొండి మండలం కేశవాపూర్ కు చెందిన గంగాధర్ రెడ్డి నగరంలోని చార్టెడ్ అకౌంటెంట్ కార్యాలయంలో పని చేస్తున్నాడు. అయితే ఇతడికి వర్ధన్నపేట మండలం కడారిగూడేనికి చెందిన నిహారిక రెడ్డితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కట్నం కింద నగరంలోని 300 గజాల ప్లాట్, ఇతర కానుకలు ఇచ్చారు. అయితే ఎక్సైజ్ కాలనీలో నివాసం ఉంటున్న వీరికి నాలుగు నెలల క్రితమే పాప పుట్టింది. ఇటీవల కారు కావాలని గంగాధర్ రెడ్డి అడగ్గా.. అందుకు నిహారిక తల్లిదండ్రులు అంగీకరించారు. అయినప్పటికీ పెళ్లి అప్పుడు ఇస్తామన్నా కానుకల విషయంలో ఇప్పటికీ గొడవలు జరుగుతున్నాయి. పాప పుట్టిందన్న సంతోషాన్ని కూడా ఆస్వాదించకుండా.. పుట్టింటి వాళ్లతో గొడవలు పడడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఎన్ని రోజులు బతికినా ఇంతే అనుకుంది. ఈ క్రమంలోనే చనిపోవాలని నిశ్చయికుంది. 


ఈ క్రమంలోనే బుధవారం రాత్రి భార్యాభర్తలు వేర్వేరు గదుల్లో నిద్రించారు. పాపను పడుకోబటెట్టుకొని పడుకున్న నిహారిక అర్ధరాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే నిద్రలో ఉన్న పాపు గురువారం వేకువ జాము నుంచి ఏడవడం ప్రారంభించింది. చాలా సేపటి నుంచి పాప ఏడుపు వినిపించడంతో.. భర్త తలుపులు తీసే ప్రయత్నం చేశాడు. కానీ గడియ పెట్టి ఉండడంతో దాన్ని పగుల గొట్టి మరీ లోపలికి వెళ్లాడు. అప్పటికే నిహారిక ఫ్యాన్ కు ఉరివేసుకొని కనిపించింది. ఏం చేయాలో తెలియని అతను పాపను తీసుకొని బయటకు వచ్చాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఇన్ స్పెక్టర్ షూకుర్ మృతదేహాన్ని కిందికి దింపించాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న నిహారిక తల్లిదండ్రులు అత్త, భర్త, ఆడబిడ్డల వేధింపులు తాళలేక తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. 


వైజాగ్‌లో అాలాంటి ఘటనే


విశాఖలోని జయప్రకాశ్ నగర్‌లో ఉండే జగన్ మోహన్, గౌరీ దేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తె మానసిక వికలాంగురాలు. బాధితురాలి బంధువులు చెబుతున్న దాని ప్రకారం గత కొంతకాలంగా జగన్ మోహన్ కుటుంబ కారణాల రీత్యా గౌరీదేవితో గొడవ పడుతున్నాడు. అందులోనూ మానసిక వికలాంగురాలు అయిన పెద్దకుమార్తె వైద్యం కోసం డబ్బు ఖర్చు చెయ్యాల్సి రావడం కూడా భార్య గౌరీ దేవితో గొడవ పడడానికి కారణం అయింది. దానితో భార్యా పిల్లలను వదిలేసి తన తల్లి రాజేశ్వరితో కలిసి వేరే చోట నివాసం ఉంటున్నాడు.


ఒంటరిగా ఉంటున్న గౌరీదేవి,పెద్ద కుమార్తెను  డాక్టరు దగ్గరకు తీసుకెళ్లి తిరిగివచ్చే సరికి ఆమె ఇంటికి తాళం వేసి ఉండడం చూసి షాక్ అయ్యారు. చుట్టుపక్కల వాళ్ళను వివరాలు అడగ్గా ఆమె అత్త రాజేశ్వరి వచ్చి కోడలు, మనవరాళ్లు లేని సమయంలో ఇంటికి తాళం వేసి వెళ్లిపోయిందని చెప్పారు. విషయం తెలుసుకున్న కోడలు గౌరీదేవి అత్తకు ఫోన్ చేసినా ఫలితం లేకపోయిందని చుట్టుప్రక్కల వాళ్ళు చెబుతున్నారు.


చేసేదిలేక తన ఇద్దరు కూతుళ్ళతో గౌరీ దేవి మండుటెండలో తాళం వేసిఉన్న ఇంటిముందు అలానే కూర్చుండి పోయి ధర్నాకు దిగింది . అసలే నడివేసవి ఎండలో ఇద్దరు కూతుళ్లతో మిట్టమధ్యాహ్నం వేళ రోడ్డుపై కూర్చుండి పోయిన గౌరీ దేవిని చూసి తరుక్కుపోయిన చుట్టుపక్కల వాళ్ళు ఆమె పుట్టింటి వారికి కబురు ఇవ్వడంతో గౌరీ దేవి అన్నయ్య వచ్చి ఆమెకు ధైర్యం చెప్పారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి అలానే ఎండలో ఉండిపోయిన గౌరీ దేవి విషయం తెలుసుకున్న వైజాగ్ ఎయిర్ పోర్ట్ పరిధి పోలీసులు వచ్చి ఇంటి తాళం తీయించారు. దానితో సాయంత్రం వరకూ ఎండలోనే పిల్లలతో అవస్థ పడిన గౌరీ దేవి ఇంటి లోపలికి వెళ్లగలిగింది. వివరాలు తెలుసుకున్న పోలీసులు గౌరీదేవి అత్త,భర్త లకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టు గౌరీ దేవి అన్నయ్య తెలిపారు. ఏదేమైనా ఒకవైపు సీఎం పర్యటన విశాఖలో జరుగుతున్న సమయంలోనే ఇలా ఒక తల్లి తన ఇద్దరు కూతుళ్లతో ఇంటి నుండి గెంటివేయబడ్డ సంఘటన జరగడం నగరం లో సంచలనం సృష్టించింది.