మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాని సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుంచి ఏదొక కంటెంట్ లీక్ అవుతుండటం మేకర్స్ కు పెద్ద తలనొప్పిగా మారింది. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ ఆడియో సాంగ్ లీకైంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రొడ్యూసర్, లీకు రాయుళ్ళపై పోలీసులకు ఫిర్యాదు చేసారు.
‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి ‘జరగండి జరగండి’ అంటూ సాగే పాట ఆన్ లైన్ వేదికగా లీకైంది. ఏదో ఒకటీ రెండు లైన్స్ కాకుండా ఏకంగా ఫుల్ సాంగ్ నే లీక్ చేసారు. ఇది కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అఫిషియల్ గా రిలీజ్ చేయకముందే ఇలా పాట లీక్ అవ్వడాన్ని మేకర్స్ సీరియస్ గా తీసుకున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించి, ఈ పాటను లీక్ చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించారు.
శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ట్వీట్ చేస్తూ.. ''మా 'గేమ్ ఛేంజర్' సినిమాలోని కంటెంట్ ను లీక్ చేసిన వ్యక్తులపై IPC సెక్షన్ 66(C) కింద క్రిమినల్ కేసు నమోదు చేయబడింది. చట్టవిరుద్ధంగా లీక్ చేయబడిన నాణ్యతలేని ఆ కంటెంట్‌ను షేర్ చేయవద్దని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము'' అని పేర్కొన్నారు. దీనికి పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన కంప్లెయింట్ కాపీని జత చేసారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ‘జరగండి జరగండి’ బేసిక్ వెర్షన్ సాంగ్ ని లీక్ చేసిన వారిపై యాక్షన్ తీసుకోవాలని అందులో పేర్కొనబడింది. అంతేకాదు వాట్సాప్ తోపాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో ఈ లీకైన పాటను షేర్ చేసిన వారిపైనా చర్యలు తీసుకోవాలని మేకర్స్ కోరారు.
నిజానికి 'గేమ్ ఛేంజర్' మూవీ షూటింగ్ దశలో ఉన్నప్పుడు గతంలో రామ్ చరణ్ కు సంబంధించిన పలు వర్కింగ్ స్టిల్స్ లీక్ అయ్యాయి. దర్శకుడు శంకర్ సీక్రెట్ గా ఉంచాలనుకున్న చరణ్ రెండో పాత్ర లుక్ కూడా అనధికారికంగా బయటకు వచ్చింది. ఆ సమయంలో మరోసారి ఇలాంటి లీకులకు పాల్పడితే కేసులు పెడతామని దర్శక నిర్మాతలు హెచ్చరించారు. ఈ క్రమంలోనే ‘జరగండి జరగండి’ పాట లీక్ అవడంపై నిర్మాణ సంస్థ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, లీకు రాయుళ్ళపై క్రిమినల్ కేసు పెట్టింది.
కాగా, పవర్ ఫుల్ కథాంశంతో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ‘గేమ్ ఛేంజర్’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రామ్ చరణ్ రెండు విభిన్నమైన లుక్స్ లో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన ఒక లుక్ మెగా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. ఇందులో చెర్రీకి జోడీగా కియారా అడ్వాణీ, అంజలి నటిస్తున్నారు. ఎస్.జె. సూర్య విలన్ గా నటిస్తుండగా.. శ్రీకాంత్, సునీల్, జయరామ్, సముద్రఖని, నవీన్ చంద్ర తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి తిరు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ రాస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: సీనియర్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్న న్యూ ఏజ్ డైరెక్టర్స్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial