ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ పలు క్రేజీ కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. సీనియర్ స్టార్ హీరోలందరూ న్యూ ఏజ్ డైరెక్టర్స్ తో వర్క్ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఐదు పదులు దాటిన వయసులోనూ బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నారు.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. దీనికి 'విక్రమ్', 'జైలర్', 'జవాన్' సినిమాలను ఉదాహరణగా చెప్పొచ్చు. 


విక్రమ్:
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిలర్ 'విక్రమ్'. 1986లో కమల్ నటించిన 'ఏజెంట్ విక్రమ్ 007' సినిమాలోని పాత్రకు కొనసాగింపుగా, LCU లో భాగంగా ఈ సినిమాని రూపొందించారు. తన అభిమాన హీరోని సరికొత్తగా ప్రెజెంట్ చేసిన లోకేష్.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించారు. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి విశ్వనటుడి బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించింది. ఇందులో విజయ్ సేతుపతి, ఫహాద్ పాజిల్ కీలక పాత్రలు పోషించారు.


జైలర్:
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'జైలర్'. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, చాన్నాళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న తలైవర్ కి ఘన విజయాన్ని అందించింది. ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి తమిళ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ అతిథి పాత్రలు పోషించారు.


జవాన్:
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ 'జవాన్'. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవలే థియేటర్లలోకి వచ్చింది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. మొదటి రోజు మొదటి ఆట నుంచే వసూళ్ల వేట ప్రారంభించింది. వరల్డ్ వైడ్ గా 7 రోజుల్లోనే 650 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి, బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది. ట్రెండ్ చూస్తుంటే 1000 కోట్ల క్లబ్ లో చేరడం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటించగా... సంజయ్ దత్ గెస్ట్ రోల్ లో కనిపించారు. 


Also Read: 'డెవిల్' కోసం మెగా ఫోన్ పట్టిన ప్రొడ్యూసర్.. డైరెక్టర్ ను తప్పించారా? తప్పుకున్నాడా?


ఇలా ముగ్గురు సీనియర్ హీరోలతో నవతరం దర్శకులు తీసిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ మూడింటికీ కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. ఇవి రివేంజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్స్. సీనియర్ స్టార్స్ టైటిల్ రోల్స్‌ పోషించడమే కాదు, తమ వయసుకు తగిన పాత్రల్లో తండ్రులుగా తాతలుగా కనిపించారు. అలానే హీరో పాత్రకు సపోర్ట్ గా అతిథి పాత్రల్లో ఇతర స్టార్స్ నటించారు. 


రానున్న రోజుల్లో మరికొన్ని సీనియర్ హీరోలు - యంగ్ డైరెక్టర్స్ కాంబినేషన్స్ చూడబోతున్నాం. కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో 'నా సామి రంగా' అనే సినిమా చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా నాగ్ ఇందులో ఊర మాస్ అండ్ రగ్గుడ్ లుక్ లో కనిపించబోతున్నారు. ఇటీవల రిలీజైన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రూరల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను సంక్రాంతికి విడుదల చేయనున్నారు. 


అలానే మెగాస్టార్ చిరంజీవి 'బింబిసార' ఫేమ్ వశిష్టతో ఓ మూవీ చేస్తున్నారు. 'అంజి' తర్వాత చిరు నటిస్తున్న సోషియో ఫాంటసీ జోనర్ సినిమా ఇది. Mega157 నవంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం 'హిట్' చిత్రాల డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో 'సైంధవ్' అనే యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ లో వెంకీ గెటప్ అందరినీ ఆకట్టుకుంది. డిసెంబర్ లో క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రజనీకాంత్ - డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబోలో Thalaivar171 చిత్రానికి అనౌన్స్ మెంట్ వచ్చింది. మరి ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాలు అందుకుంటాయో చూడాలి. 


Also Read: టాలీవుడ్‌లో మళ్లీ మొదలైన వాయిదాల పర్వం!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial