సినీ పరిశ్రమలో బాగా ఫేమ్ ఉన్న హీరో, హీరోయిన్ పెళ్లి చేసుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. కానీ అలాంటి పెళ్లిల్లకు ప్రేక్షకుల్లో చాలా క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే ఆ కపుల్‌లో ఇద్దరూ మూవీ లవర్స్‌కు సుపరిచితులే అయ్యింటారు. అలాంటి వారిని కలిసి ఒక రియల్ లైఫ్ కపుల్‌గా చూడడం చాలామందికి సంతోషాన్నిస్తుంది. సమంత, నాగచైతన్య విషయంలో కూడా అదే జరిగింది. వీరిద్దరూ అప్పటికే కలిసి మూడు సినిమాల్లో నటించి, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని పండించారు. అలాంటి వారు ఆఫ్ స్క్రీన్‌లో కూడా కపుల్ అవుతున్నారని తెలిసి చాలామంది సంతోషించారు. కానీ ఆ సంతోషం ఎక్కువకాలం నిలబడలేదు. నాలుగేళ్లలోనే వాళ్లు విడిపోతున్నట్టుగా ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు. అయినా కూడా వాళ్లు మళ్లీ కలవాలని ప్రేక్షకులు చాలా కోరుకున్నారు. ఇంతలోనే సమంత సోషల్ మీడియాలో వారి పెళ్లి ఫోటోలు మళ్లీ ప్రత్యక్షమయ్యాయి.


ఫోటోలు మళ్లీ తెరపైకి..
విడాకుల విషయాన్ని చాలామంది మర్చిపోయారు. సమంత, నాగచైతన్య కూడా ఎవరి ప్రాజెక్ట్స్‌లో వారు బిజీగా ఉన్నారు. అంతే కాకుండా ఇద్దరికీ ఒకే విధంగా ఫ్లాపులు కూడా ఎదురవుతున్నాయి. అదే సమయంలో విజయ్ దేవరకొండతో సమంత కలిసి నటించిన ‘ఖుషి’ మూవీ మంచి హిట్‌ను అందుకుంది. కలెక్షన్స్ విషయంలో కూడా పరవాలేదనిపించింది. నాగచైతన్య మాత్రం ఇంకా హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో సమంత ఇన్‌స్టా పేజీలో మళ్లీ పెళ్లి ఫోటోలు, నాగచైతన్యతో హాలిడేలకు వెళ్లిన ఫోటోలు ప్రత్యక్షమవ్వడంతో అసలు దీనికి అర్థమేంటి అని ప్రేక్షకులు సందేహంలో పడ్డారు. ఎందుకంటే, విడాకుల తర్వాత సామ్ వాటిని డిలీట్ చేసింది. బయటకు కనిపించకుండా Archiveలో పెట్టింది. అవి మళ్లీ ఇన్‌స్టాలోకి రావడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. సమ్‌థింగ్ ఫిషీ అంటున్నారు. మరి ఇలా ఎందుకు జరిగిందో తెలియాలంటే సమంతనే క్లారిటీ ఇవ్వాలి.


రెండు మతాల పద్ధతుల్లో పెళ్లి..
సమంత, నాగచైతన్య 2017లో పెళ్లి చేసుకున్నారు. సమంత క్రిస్టియన్ అయినా, నాగచైతన్య హిందూ అయినా కూడా వారి మతాలు వారి ప్రేమకు అడ్డురాలేదు. ముందుగా క్రిస్టియన్ పద్ధతిలో, ఆ తర్వాత హిందూ పద్ధతిలో రెండు విధాలుగా పెళ్లి చేసుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఆ తర్వాత కూడా వారు హాలిడేలకు వెళ్లినప్పుడల్లా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసేది సామ్. కానీ విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో నాగచైతన్యతో ఉన్న ఫోటోలన్నీ ఆర్కైవ్‌లో పెట్టింది. హఠాత్తుగా విడాకులు ప్రకటించిన దాదాపు సంవత్సరంన్నర తర్వాత మళ్లీ సామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో నాగచైతన్యతో ఉన్న ఫోటోలన్నీ బయటికొచ్చాయి.


విడాకుల సమయంలో పుకార్లు..
సమంత, నాగచైతన్య ఒకేసారి తమ విడాకుల విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కానీ దానికి అసలు కారణమేంటి అని ఇద్దరూ బయటపెట్టడానికి ఇష్టపడలేదు. ఎన్ని సందర్భాల్లో, ఎన్ని విధాలుగా వారి విడాకుల గురించి వారికి ప్రశ్నలు ఎదురయినా.. వాటికి సమాధానం ఇవ్వడానికి ఇష్టపడలేదు. వీరు విడాకులకు కారణం ఏదైనా కూడా చాలామంది సమంతదే తప్పు అని తనను నిందించడం మొదలుపెట్టారు. తనకు వేరేవారితో సంబంధాలు ఉన్నాయంటూ విమర్శించారు. వీటన్నింటికీ సామ్.. తన సోషల్ మీడియా ద్వారానే సమాధానం ఇచ్చింది. కొన్నాళ్లు అదే సోషల్ మీడియాకు దూరంగా ఉంది కూడా. అదే సమయంలో నాగచైతన్య, సమంత గురించి ఎన్నో పుకార్లు కూడా వైరల్ అయ్యాయి.


 


Also Read: పోలీసుల నోటీసులపై స్పందించిన ‘బేబీ’ డైరెక్టర్ సాయి రాజేష్, అసలు కారణం ఇదేనట!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial