టాలీవుడ్ హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'డెవిల్'. ఈ పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ కి ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్ లైన్. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ 24న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీనికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ చేయాలని నిర్ణయించుకున్న మేకర్స్.. తాజాగా ఫస్ట్ సింగిల్ అప్డేట్ అందించారు. ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది కానీ, డైరెక్టర్ పేరు చేంజ్ అవ్వడమే అందరికీ షాకింగ్ గా అనిపిస్తోంది. 


నవీన్ మేడారం దర్శకత్వంలో 'డెవిల్' సినిమా షూటింగ్ ప్రారభించారనే సంగతి తెలిసిందే. 2021 జులై 21న టైటిల్ అండ్ ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్ చేసినప్పుడు కూడా దర్శకుడిగా నవీన్ పేరే ఉంది. 2023 ఉగాదికి స్పెషల్ పోస్టర్ విడుదల చేయడం వరకూ నవీన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నట్లుగా ప్రచారం చేయబడింది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ, కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ దగ్గర నుంచి ఏ ప్రమోషనల్ కంటెంట్ లోనూ డైరెక్టర్ పేరు కనిపించలేదు. కనీసం నిర్మాణ సంస్థ ట్వీట్స్ లో కూడా దర్శకుడిని ట్యాగ్ చేయకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.


'డెవిల్' చిత్రాన్ని దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఇటీవల కాలంలో రిలీజ్ చేసిన పోస్టర్స్ ను గమనిస్తే, డైరెక్టర్ పేరుకి బదులుగా 'అభిషేక్ పిక్చర్స్ ఫిల్మ్' అని ప్రచారం చేయబడుతోంది. ఇలా డైరెక్టర్ ను సైడ్ చేయడంతో ఈ ప్రాజెక్ట్ విషయంలో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. దర్శకుడు నవీన్ మేడారం ను  ఈ సినిమా నుంచి తప్పించి, నిర్మాతే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చూసుకుంటున్నారనే కామెంట్లు కూడా వినిపించాయి.


దీనికి తగ్గట్టుగానే రీసెంట్ గా 'డెవిల్' డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని తెలుపుతూ మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలలో నవీన్ మేడారం కనిపించలేదు. ఈ మధ్య సంయుక్త బర్త్ డేకి వదిలిన నైష‌ధ పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ లోనూ దర్శకుడిని విస్మరించారు. ఇప్పుడు లేటెస్టుగా 'మాయే చేసేయ్' అనే పాటని రిలీజ్ చేయబోతున్నట్లు పేర్కొంటూ, డెవిల్ నుంచి ఓ కొత్త పోస్టర్ వచ్చింది. ఇందులో డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ అభిషేక్ నామా పేరు ఉండటంతో అందరూ షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలో నవీన్ ను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించారా? లేదా అతనే తప్పుకున్నాడా? ఇదంతా నందమూరి కళ్యాణ్ రామ్ కి తెలిసే జరిగిందా? అసలు అభిషేక్ నామా ఎందుకు మెగా ఫోన్ పట్టాల్సి వచ్చింది? అనే చర్చలు మొదలయ్యాయి. 


Also Read: టాలీవుడ్‌లో మళ్లీ మొదలైన వాయిదాల పర్వం, 'సలార్' సృష్టించిన గందరగోళమే కారణమా?


నవీన్ మేడారం కొత్త దర్శకుడేమీ కాదు. లండన్‌ లో ఫిల్మ్ మేకింగ్‌లో డిప్లొమా చేసి, 'లండన్ లైఫ్' & 'నైస్ టూ మీట్ యు' వంటి బ్రిటిష్ సినిమాలను డైరెక్ట్ చేసారు. 'ది డా విన్సీ కోడ్', 'ఎక్స్-మెన్: ది లాస్ట్ స్టాండ్ ది లాస్ట్ స్టాండ్', 'పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్', 'ప్రిన్స్ ఆఫ్ పర్షియా: ది సాండ్స్ ఆఫ్ టైమ్', '2012', 'హ్యారీ పాటర్ అండ్ ది హాఫ్-బ్లడ్ ప్రిన్స్', 'హ్యారీ పాటర్ అండ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫీనిక్స్', 'ది డార్క్ నైట్', '10000 బిసి' వంటి ఎన్నో పాపులర్ హాలీవుడ్ చిత్రాలకు విఎఫెక్స్ ఆర్టిస్టుగా వర్క్ చేశారు. ఇక 'బాబు బాగా బిజీ' మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు.. ఆహా ఓటీటీ కోసం 'సిన్' అనే వెబ్ సిరీస్ ను రూపొందించారు. ఇలాంటి ఫిల్మోగ్రఫీ ఉన్న నవీన్ ను 'డెవిల్' ప్రాజెక్ట్ నుంచి తప్పించడం ఆసక్తికరంగా మారింది. 


నిజానికి 'డెవిల్' పోస్టర్స్ లో తన నేమ్ లేనప్పటికీ నవీన్ మేడారం ట్విట్టర్ వేదికగా ఈ సినిమాని ప్రమోట్ చేస్తూనే ఉన్నాడు. కళ్యాణ్ రామ్ బర్త్ డేకి నిర్మాతతో కలిసి వెళ్లి హీరోకి శుభాకాంక్షలు తెలిపాడు. అలానే ఏప్రిల్ లో నవీన్ పుట్టినరోజుకి అభిషేక్ నామా స్వయంగా కేక్ కట్ చేసి విషెస్ అందజేశారు. ఇద్దరూ అంత బాగా ఉన్నప్పుడు, ఈ గ్యాప్ లో దర్శక నిర్మాతల మధ్య ఏం జరిగిందనేది అర్థం కావడం లేదు. ఉన్నట్టుండి ఈ చిత్రానికి అభిషేక్ దర్శకత్వం వహిస్తున్నట్లుగా పోస్టర్స్ లో కనిపిస్తోంది. మరి త్వరలోనే 'డెవిల్' డైరెక్టర్ మార్పు వెనుకున్న కారణాన్ని త్వరలోనే వెల్లడిస్తారేమో చూడాలి. 


Also Read: బేబీ ఫుల్ బిజీ.. క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న తెలుగమ్మాయి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial