ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులు అలజడి రేపారు. ఇద్దరు ఇంజినీర్లను కిడ్నాప్ చేశారు. బీజాపూర్ జిల్లాలో ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద నిర్మించే రోడ్ల పనుల్లో ఇంజినీర్లుగా పని చేస్తున్న రోషన్ లక్రా, లక్ష్మణ్ కనిపించడం లేదు. వీరిద్దరూ పనులు పరిశీలించేందుకు వెళ్లారు. దీంతో మావోయిస్టులు కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇప్పటి వరకు కిడ్నాప్‌పై నక్సలైట్లు ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే పోలీసులు కూడా ఎలాంటి అధికారిక ధృవీకరణ చేయలేదు.
Also Read : మటన్ కత్తితో ఫ్రెండ్ గొంతు కోసేసి హత్య.. కారణం తెలిసి అవాక్కైన స్థానికులు
ఛత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఇటీవల ఆర్కే చనిపోయిన తర్వాత నివురు గప్పిన నిప్పులా ఉంది. అయితే భద్రత మధ్య అభివృద్ది పనులు చేస్తున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం గోర్నాలో కొంత మంది కాంట్రాక్టర్లు రోడ్లు వేస్తున్నారు. ఈ పనులు పరిశీలించేందుకు అప్పుడప్పుడూ ఇంజినీర్లు వెళ్తున్నారు. ఈ విషయం తెలిసి నక్సల్స్ ప్రణాళిక ప్రకారం కిడ్నాప్ చేసినట్లుగా భావిస్తున్నారు. వారి డిమాండ్లేమిటన్నది తమ వద్దే వారు ఉన్నారని చెప్పిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.
Also Read: విగ్గు ధరించి వ్యక్తి అరాచకం, జోరుగా సహజీవనం.. అందినకాడికి దండుకొని చివరికి..
మరోవైపు ఛత్తీస్‌ఘడ్‌లో ఇన్ఫార్మార్ పేరుతో ఓ సహచర మావోయిస్టుకు ప్రజాకోర్టులో మరణశిక్ష విధించారు. కోయిలిబెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుమూల నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన గట్టకల్ గ్రామంలో నక్సలైట్లు గురువారం ప్రజాకోర్టును నిర్వహించారు. ఇందులో 3 గ్రామాలకు చెందిన వందలాది మంది గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ జన్ అదాలత్‌లో 40 మందికి పైగా సాయుధ మావోయిస్టులు కూడా ఉన్నట్లు సమాచారం. తమ తోటి నక్సలైట్ దినేష్ నూరేటిని గ్రామస్తులందరి ముందు తాడుతో కట్టి తీసుకొచ్చి దినేష్ పోలీస్ కోవర్ట్ అని నక్సలైట్లు గ్రామస్తులకు తెలిపారు. మావోయిస్టుల గురించి ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం అందిస్తున్నారని అతన్ని ఏమి చేయాలని ప్రశ్నించారు. గ్రామస్తులంతా దేశద్రోహికి మరణమే శిక్ష అని అనడంతో పదునైన ఆయుధంతో గొంతు కోసి హత్య చేశారు.
Also Read: పంచ్ ప్రభాకర్ కోసం ఇంటర్‌పోల్ బ్లూ నోటీస్ ! ఆచూకీ తెలిసిన వెంటనే అరెస్ట్ ?
తెలంగాణలోని ములుగు జిల్లాలో కూడా మావోయిస్టు వాల్ పోస్టర్లు కలకలం రేపాయి. వెంకటాపురం మండలం విజయపూరి కాలనీ గ్రామ సమీపంలోని భద్రాచలం-వెంకటాపురం జాతీయ ప్రదాన రహదారి పైభీమదేవర కొండ అమరవీరులకు జోహార్లు అంటూ పట్టపగలే వాల్ పోస్టర్లు అంటించారు. ఇటీవల ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు చనిపోయారు. అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దామని అందులో పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Also Read: పేకాట బిజినెస్‌లో నాగశౌర్య తండ్రి కూడా పార్టనరే..! అరెస్ట్ చేసిన పోలీసులు.. బెయిలిచ్చిన కోర్టు !