హైదరాబాద్‌లో కార్తీక్ వర్మ పేరుతో చెలామణి అవుతూ ఓ వ్యక్తి అరాచకం సృష్టించాడు. పలువురిని నమ్మించి మోసం చేసి, డబ్బుతో ముఖం చేయడం వంటి లీలలు బయటపడ్డాయి. దీంతో అతని బాధితులు ఫిర్యాదు మేరకు నిందితుణ్ని పోలీసులు పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి గచ్చిబౌలికి మకాం మార్చి పలు నేరాలు చేశాడు. తాజాగా పోలీసులు ఆ వివరాలను వెల్లడించారు.


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా నుంచి వలస వచ్చి గచ్చిబౌలిలో స్థిరపడిన షేక్‌ మహ్మద్‌ రఫీ సోషల్‌ మీడియాలోనే కాకుండా తన పేరును కార్తీక్‌ వర్మగా మార్చుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ ద్వారా పలువురు యువతులను ఆకర్షించాడు. ప్రేమ, సహజీవనం, పెళ్లి పేరుతో వారిని నమ్మించి లొంగదీసుకొని చివరికి బ్లాక్ మెయిలింగ్‌లకు దిగాడు. అందినకాడికి దండుకుని నిండా ముంచుతుండడం అలవాటుగా చేసుకున్నాడు. ఈ ఘరానా మోసగాడిని నార్త్ టాస్క్‌జోన్ పోలీసులు పట్టుకున్నారు. ఇతని నుంచి రూ.9 లక్షల విలువైన 18 తులాల బంగారు నగలు, నకిలీ ఐడీ కార్డులు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.


తూర్పు గోదావరి జిల్లా తుని మండలం హంసవరానికి చెందిన మహ్మద్ రఫీ పాలిటెక్నిక్‌ చదువు మధ్యలోనే నిలిపేశాడు. ఉద్యోగం కోసం 2010లో హైదరాబాద్‌కు వచ్చి గచ్చిబౌలిలో స్థిరపడ్డాడు. మొదట్లో అక్కడక్కడా పనులు చేసుకుంటూ జీవనం సాగించాడు. 2017లో ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ కుమార్తె కూడా పుట్టింది. అనంతరం వరకట్న వేధింపులు చేయడంతో వేరుపడిన భార్య నెల్లూరు జిల్లాలోని గూడూరు పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసింది.


అబద్ధాలతో వలలో వేసుకొని..
విలాసాలకు అలవాటుపడి డబ్బుల కోసం అడ్డదారులు తొక్కాడు. కార్తీక్‌ వర్మ పేరుతో సామాజిక మాధ్యమాల్లో ప్రొఫైల్స్ తెరిచాడు. వీటితో యువతులు, మహిళలకు రిక్వెస్ట్‌ పంపి వలలో వేసుకునేవాడు. ఫ్రెండ్స్‌గా మారిన వారితో తాను భారత సంతతికి చెందిన వాడినని, అమెరికాలో పుట్టానని నమ్మబలికాడు. తన తల్లిదండ్రులు చిన్నతనంలోనే వేరయ్యారని.. తల్లి సింగపూర్‌లో డాక్టర్‌ అని నమ్మించేవాడు. ఇతనికి బట్టతల ఉన్నా విగ్గు పెట్టుకొని మరీ యువతులను ఆకర్షించినట్లుగా పోలీసులు తెలిపారు.


Also Read : బట్టలిప్పేసి నగ్నంగా పక్కింటికి వెళ్లిన యువకుడు.. ఏం చేశాడంటే..!


ప్రేమ, పెళ్లి, సహజీవనం అంటూ వారితో సన్నిహితంగా మారేవాడు. కొన్నాళ్లు ప్రేమగా వ్యవహరించే రఫీ ఆపై బ్లాక్‌మెయిలింగ్‌కు దిగడం మొదలెట్టాడు. కొందరిని బెదిరించి, మరికొందరితో అత్యవసరంగా డబ్బులు కావాలి.. తిరిగి ఇస్తానంటూ డబ్బు, నగలు గుంజేవాడు. తిరిగి ఇవ్వమంటే వారి ఫోన్ నెంబర్లు బ్లాక్‌ చేయడం, తన నివాసం మార్చేసి తప్పుకోవడం వంటివి చేశాడు. ఇలా హైదరాబాద్‌లోనే ఐదుగురు మహిళలను మోసం చేశాడు. వీరిలో ఓ యువతి ఎస్ఆర్‌ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరిపి రఫీని పట్టుకున్నారు.


Also Read: క్షమాభిక్ష లేదని కోర్టు చెప్పేసింది.. కొన్ని గంటల్లోనే ఉరి శిక్ష.. అప్పుడే ఊహించని ట్విస్ట్


Also Read: పేకాట బిజినెస్‌లో నాగశౌర్య తండ్రి కూడా పార్టనరే..! అరెస్ట్ చేసిన పోలీసులు.. బెయిలిచ్చిన కోర్టు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి