MP Officer Hema Meena: 


మహిళా ఇంజనీర్ ఇంట్లో తనిఖీలు 


నెల జీతం రూ.30 వేలు. కానీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? రూ.7 కోట్లు. అట్లుంటది మరి సర్కార్ కొలువంటే. ప్రభుత్వ ఉద్యోగులందరూ అలానే ఉంటారని కాదు. కొందరు మాత్రం ఇలా ఓ రేంజ్‌లో ఆస్తులు వెనకేసుకుంటారు. మధ్యప్రదేశ్‌లో పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్‌లో (Madhya Pradesh Police Housing Corporation) ఇన్‌ఛార్జ్ అసిస్టెంట్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగి ఆస్తుల చిట్టా చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. యాంటీ కరప్షన్ రెయిడ్స్‌లో భాగంగా హేమ మీనా ఇంట్లో సోదాలు నిర్వహించారు అధికారులు. లెక్క పెడుతున్న కొద్ది ఆ చిట్టా పెరుగుతూనే ఉంది. మొత్తం 20 వాహనాలున్నాయి. వాటిలో 5-7 లగ్జరీ కార్లే. 20 వేల చదరపు అడుగులు స్థలం కూడా ఉంది. గిర్‌ జాతికి చెందిన ఆవులు 24 ఉన్నాయంటే...వాటి విలువ ఎంతో అంచనా వేసుకోవచ్చు. 98 ఇంచుల హైఎండ్ టీవీ కూడా ఈ లిస్ట్‌లో ఉంది. అది ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ప్రైస్ ట్యాగ్‌ చూసి అధికారులు షాక్ అయ్యారు. రూ.30 లక్షల విలువ చేసే టీవీ అది. రూ.30 వేల నెల జీతం ఉన్న ఉద్యోగికి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయనేది షాకింగ్‌గా ఉంది. వీటిలో కొన్ని ఆస్తులు ఆమె పేరిట ఉండగా..మరి కొన్ని కుటుంబ సభ్యుల పేరిట ఉన్నాయి. అందులోనూ ఆమె ఉద్యోగంలో చేరి పదేళ్లు మాత్రమే అవుతోంది. పదేళ్లలోనే ఇంత ఎలా సంపాదించింది అనేదే అంతు చిక్కని ప్రశ్న. విలువైన ఆస్తులతో పాటు 100 కుక్కలు, వైర్‌లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్, మొబైల్ జామర్స్‌తో పాటు మరికొన్ని విలువైన వస్తువులనూ స్వాధీనం చేసుకున్నారు. 


తండ్రి పేరిట స్థలం 


లోకాయుక్త స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ (SPE) అధికారులు సోలార్ ప్యానెల్స్ రిపేర్ చేయాలంటూ లోపలకు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. అప్పుడే ఈ ఆస్తులన్నీ బయటపడ్డాయి. కేవలం ఒక్కరోజులోనే రూ.7 కోట్లు ఆస్తుల్ని జప్తు చేశారు. ఆమె ఇన్‌కమ్‌తో పోల్చుకుంటే ఈ ఆస్తుల విలువ 232% కన్నా ఎక్కువే. తన తండ్రి పేరు మీద 20 వేల చదరపు అడుగులు స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ తరవాత కోటి రూపాయల విలువ చేసే ఇల్లు కట్టారు. రైజెన్, విదిష జిల్లాల్లోనూ కొన్ని స్థలాలు ఆమె పేరిట ఉన్నట్టు గుర్తించారు. మరో ట్విస్ట్ ఏంటంటే...పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్‌ కోసం వాడాల్సిన మెటీరియల్‌ని తన ఇల్లు కట్టుకోడానికి వాడారు. వీటితో పాటు భారీ వ్యవసాయ మెషీన్లనూ స్వాధీనం చేసుకున్నారు. భోపాల్ లోకాయుక్త ఎస్‌పీ కీలక విషయాలు వెల్లడించారు. మొత్తం మూడు చోట్ల సెర్చ్ ఆపరేషన్‌లు జరిగాయని తెలిపారు. రూ.5-7 కోట్ల విలువైన ఆస్తుల్ని ఇప్పటి వరకూ గుర్తించినట్టు స్పష్టం చేశారు. మిగతా డిపార్ట్‌మెంట్‌ల సహకారం కూడా తీసుకుని పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. 


Also Read: Karnataka Election 2023: సౌతాఫ్రికా EVMలనే కర్ణాటకలో వాడారంటూ కాంగ్రెస్ ఆరోపణలు, కొట్టి పారేసిన ఈసీ